
200% రాంగ్ న్యూస్..
అభిమానుల భారీ అంచనాల మధ్య షూటింగ్ జరుపుకుంటున్న రెండు పెద్ద సినిమాలు ఒకే రోజున ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాయనే ప్రచారం ఊపందుకుంటోంది. శంకర్ హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కించిన రోబో సినిమా సీక్వెల్ రోబో 2.0, తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన రాజమౌళి బాహుబలి పార్ట్ 2 సినిమాలు 2017 ఏప్రిల్ 17 వ తేదీన విడుదల కానున్నాయనే వార్త ప్రస్తుతం హల్ చల్ చేస్తుంది. అదే నిజమైతే రెండు భారీ సినిమాల మధ్య నెలకొనే పోటీ భారతీయ చలన చిత్ర చరిత్రలో నిలిచిపోతుంది. అభిమానులకు పెద్ద పరీక్షగా తయారవుతుంది.
ఇటీవలే బాహుబలి-2 సినిమాను ఏప్రిల్ 17, 2017లో విడుదల చేస్తామంటూ సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మరోవైపు శంకర్ 'ఐ' సినిమా పరాజయం తరువాత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న సినిమా రోబో 2.0 ను తమిళ నూతన సంవత్సరం ఆరంభం సందర్భంగా అదే రోజున విడుదల చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో రజనీకాంత్కు ప్రతినాయకుడిగా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తుండటం విశేషం. ఈ క్రమంలో రెండు సినిమాలు ఒకే రోజున థియేటర్లకు రావడమనేది సినిమా మార్కెట్ను దెబ్బ తీస్తుందనేది విశ్లేషకుల మాట.
అయితే బాహుబలి-2, రోబో2.0 సినిమాలు ఒకే రోజు విడుదల అవుతాయనే వార్త 200% రాంగ్ న్యూస్ అంటూ బాహుబలి మార్కెటింగ్ పీఆర్ మహేష్ ఎస్ కోనేరు ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఏది ఏమైనా తెలుగు బాహుబలికి తమిళంలో ఎంత డిమాండ్ ఉందో.. తమిళ రోబోకు కూడా తెలుగులో అంతే డిమాండ్ ఉందనేది అభిమానులందరికీ తెలిసిన విషయమే.