
బిగ్‌బాస్ షో అంటే ఏదైనా జరుగొచ్చు. కానీ, ఆ జరిగేదేదో ముందే బయటకు వచ్చేస్తోంది. దీంతో బిగ్‌బాస్ కార్యక్రమానికి పెట్టిన ట్యాగ్‌కు.. ప్రస్తుతం జరుగుతున్న దానికి పొంతన లేకుండా పోతోంది. గత కొన్ని వారాలుగా ఎలిమినేషన్‌లో ఎంతో సస్పెన్స్ కొనసాగిద్దామనుకున్న బిగ్‌బాస్ ఆశలు నెరవేరడం లేదు. ఎలిమినేషన్ ఎవరు కానున్నారో ఆదివారం ఉదయానికే తెలిసిపోవడం.. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడం జరుగుతున్నదే. అయితే నిన్నటి ఎలిమినేషన్ విషయం కూడా ముందే బయటకు రావడం.. దీప్తి సునయనే బయటకు వెళ్లిపోతోందని తెలిసినా.. షో మాత్రం రక్తికట్టించేలా నడిపించారు. ఇన్నాళ్లు హౌస్‌లో ఉన్న దీప్తి సునయనకు ఎటువంటి సీక్రెట్ టాస్క్‌లు ఇవ్వని బిగ్‌బాస్.. నిన్న ఇచ్చిన టాస్క్‌తో షోలో ఫన్ క్రియేట్ అయింది.
గీత గోవిందం ప్రమోషన్స్‌లో భాగంగా షోకి అతిథిగా వచ్చిన విజయ్ దేవరకొండ ను చూసి దీప్తి సునయన తెగ సంబరపడిపోయింది. తనకు ఇష్టమైన హీరో విజయ్ అని ఐ లవ్యూ అంటూ చెప్పేసింది. దీనికి బదులుగా విజయ్ కూడా ఐ లవ్యూ అనేశాడు. అనంతరం.. విజయ్, నాని కలిసి దీప్తి సునయను సీక్రెట్ టాస్క్ పేరిట బాగానే ఆడుకున్నారు. ఫోన్‌లో చెప్పినట్టుచెయ్యాలని నాని ఆదేశించాడు. దీప్తి సునయనకు ఓ బ్లూటూత్‌ను ఇచ్చి చెవిలో పెట్టుకుని, కనబడకుండా తన జుట్టుతో కవర్ చేసుకోవాలని చెప్పాడు. వారు బయట నుంచి ఫోన్‌లో చెప్పినట్టుగా తాను హౌజ్‌లో చేయాలని మధ్యలో కాల్ డిస్ కనెక్ట్ అయితే వెంటనే బాత్‌రూమ్‌కు వచ్చి కాల్ కనెక్ట్ చేసుకోవాలని సలహా ఇచ్చాడు. ఇక నాని, విజయ్‌లు ఇద్దరు కలిసి దీప్తి సునయని ఆడుకోవడం మొదలుపెట్టారు. మొదటగా తన అక్క పెళ్లి అని చెప్పి అందరికి లడ్డూలు పంచమని చెప్పారు. తరువాత కొద్దిగా డిప్రెషన్‌లోకి వెళ్లినట్టు యాక్ట్ చేయమని చెప్పగా.. ఏదో జరిగిపోయిందని అనుకుని రోల్ రైడా, తనీష్‌లు దీప్తి సునయను హత్తుకుంటుండగా.. బయట నుంచి నాని, విజయ్‌లు చేసే కామెంట్స్ నవ్వును తెప్పించాయి.
తనీష్‌ను, రోల్ రైడాను స్విమ్మింగ్ పూల్‌లో తోసేయడానికి దీప్తి సునయను చేసిన పనులు నవ్వును తెప్పిస్తాయి. అయితే తాను సీక్రెట్ టాస్క్‌లు చేస్తున్నట్టుగా ఇంటి సభ్యులు ఇట్టే గ్రహించారు. ఇది తన ఎలిమినేషన్ కోసమని చెప్పగా.. వెంటనే తనీష్ స్విమ్మింగ్ పూల్‌లో దూకేశాడు. ఇక ఇంటి సభ్యులను లడ్డులతో కొడుతూ.. డైనింగ్ టేబుల్ ఎక్కి డ్యాన్స్ చేయడం, పాట పాడటం, ఇంటి సభ్యులతో పాటలు పాడించడం.. ఇలా సరద సరదాగా సాగిపోయింది. ఇక నిద్రిస్తున్నప్పుడు నీళ్లు పోయడంతో అమిత్ కాస్త సీరియస్ అయి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇలా టాస్క్‌ను కొనసాగిస్తుండగా.. నాని, విజయ్‌లు అకస్మాత్తుగా హౌస్‌లోని టీవీ స్క్రీన్ మీద కనిపించారు. ఇక ఈ సీక్రెట్ టాస్క్ గురించి హౌస్‌మేట్స్‌కు నాని చెప్పేశాడు. అనంతరం విజయ్, డైరెక్టర్ పరుశురామ్‌లు ఇంటి సభ్యులతో కాసేపు ముచ్చటించారు.
వారు వెళ్లిపోయాక ఎలిమినేషన్ ప్రక్రియ షురు అయింది. అయితే ఎవరు ఎలిమినేట్ అయ్యారో ముందే తెలిసిపోయింది కాబట్టి.. ప్రేక్షకులకు అంత ఉత్కంఠభరితంగా ఏం అనిపించకపోవచ్చు. దీప్తి సునయన ఎలిమినేట్ అయిందని వెంటనే హౌస్ నుంచి బయటకు రావాలని నాని ఆదేశించాడు. ఈ ప్రకటనతో తనీష్ దిగ్భ్రాంతికి లోనయ్యాడు. హౌస్‌మేట్స్ అందరికి వీడ్కోలు చెప్పి బయటకు వచ్చేసింది. వెళ్తూ వెళ్తూ.. రోజు ఉదయాన్నే పాట మొదలవగానే స్విమ్మింగ్ పూల్‌లో దూకి డ్యాన్స్ చేయాలనే బిగ్‌బాంబ్‌ను తనీష్‌పై వేసింది. ఇక సోమవారం నాటి కార్యక్రమంలో ఈ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ మొదలైంది. మరి ఎవరు నామినేషన్‌లోకి వెళ్తారో? బిగ్‌బాస్ ఈవారం హౌస్‌మేట్స్‌తో ఎలాంటి ఆటలు ఆడిస్తాడో? చివరగా హౌస్‌లోంచి ఈ వారం ఎవరు బయటకు వెళ్తారో చూడాలి.
చదవండి.. బిగ్‌బాస్ : దీప్తి సునయన ఔట్
Comments
Please login to add a commentAdd a comment