బిపాసా... మళ్లీ నిరాశ ? | Bipasha Basu Personal Status Single | Sakshi
Sakshi News home page

బిపాసా... మళ్లీ నిరాశ ?

Published Wed, Nov 4 2015 11:38 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

బిపాసా... మళ్లీ నిరాశ ? - Sakshi

బిపాసా... మళ్లీ నిరాశ ?

‘అలోన్’... ఏడాది క్రితం ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు బిపాసా బసు పర్సనల్ స్టేటస్ సింగిల్. షూటింగ్ మొదలయ్యాక కూడా తనేంటో తన పనేంటో అన్నట్లుగానే ఉండేవారు. కొన్ని రోజులు గడిచింది. ఎలా మొదలైందో కానీ, ఆ చిత్రంలో హీరోగా నటించిన బుల్లితెర నటుడు కరణ్‌సింగ్ గ్రోవర్, కథానాయిక బిపాసా మధ్య ప్రేమ చిగురించింది. షూటింగ్ స్పాట్‌లో ఇద్దరూ కబుర్లు చెప్పుకోవడం దగ్గర్నుంచీ, పేకప్ చెప్పాక కలిసి వెళ్లడం వరకూ బాలీవుడ్‌లో బోల్డన్ని వార్తలు హల్‌చల్ చేశాయి. మొత్తం మీద ‘అలోన్’ సినిమా పూర్తయ్యేసరికి బిపాసా సోలో లైఫ్‌కి ఫుల్‌స్టాప్ పడిపోయింది.
 
  విహార యాత్రలూ, విందులు అంటూ ఇన్నాళ్లూ ఎంజాయ్ చేసిన ఈ జంట ఇప్పుడు దూరం పాటిస్తున్నారట. దానికి కారణం ‘జరీన్ ఖాన్’ అని సమాచారం. కత్రినా కైఫ్ పోలికలతో ఉన్న ఈవిడగార్ని ‘వీర్’ ద్వారా వెండితెరకు పరిచయం చేశారు సల్మాన్ ఖాన్. ఆ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. జరీన్ కెరీర్ కూడా పెద్దంతగా పుంజుకోలేదు. ఇప్పుడు కరణ్‌సింగ్ గ్రోవర్‌తో కలిసి ‘హేట్ స్టోరీ 3’లో నటించింది జరీన్‌ఖాన్.
 
 ‘ఆలోన్’లో నటించి బిపాసా ఒంటరితనాన్ని పోగొట్టిన కరణ్ ఇప్పుడు ‘హేట్ స్టోరీ’లో నటించడం మొదలుపెట్టాక ఆమెను హేట్ చేయడం మొదలుపెట్టాడట. జరీన్‌తో ప్రేమలో పడ్డాడని సమాచారం. ఆల్రెడీ బిపాసాతో ప్రేమాయణం సాగిస్తూ, తనతో లవ్‌లో పడాడ్డని జరీన్‌కి తెలిసినప్పటికీ, దాన్ని పెద్దగా మైండ్‌కి ఎక్కించుకోకుండా కరణ్ కంపెనీని ఎంజాయ్ చేస్తోందట జరీన్. ఇక, బిపాసా గురించి చెప్పాలంటే...
 
 బిపాసా తొలి ప్రేమ జాన్ అబ్రహాంతో మొదలైంది. అతగాడితో బిపాసా తొమ్మిదేళ్లు సహజీవనం చేసి, విడిపోయింది. ఆ తర్వాత కొన్నాళ్లకు హీరో హర్మాన్ బవేజాతో ప్రేమలో పడింది. ఆ ప్రేమ కొద్ది రోజులకే పరిమితమైంది. ఆ విధంగా రెండో లవ్ కూడా బిపాసాని నిరాశపరిచింది. ఆ నిరాశలోంచి బయట పడుతున్న సమయంలోనే కరణ్‌సింగ్‌కి దగ్గరయ్యిందామె. ఈ ప్రేమను పెళ్లి వరకూ తీసుకెళ్లాలనుకుందట.
 
 కానీ, కరణ్ మాత్రం బిప్స్‌ని లైట్ తీసుకున్నాడని బిపాసా సన్నిహితులు అంటున్నారు. వాస్తవానికి కరణ్‌కి ప్లేబోయ్ ఇమేజ్ ఉంది. 2008లో శ్రద్ధా నిగమ్‌ని పెళ్లి చేసుకుని, పది నెలలకే విడాకులు ఇచ్చేశాడు. ఆ తర్వాత జెన్నిఫర్ వింగెట్ అనే బుల్లితెర నటిని పెళ్లి చేసుకుని, ఏడాదిన్నరకే ఆమెకు దూరమయ్యాడు. అనంతరం బిపాసాకి దగ్గరయ్యాడు. ఇప్పుడు బిపాసాని కాదని జరీన్‌తో జతకట్టాడు. ఇలాంటి వ్యక్తిని నమ్మడం బిపాసా తప్పని కొంతమంది అంటున్నారు. ఏదేమైనా బిపాసాకి మూడోసారి కూడా చేదు అనుభవం ఎదురైంది. మరి.. జరీన్ పరిస్థితి ఏంటో?
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement