సాగర తీరంలో సరసాలు!
కొన్ని విషయాలు నోరు తెరిచి చెప్పాల్సిన అవసరంలేదు.. సైగల ద్వారానో, ఫొటోల రూపంలోనే చెప్పేయొచ్చు. ఫొటోల్లో ఉన్న పోజులను బట్టి, అందులో ఉన్నవారి మధ్య ఎంతటి సాన్నిహిత్యం ఉందో ఊహించేయొచ్చు. నటుడు కరణ్ సింగ్ గ్రోవర్‌తో తాను కలిసి దిగిన ఫొటోలను బయటపెట్టడం ద్వారా తమ మధ్య ఉన్న అనుబంధం ఎలాంటిదో చెప్పీ చెప్పక చెప్పేశారు బిపాసా బసు. 2015కి వీడ్కోలు పలుకుతూ చివరి రోజున కరణ్ సింగ్, బిపాసా సాగర తీరంలో చేతిలో చెయ్యేసుకుని మరీ ‘స్వీట్ నథింగ్స్’ చెప్పుకున్నారు.
అలాగే, ఈత కొట్టి సరసాలాడారు. ఎంతో రొమాంటిక్‌గా ఉన్న ఆ ఫొటోలను బిపాసా తన ట్విట్టర్ ద్వారా బయటపెట్టారు. ‘‘2015 నాకు చాలా స్పెషల్. ఓర్పుగా ఉండటం, ప్రేమించడం, ఇతరులను అర్థం చేసుకోవడం, నమ్మడం.. ఇవన్నీ నేర్పించింది. అన్నింటికన్నా మించి నా జీవితంలో సంతోషాన్ని నింపింది’’ అని బిపాసా ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆ మధ్య కరణ్‌తో బిపాసా అనుబంధం చెడిందనే వార్త వచ్చినప్పటికీ, ఈ ఫొటోల ద్వారా ఇద్దరూ బాగానే ఉన్నారని స్పష్టమైంది.