బాహుబలి చీరలు.. బంపర్ హిట్టు!!
బాహుబలి-2 సినిమా వచ్చినప్పటి నుంచి ప్రతి విషయంలో ఆ సినిమా మానియా స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా ఈ మానియా చీరలకు కూడా పాకింది. బాహుబలి సినిమా పోస్టర్లనే చీరల మీద ప్రింట్ చేసి, వాటిని అమ్ముతుంటే.. హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం అయిన ఏలూరులోని ఒక మిల్లులో ఈ చీరలను ప్రింటింగ్ చేయిస్తున్నారు. సినిమాలోని కొన్ని దృశ్యాలను ఎంపిక చేసుకుని, మంచి రంగులతో చీరల మీద వాటిని ప్రింట్ చేయిస్తున్నారు. తొలి బ్యాచ్‌లో కేవలం 50 చీరలు మాత్రమే ప్రింట్ చేయించి కొంతమంది స్నేహితులు వాటిని పంచుకున్నారు. సినిమా విడుదల రోజున వాళ్లంతా కలిసి ఆ చీరలు కట్టుకుని సినిమా చూశారు.
దేవసేన, అమరేంద్ర బాహుబలి ఇద్దరూ విల్లు పట్టుకుని, ఒక్కొక్కరు మూడేసి బాణాలు పట్టుకుని ఉన్న ఫొటోను చీర పల్లు మీద ప్రింట్ చేయించారు. దాంతోపాటు మాహిష్మతి సామ్రాజ్యాన్ని కూడా మొత్తం చీరమీద వచ్చేలా ప్రింట్ చేశారు. ఆ చీరలు కట్టుకుని తన స్నేహితురాళ్లతో ఉన్న ఫొటోను ఫేస్‌బుక్‌లోను, వాట్సప్‌లోను ఒక మహిళ పోస్ట్ చేయగా, అది విపరీతంగా వైరల్ అయ్యింది. ఆ చీరలు తమకు కావాలంటే తమకు కావాలంటూ ఆమెకు విపరీతంగా ఫోన్లు వచ్చాయి. దాంతో ఇప్పుడు దాదాపు మరో 500 వరకు చీరలకు ఆర్డర్ ఇచ్చారు. ఈసారి రమ్యకృష్ణ, రాణా దగ్గుబాటిల ఫొటోలు కూడా వేయిస్తున్నారు. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కూడా ఈ చీరల ఫొటోను గతంలో తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇంతకుముందు రజనీకాంత్ నటించిన కబాలి సినిమా సన్నివేశాలను కూడా ఇలా చీరల మీద ప్రింట్లు వేయించారు.