పాత్ర కోసం ఎనిమిదిన్నర కేజీలు తగ్గిన బాలయ్య
పాత్ర కోసం ఎనిమిదిన్నర కేజీలు తగ్గిన బాలయ్య
Published Mon, Oct 21 2013 12:32 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM
బాలకృష్ణ లాంటి అనూహ్యమైన మాస్ ఇమేజ్ ఉన్న కథానాయకునితో తెలుగునేలపై అవుడ్డోర్ షూటింగ్ అంటే రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. పైగా... వైజాగ్ లాంటి మహానగరంలో వేలాది జనాల సాక్షిగా అంటే... ఇక చెప్పేదేముంది? అలాంటి సాహసానికే పూనుకున్నారు దర్శకుడు బోయపాటి శ్రీను. ఆయన దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకునిగా రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్న చిత్రం షూటింగ్‌ను 45 రోజుల పాటు వైజాగ్‌లో జరుపనున్నారాయన.
అక్కడ పది రోజుల పాటు విశాఖ నగర ప్రధాన వీధుల్లో బాలకృష్ణపై పోరాట సన్నివేశాలు, కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు బోయపాటి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ నానక్‌రామ్‌గూడా రామానాయుడు స్టూడియోలో జరుగుతోంది. అక్కడ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కోటి రూపాయల భారీ సెట్‌లో బాలకృష్ణ, ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఈ షెడ్యూల్ ముగియనుంది.
తదనంతరం ఈ నెల 23 నుంచి వైజాగ్ షెడ్యూల్ మొదలవుతుంది. ఇదిలావుంటే... ఈ సినిమాలో బాలకృష్ణ రెండు భిన్నమైన గెటప్పుల్లో కనిపించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇందులో ఓ గెటప్ కోసం తయారు చేసిన విగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని తెలుస్తోంది. పైగా ఈ గెటప్ కోసం బాలయ్య ఎనిమిదిన్నర కేజీలు బరువు తగ్గినట్లు తెలిసింది.
ఫిఫ్టీ ప్లస్‌లో బరువు తగ్గడం అంటే... నిజంగా సాహసమే. ‘సింహా’ని మించే స్థాయిలో ఈ సినిమా ఉంటుందని, శక్తిమంతమైన కథాంశంతో బోయపాటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని యూనిట్ వర్గాల భోగట్టా. అభిమానులకే కాక, సగటు ప్రేక్షకులందరినీ అలరించే రీతిలో ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. దేవిశ్రీప్రసాద్ స్వరాలందిస్తున్న ఈ చిత్రంలో రాధిక ఆప్టే, సోనాల్ చౌహాన్ కథానాయికలు.
Advertisement
Advertisement