మొదటి శుభలేఖ అతనికే!
ఢిల్లీలో వివాహం
ముంబయ్‌లో రిసెప్షన్
♦ మలయాళ అందం అసిన్ ఉత్తరాది ఇంటి కోడలు కాబోతున్న విషయం తెలిసిందే. వ్యాపారవేత్త రాహుల్ శర్మను ఆమె ప్రేమ వివాహం చేసుకోనున్నారు. ఈ నెల 23న వీరి వివాహం అత్యంత వైభవంగా జరగనుంది. ప్రస్తుతం అసిన్, రాహుల్ పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. ఆ మధ్య ‘సేవ్ యువర్ డేట్’ అంటూ కార్డులు పంచిన ఈ కాబోయే దంపతులు ఇప్పుడు శుభలేఖలు పంచుతున్నారు. అసిన్, రాహుల్‌ల లవ్‌స్టోరీ, పెళ్లి ఏర్పాట్లు గురించి తెలుసుకుందాం....
♦ దక్షిణాదిన పలు చిత్రాల్లో కథానాయికగా నటించి, ‘గజిని’ హిందీ రీమేక్ ద్వారా ఉత్తరాది తెరకు పరిచయమయ్యారు అసిన్. ఆ చిత్రంతోనే బాలీవుడ్‌లో బోల్డంత క్రేజ్ తెచ్చుకున్నప్పటికీ అవకాశాలు అంతంత మాత్రంగానే వచ్చాయి. కెరీర్‌పరంగా అసిన్‌కి నార్త్ కలిసొచ్చినా రాకపోయినా అక్కడికి వెళ్లడం ద్వారా వ్యక్తిగతంగా అసిన్‌కి కలిసొచ్చిందనే చెప్పాలి. అక్షయ్ కుమార్‌తో కలిసి ‘హౌస్‌ఫుల్ 2’, ‘కిలాడి 786’ చిత్రాల్లో నటించినప్పుడు అతని ద్వారా వ్యాపారవేత్త రాహుల్ శర్మతో అసిన్‌కి ఏర్పడిన పరిచయం పెళ్లి వరకూ వచ్చేసింది.
♦ అసిన్‌కి గ్రాండ్ లెవల్‌లో రాహుల్ శర్మ లవ్ ప్రపోజ్ చేశారు. ఆ సమయంలో సుమారు ఆరు కోట్ల రూపాయలు విలువ చేసే వజ్రపుటుంగరాన్ని అసిన్‌కి రాహుల్ బహూకరించారనే వార్త ప్రచారమైంది. వాస్తవానికి అక్షయ్‌కుమార్ పరిచయం చేసినప్పుడు అసిన్, రాహుల్ జస్ట్ ‘హాయ్’ చెప్పుకున్నారట. ఆ తర్వాత పలు సందర్భాల్లో కలుసుకున్నప్పుడు కూడా పెద్దగా మట్లాడుకునేవాళ్లు కాదట. చాలా బిడియంగా ఉండేవారని అక్షయ్ ఓ సందర్భంలో అన్నారు. చివరకు అక్షయ్ చొరవ వల్లే ఇద్దరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఆ మామూలు మాటలు చివరికి ప్రేమకబుర్లుగా మారిపోయాయి.
♦ అసిన్‌ని రాహుల్ శర్మకు పరిచయం చేసింది తానే అయినప్పటికీ, వాళ్ల పెళ్లి కుదరడానికి తాను మాత్రం కారణం కాదనీ, ఎందుకంటే తానేం మ్యాచ్ మేకర్ కాదనీ ఇటీవల ఓ సందర్భంలో అక్షయ్ కుమార్ చమత్కరించారు. ఏదేమైనా తాము ఒకరికొకరు పరిచయం కావడానికి కారణమైన అక్షయ్ అంటే అసిన్‌కి అభిమానం ఏర్పడింది. రాహుల్‌కి అక్షయ్ మీద ఆల్రెడీ ఉన్న అభిమానం రెట్టింపు అయ్యింది.
♦ అక్షయ్ మీద ఉన్న అభిమానంతో అసిన్, రాహుల్ తమ తొలి శుభలేఖను ఆయనకే ఇచ్చారు. ఇద్దరూ స్వయంగా వెళ్లి, పెళ్లికి తప్పనిసరిగా రావాలని కోరారు. ‘‘నా క్లోజ్ ఫ్రెండ్స్ రాహుల్, అసిన్‌ల తొలి వెడ్డింగ్ కార్డ్‌ని ముందు నేనే అందుకున్నా. చాలా ఆనందంగా ఉంది. వాళ్లిద్దరూ జీవితాంతం ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నా’’ అని అక్షయ్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. డార్క్ బ్రౌన్ కార్డుపై బంగారు రంగు డిజైన్‌తో వెడ్డింగ్ కార్డు కవర్ చూడముచ్చటగా ఉంది.
♦ విశేషం ఏంటంటే.. వెడ్డింగ్ కార్డ్‌కన్నా ముందు అసిన్, రాహుల్ మరో మెటల్ కార్డుని తయారు చేశారు. అది ‘సేవ్ ది డేట్ కార్డ్’. జనవరి 23ని మా కోసం సేవ్ చేసుకోండి అంటూ ప్రత్యేకంగా కార్డ్ తయారు చేసి, గత ఏడాది చివర్లో ఆహ్వానితులకు అందజేశారు. ఆదివారం శుభలేఖలు పంచే కార్యక్రమం మొదలుపెట్టారు.
♦ పెళ్లి బట్టల గురించి చెప్పాలంటే.. ప్రముఖ డిజైనర్ సబ్యసాచిని అసిన్, రాహుల్ సంప్రతించారట. సినిమాలకే కాకుండా వ్యక్తిగతంగా కూడా పలువురు ప్రముఖ హిందీ తారలకు కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తుంటారు సబ్యసాచి. ముంబయ్‌లో ఆయనకో పెద్ద డిజైనర్ స్టోర్ ఉంది. అసిన్, రాహుల్ అక్కడికెళ్లి, మ్యారేజ్, సంగీత్, మెహందీ రిసెప్షన్ వేడుకలకు కావల్సిన డిజైనర్ వేర్‌ని ఆర్డర్ చేశారట. ఢిల్లీలోని ఓ ఐదు నక్షత్రాల హోటల్‌లో వివాహం, ముంబయ్‌లో రిసెప్షన్ జరగనున్నాయి. మెహందీ, సంగీత్, పెళ్లి, ఆ తర్వాత రిసెప్షన్.. ఇవన్నీ జీవితాంతం ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిపోయేలా రాహుల్, అసిన్ ప్లాన్ చేస్తున్నారు.