అన్నయ్య సాయిశ్రీనివాస్, తండ్రి సురేష్, తల్లి పద్మతో బెల్లంకొండ గణేష్
నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా మంచి ఫామ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బెల్లంకొండ సురేష్ రెండో కుమారుడు గణేష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం శనివారం హైదరా బాద్‌లో ప్రారంభమైంది. బీటెల్ లీఫ్ ప్రొడక్షన్స్‌తో కలిసి లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి పవన్ సాదినేని దర్శకుడు. ముహూర్తపు సన్నివేశానికి హీరో సాయి శ్రీనివాస్ కెమెరా స్విచాన్ చేయగా, నిర్మాత ‘దిల్’ రాజు క్లాప్ ఇచ్చారు.
దర్శకుడు వీవీ వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. వినాయక్ మాట్లాడుతూ– ‘‘నన్ను బెల్లంకొండ సురేశ్ దర్శకునిగా పరిచయం చేస్తే, వాళ్ల పెద్దబ్బాయి సాయిని నేను హీరోగా పరిచయం చేశాను. ఇప్పుడు గణేష్ హీరోగా పరిచయం అవుతున్నందుకు ఆనందంగా ఉంది. ‘బ్రోచేవారెవరురా’ చిత్రదర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ చిత్రానికి మాటలు రాయటం విశేషం’’ అన్నారు. ‘‘మా అబ్బాయిని నేనే లాంచ్ చేద్దామనుకున్నాను. కానీ, బెక్కం వేణు, పవన్ సాదినేని మంచి కథతో వచ్చారు’’ అన్నారు బెల్లంకొండ సురేష్.
బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ– ‘‘ఏడాదిగా ఈ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నాము. గణేష్ ఈ కథకు సరిపోతాడని భావించి సురేష్‌గారికి చెప్పటంతో ఆయనకు కథ నచ్చి సరే అన్నారు’’ అని చెప్పారు. గణేష్ మాట్లాడుతూ– ‘‘ఈ కథ విన్నప్పుడు ఎమోషనల్ అయ్యాను. నేను ఇప్పుడు ఈ స్థానంలో ఉండటానికి కారణమైన నా ఫ్యామిలీకి రుణపడి ఉంటాను’’ అన్నారు. ‘‘నా తమ్ముడు హీరోగా పరిచయం అవటం సంతోషంగా ఉంది. మంచి కథతో హీరోగా లాంచ్ అవుతున్నాడు’’ అన్నారు సాయి శ్రీనివాస్. పవన్ సాదినేని మాట్లాడుతూ– ‘‘బ్యూటిఫుల్ లవ్‌స్టోరీతో మీ ముందుకు వస్తున్నాం. గణేశ్ ఈ కథకు కరెక్ట్‌గా సెట్ అయ్యాడు. రథన్ సంగీతం, కార్తీక్ ఘట్టమనేని కెమెరా సినిమాకు అదనపు ఆకర్షణ’’ అన్నారు. ‘‘కథ నచ్చి ఈ చిత్రానికి మాటలు రాస్తున్నాను’’ అన్నారు దర్శకుడు వివేక్ ఆత్రేయ.
Comments
Please login to add a commentAdd a comment