బెల్లంకొండ సాయి శ్రీనివాస్
‘‘కొత్త ఏడాది, పుట్టిన రోజు సందర్భంగా ఎటువంటి కొత్త నిర్ణయాలు తీసుకోలేదు. కాకపోతే కథల ఎంపికలో ఇకపై జాగ్రత్త వహిస్తా. ఏడాదికి ఒకటి రెండు సినిమాలైనా సరే మంచివి చేయాలనుకుంటున్నా. క్వాంటిటీ కంటే క్వాలిటీకి ప్రాధాన్యత ఇస్తా’’ అన్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ‘కందిరీగ, రభస’ చిత్రాల ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నభా నటేశ్ జంటగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ పతాకంపై జి.సుబ్రహ్మణ్యం నిర్మిస్తున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తయింది. కాగా నేడు తన పుట్టినరోజుని పురస్కరించుకుని సాయి శ్రీనివాస్ విలేకరులతో పంచుకున్న విశేషాలు.
► నా తొలి చిత్రం ‘అల్లుడు శీను’ తర్వాత వినోదంతో కూడిన పాత్ర చేయలేదు. సంతోష్ శ్రీనివాస్ అన్న తెరకెక్కిస్తోన్న చిత్రంలో తొలి సారి పూర్తి స్థాయి వినోదం నిండిన పాత్ర చేస్తున్నా. ఇందులో కాస్త ప్రేమకథ, చివరి 20 నిమిషాలు భావోద్వేగాలుంటాయి. ఈ చిత్రంలో చాలామంది హాస్యనటులున్నారు. దాదాపు రెండు గంటల సేపు ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకునేలా సన్నివేశాలుంటాయి. నా పాత్ర కొత్తగా ఉంటుంది. వినోదం పండించడం కష్టమే.. కానీ చాలెంజింగ్ పాత్రలు చేయడం చాలా ఇష్టం.
► సంతోష్ అన్న మా బ్యానర్‌లో తీసిన ‘కందిరీగ, రభస’ చిత్రాల కథలు విన్నా.. ఇప్పుడు ఆయనతో సినిమా చేస్తున్నా.. చాలా ప్రతిభ ఉన్న దర్శకుడాయన. ఏ సినిమాకైనా కథే రాజు అని నా ‘రాక్షసుడు’ సినిమా నేర్పింది. పైగా ప్రేక్షకులు చాలా స్మార్ట్ అయ్యారు. అందుకే కథల ఎంపికలో జాగ్రత్త పడుతున్నా. ఇందులో నాది, నభా నటేశ్ పాత్రలు వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. సంతోష్ శ్రీనివాస్ వర్కింగ్ స్టైల్ నచ్చింది. దేవిశ్రీ ప్రసాద్‌గారితో నాకిది మూడో సినిమా. ఈ చిత్రకథ పెద్దది. అందుకే ఇందులో 4 పాటలు మాత్రమే ఉంటాయి. మార్చి చివరికి షూటింగ్ పూర్తి చేస్తాం. మేలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం.
► ఇప్పటి వరకూ 7సినిమాలు చేశా. వాటిలో కొత్త దర్శకులతో చేసిన సినిమాలూ ఉన్నాయి. నేనెప్పుడూ పాత, కొత్త దర్శకులకు అందుబాటులో ఉంటా. మంచి కథలు ఉంటే కొత్తవారితో చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. నా సినిమా కథలను ముందు మా నాన్నగారు (బెల్లంకొండ సురేశ్) వింటారు.. ఆయనకు నచ్చింది నన్ను వినమంటారు. చివరగా ఇద్దరికీ నచ్చిన కథకి పచ్చజెండా ఊపుతా (నవ్వుతూ).
► నాన్నతో కలిసి నా తమ్ముడు గణేశ్ ప్రొడక్షన్ చూసుకునేవాడు.. రోజూ షూటింగ్స్‌కి వెళ్లేవాడు. అందుకే హీరోగా బాగా నటిస్తున్నాడు.. పైగా మంచి టీమ్ కుదిరింది. ఓ రోజు షూటింగ్‌కి వెళ్లినప్పుడు వాడు నటిస్తున్న భావోద్వేగ సన్నివేశం చూసి కన్నీళ్లొచ్చాయి. నటనలో వాడికి నేనేమీ సలహాలు ఇవ్వలేదు.. వాడే నాకు ఇచ్చేలా ఉన్నాడు (నవ్వుతూ).
► ఈ 2020 కొత్త దశాబ్దానికి ప్రారంభం. ఇప్పటి వరకూ నేను చేసినవి ఒక ఎత్తు.. ఈ పదేళ్లు మరో ఎత్తు. ఇప్పటి నుంచి నా మొదటి సినిమాలా భావిస్తా. యాడ్స్ అవకాశాలొస్తున్నాయి కానీ ప్రస్తుతానికి ఆసక్తి లేదు. నాకు పెళ్లి చేయాలని నాన్నగారు తొందర పెడుతున్నారు.. కానీ, నేను ఒప్పుకోవడం లేదు (నవ్వుతూ). సంతోష్ అన్న సినిమా తర్వాత ‘దిల్’ రాజుగారి బ్యానర్‌లో ఓ సినిమా చేస్తా. ఆ తర్వాత ఏ సినిమా అంగీకరించలేదు.. కథలు వింటున్నా.
Comments
Please login to add a commentAdd a comment