
చిరు నెక్ట్స్ సినిమాకు బాహుబలి టీం..?
రీ ఎంట్రీలో సత్తా చాటిన మెగాస్టార్ చిరంజీవి.. వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే సురేందర్ రెడ్డి, బోయపాటి శ్రీను, పూరి జగన్నాథ్ లాంటి దర్శకులను లైన్ లో పెట్టిన మెగాస్టార్, ఈ ఏప్రిల్ లోనే కొత్త సినిమా ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. మెగా రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150ని నిర్మించిన రామ్ చరణ్ 151వ సినిమాను కూడా నిర్మించేందుకు రెడీ అవుతున్నాడు.
చిరు మార్కెట్ స్టామినా ప్రూవ్ అవ్వటంతో నెక్ట్స్ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించాలని భావిస్తున్నారు. అందుకే చిరు కలల ప్రాజెక్ట్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను వెండితెర మీద ఆవిష్కరించే ఆలోచన చేస్తున్నారు. ఈ సినిమా 1840ల నాటి కథ కావటంతో అందుకు తగ్గట్టుగా భారీ సెట్ లు గ్రాఫిక్స్ అవసరం కానున్నాయి.
అందుకే చరణ్ తో కలిసి మగధీర సినిమాలకు పని చేసిన గ్రాఫిక్స్ డిజైనర్ కనల్ కణ్ణన్ తో చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుతం కనల్ బాహుబలి 2 పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. బాహుబలి పని పూర్తవ్వగానే అదే టీంను ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాకు తీసుకునే ఆలోచనలో ఉన్నారు మెగా టీం. ఈ సినిమాకు స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి.