మాకు ‘అమ్మ’ పాట వదిలి తను వెళ్లిపోయాడు : బూచేపల్లి వెంకాయమ్మ | Band Balu release on 6 December | Sakshi
Sakshi News home page

మాకు ‘అమ్మ’ పాట వదిలి తను వెళ్లిపోయాడు : బూచేపల్లి వెంకాయమ్మ

Nov 29 2014 11:31 PM | Updated on Sep 2 2017 5:21 PM

మాకు ‘అమ్మ’ పాట వదిలి తను వెళ్లిపోయాడు : బూచేపల్లి వెంకాయమ్మ

మాకు ‘అమ్మ’ పాట వదిలి తను వెళ్లిపోయాడు : బూచేపల్లి వెంకాయమ్మ

మా సంస్థలో నిర్మించిన ఐదో చిత్రం ఇది. ఇందులో అన్ని పాటలూ బాగుంటాయి. ముఖ్యంగా ‘అమ్మ’ పాట చాలా హృద్యంగా ఉంటుంది.

 ‘‘మా సంస్థలో నిర్మించిన ఐదో చిత్రం ఇది. ఇందులో అన్ని పాటలూ బాగుంటాయి. ముఖ్యంగా ‘అమ్మ’ పాట చాలా హృద్యంగా ఉంటుంది. మా అబ్బాయి ఆ పాట మాకు వదిలి తను తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు’’ అని బూచేపల్లి వెంకాయమ్మ అన్నారు. కమలాకర్ హీరోగా చింతలపూడి వెంకట్ దర్శకత్వంలో బూచేపల్లి వెంకాయమ్మ సమర్పణలో బి. నాగలక్ష్మి నిర్మించిన ‘బ్యాండు బాలు’ చిత్రం వచ్చే నెల 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కమలాకర్ తల్లి వెంకాయమ్మ తన కొడుకుని గుర్తు చేసుకున్నారు.
 
 ఈ చిత్రంలో ‘అమ్మ...’ మీద ఉన్న పాటను తన గుర్తుగా మాకు వదిలేసి, తను వెళ్లిపోయాడని కన్నీటి పర్యంతమయ్యారు. కమలాకర్ పిల్లల కోసం తాము బతుకుతున్నామనీ, లేకపోతే తను వెళ్లిపోయినప్పుడే మేమూ... అంటూ దుఃఖంతో మాట్లాడలేకపోయారు. కమలాకర్ తండ్రి బూచేపల్లి సుబ్బారెడ్డి మాట్లాడుతూ -‘‘2012లో ఈ చిత్రం షూటింగ్ మొదలుపెట్టి, పది నెలల్లో పూర్తి చేశాం. విడుదలకు సిద్ధం చేస్తున్న సమయంలో కమలాకర్ మరణం మమ్మల్ని కలిచివేసింది. ఆ మానసిక క్షోభ కారణంగా విడుదల చేయలేదు. ఇప్పుడు కొంచెం తేరుకున్నాం. సెంటిమెంట్, కామెడీ, ఫ్యామిలీ అంశాలతో రూపొందించిన ఈ చిత్రాన్ని అందరూ చూడాలని కోరుకుంటున్నాం’’ అన్నారు.
 
 సినిమా మీద మమకారంతో లాభాలను బేరీజు వేసుకోకుండా కమలాకర్ సినిమాలు తీసి, పది మందికి ఉపాధి కల్పించాడని నటుడు చలపతిరావు చెప్పారు. దర్శకుడు చింతలపూడి వెంకట్ మాట్లాడుతూ -‘‘ఈ చిత్రంలో అమ్మ సెంటిమెంట్ మీద ఒక పాట ఉంది. ఈ పాట చిత్రీకరిస్తున్న సమయంలో వెంకాయమ్మగారు షూటింగ్‌కి వస్తే, ఆవిడ కూడా ఉంటే బాగుంటుందన్నాను. కానీ, కమలాకర్ వద్దన్నాడు. చివరికి ఆయన భార్య, ‘అమ్మ పాటే కదా.. ఉంటే బాగుంటుంది’ అనడంతో కమలాకర్ అంగీకరించాడు. ఈ విధంగా ఈ పాటలో ఆమె ఉన్నారు. ‘ప్రతి తల్లికీ ఈ పాట మంచి బహుమతి’ అని కమలాకర్ అనేవారు. అంత గొప్పగా ఉంటుంది’’ అన్నారు. కమలాకర్ సోదరుడు శివప్రసాద్‌రెడ్డి, నటులు బెనర్జీ, శ్రీనివాసరెడ్డి మాట్లాడారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement