
ఆద‍్యంతం ఉత్కంఠ రేపుతూ వచ్చిన బిగ్‌బాస్ సీజన్ 3కి నిన్నటి (ఆదివారం)తో శుభంకార్డు పడింది. 105 రోజుల ప్రయాణానికి తెరదించుతూ రాహుల్ విన్నర్ అయ్యాడు. ఇద్దరు టాలీవుడ్ సూపర్‌స్టార్లు చిరంజీవి, నాగార్జున చేతుల మీదుగా 50 లక్షల ప్రైజ్‌మనీ, ట్రోఫీ అందుకున్నాడు. బుల్లితెర యాంకర్ శ్రీముఖి రన్నరప్‌గా నిలిచారు. బిగ్‌బాస్ విజేతగా రాహుల్ అన్న విషయం ఒక్కరోజు ముందుగానే లీక్ అయినప్పటికీ ఎక్కడో ఒక్క చోట శ్రీముఖి గెలుస్తుందేమో అన్న అభిప్రాయం సగటు ప్రేక్షకునికి ఉంది. సోషల్ మీడియాలో ఆమెకు ఉన్న ఫాలోయింగ్ అలాంటిది మరి. అయితే కొన్ని గంటల ముందే విన్నర్ రాహుల్ అని తేలడంతో ధూల్‌పేటలో సంబరాలు ప్రారంభమయ్యాయి.
అభిమానుల నిరాశ
శ్రీముఖి పక్కాగా గెలుస్తుందనుకున్న ఆమె అభిమానులు మాత్రం రాహుల్ విన్నర్ అనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.. చివరి క్షణాల వరకు శ్రీముఖి అభిమానులు బుల్లితెర రాములమ్మ గెలుస్తుందనే గంపెడు ఆశతో ఉన్నారు. అనూహ్యంగా రాహుల్ గెలిచాడని వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టాస్కులన్నింటిలోనూ బద్దకస్తుడిగా పేరుతెచ్చుకున్న రాహుల్ గెలువడమేమిటన్న విస్మయం వారిలో వ్యక్తమవుతోంది. నిజానికి బిగ్‌బాస్ - 3 విన్నర్ శ్రీముఖేనని, అనూహ్యంగా రాహుల్ గెలవడంలో ఏదో గూడుపుఠాణీ ఉందని ఆమె అభిమానులు కొందరు విపరీత ఆరోపణలు కూడా చేస్తున్నారు. రాహుల్ అభిమానులు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ.. ముక్కుసూటితనంతో ఒరిజనల్‌గా ఉండటం వల్లే రాహుల్ విన్నర్ అయ్యాడని స్పష్టం చేస్తున్నారు.
శ్రీముఖిని కూల్ చేసిన మెగాస్టార్
బిగ్‌బాస్ విన్నర్‌గా రాహుల్‌ను ప్రకటించడంతో శ్రీముఖి అంచనాలను తలకిందులైనట్టు కనిపించింది. పరాజయం ఇష్టపడని శ్రీముఖి చివరికి లూజర్‌గా మిగిలిపోవడంతో డీలాపడిపోయింది. ఆమె మొహం కూడా వాడిపోయింది. ఇది గమనించిన మెగాస్టార్ చిరంజీవి శ్రీముఖిని.. లక్షలమంది మనసులను గెలుచుకున్నావంటూ కాస్తా కూల్ చేశాడు. మళ్లీ మామూలు స్థితికి వచ్చిన శ్రీముఖి అభిమానుల నిర్ణయాన్ని అంగీకరిస్తానని, ఇప్పుడు చిరంజీవితో ఏ స్టెప్పు వేయడానికైనా రెడీ అంటూ హుషారైంది.
ఎవరి బలం ఎంత
ఏ విషయంలో చూసినా శ్రీముఖి రాహుల్‌కంటే ముందుంటుందని పేరు తెచ్చుకుంది. టాస్క్‌ల పరంగా, ఫ్యాన్ ఫాలోవర్స్ పరంగా చూస్తే రాహుల్ కంటే శ్రీముఖి ఓ అడుగుముందే ఉందని చెప్పవచ్చు. అయితే శ్రీముఖికి కొన్ని విషయాలు మైనస్‌గా మారినట్టు కనిపిస్తున్నాయి. ఓట్లపరంగా చూసుకుంటే శ్రీముఖి, రాహుల్‌కు సమానస్థాయిలోనే ఓట్లు పడి ఉంటాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే అవకాశం వచ్చినప్పుడల్లా తన స్వరంతో పాటలు పాడి రాహుల్ అభిమానులను హృదయాలను కొల్లగొట్టాడు. హౌజ్‌లోనూ అతను చాలావరకు ఒరిజినల్‌గా నిజాయితీగా ఉండటంతోపాటు పునర్నవితో చక్కని అనుబంధాన్ని కొనసాగించడం కూడా రాహుల్‌కు కలిసివచ్చింది. పునర్నవి ఎలిమినేట్ అయిన సందర్భంలో రాహుల్ దుఃఖాన్ని ఆపుకోలేక వెక్కివెక్కి ఏడ్వడం ప్రేక్షకుల హృదయాల్ని కదిలించి ఉంటుంది. ఫైనల్ సమీపిస్తున్న వేళ రాహుల్ మరింత సటిల్డ్‌గా ఉండటమే కాకుండా.. తన హైదరాబాదీ యాస, జానపద పాటలతో క్రేజ్ పెంచుకున్నాడు. ఫైనల్ దశలో ఇది కొంతమేరకు శ్రీముఖి క్రేజ్‌కు బ్రేక్ వేసింది.
ఓటమికి కొన్ని కారణాలు
బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన హేమ, హిమజా శ్రీముఖికి వ్యతిరేకంగా గళమెత్తడం.. ఆమె పట్ల కొంత నెగిటివిటీకి కారణమైంది. బిగ్‌బాస్ హౌజ్ డైరెక్టర్లలో కొందరు శ్రీముకికి స్నేహితులంటూ హిమజ బాంబ్ పేల్చిన విషయం తెలిసిందే. ఈ మాటల ప్రభావం కొంతలేకపోయిందని బిగ్‌బాస్‌ను ఫాలో అవుతున్న ఫ్యాన్స్ అంటున్నారు. ఈ వ్యాఖ్యలు బిగ్‌బాస్ టీంకు కూడా చిక్కులు తెచ్చిపెట్టాయి. ఇప్పటికే బిగ్‌బాస్ టీం శ్రీముఖికి ఫేవర్‌గా ఉందని వదంతులు వచ్చాయి. దీంతో శ్రీముఖిని విన్నర్‌గా ప్రకటిస్తే ఈ ప్రక్రియ అంతా ఫుల్ ప్లాన్‌డ్‌గా చేశారనే ఆరోపణలు వస్తాయని భావించి బిగ్‌బాస్ టీం.. ఆమెతోపాటు సమానంగా ఉన్న రాహుల్‌ను విజేతగా ప్రకటించిందని శ్రీముఖి ఫ్యాన్స్ వాదిస్తున్నారు. ఇక రాహుల్‌తో శ్రీముఖి గొడవపడటం కూడా మైనస్‌గా మారి.. రాహుల్‌పై సానుభూతి పెరగడానికి కారణమైంది. మొదటినుంచి రాహుల్‌పై విముఖత చూపిస్తున్న శ్రీముఖి.. రాహుల్‌ను అనేకసార్లు నామినేషన్‌లోకి నెట్టింది. శ్రీముఖి అనవసరంగా రాహుల్‌తో గొడవ పడిందని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఇంట్లో కొందరి విషయాలు శ్రీముఖి అక్కడివి ఇక్కడ ఇక్కడివి అక్కడ చెపుతుందని ప్రచారం కూడా ఆమెకు ట్రోఫీని దూరం చేసిన వాటిలో ఒక కారణమని చెప్పేవాళ్లు లేకపోలేదు.
Comments
Please login to add a commentAdd a comment