బాలీవుడ్ గాడ్‌మదర్.. షబానా అజ్మీ
ఏకంగా ఐదుసార్లు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకున్న ఘనత... అందులోనూ వరుసగా మూడేళ్లు ఈ అవార్డు అందుకున్న ఘనత ఆమె సొంతం. రంగస్థల పునాదిని విడవకుండానే అంతర్జాతీయ గుర్తింపు సాధించిన ఘనత కూడా ఆమెకే చెల్లింది. పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేసేందుకు కాలేజీలో చదువుకున్న మనస్తత్వ శాస్త్రం ఆమెకు బాగానే ఉపకరించింది. వైవిధ్య భరితమైన పాత్రలు, విలక్షణమైన నటనకు చిరునామా షబనా అజ్మీ. హైదరాబాద్‌లో సాంస్కృతిక వాతావరణం గల కుటుంబంలో పుట్టింది. తల్లి షౌకత్ అజ్మీ రంగస్థల నటిగా ప్రసిద్ధురాలు.
తండ్రి కైఫీ అజ్మీ సుప్రసిద్ధ కవి. వారిద్దరూ కమ్యూనిస్టు పార్టీ సభ్యులే. వారి ఇల్లు ఎప్పుడూ కమ్యూనిస్టు పార్టీ సభ్యులతో సందడి సందడిగా ఉండేది. అలా చిన్నప్పటి నుంచే వామపక్ష భావజాలం మధ్య పెరిగింది షబానా. ఆమె సినిమాల్లోనూ ఆ భావజాల ప్రభావమూ కనిపిస్తుంది. ఆమె బాల్యంలోనే అజ్మీ కుటుంబం బాంబేకి తరలిపోయింది. షబానా అక్కడే సెయింట్ జేవియర్ కాలేజీ నుంచి సైకాలజీలో డిగ్రీ పూర్తిచేసింది. తర్వాత నటనపై ఆసక్తితో పుణేలోని ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో (ఎఫ్‌టీఐఐ) చేరింది. ఎఫ్‌టీఐఐ 1972 బ్యాచ్‌లో టాపర్‌గా నిలిచింది.
‘అంకుర్’మే ఆరంభం...
షబానా నట ప్రస్థానం ‘అంకుర్’తో ప్రారంభమైంది. మరో ‘హైదరాబాదీ’ శ్యామ్ బెనగళ్‌కు దర్శకుడిగా ఇదే తొలిచిత్రం. హైదరాబాద్‌లో జరిగిన నిజజీవిత సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించడం మరో విశేషం. ఇందులో షబానా సహజ నటన సినీ విమర్శకుల ప్రశంసలు పొందింది. తొలిచిత్రమే ఆమెకు ఉత్తమ నటిగా 1975లో జాతీయ అవార్డు తెచ్చిపెట్టింది. నిజానికి ‘అంకుర్’ కంటే ముందే కె.ఎ.అబ్బాస్ చిత్రం ‘ఫాస్లా’, కాంతిలాల్ రాథోడ్ చిత్రం ‘పరిణయ్’లకు షబానా సంతకాలు చేసింది. వాటి తర్వాత సంతకం చేసిన ‘అంకుర్’ ముందుగా విడుదలైంది. ఆ తర్వాత ‘అర్థ్’ (1983), ఖాందార్ (1984), ‘పార్’ (1985), గాడ్ మదర్ (1999) కూడా షబానాకు జాతీయ అవార్డులు తెచ్చిపెట్టాయి.
బాలీవుడ్‌లో సమాంతర సినిమాల స్వర్ణయుగం మొదలైన కాలంలో తెరపైకి వచ్చిన షబానాకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది ఇలాంటి సినిమాలతోనే. అలాగని ఆమె ‘అమర్ అక్బర్ ఆంథోనీ’ వంటి కమర్షియల్ సినిమాలూ చేయకపోలేదు. సత్యజిత్ రే దర్శకత్వంలో ‘షత్రంజ్‌కే ఖిలాడీ’, మృణాల్‌సేన్ దర్శకత్వంలో ఖాందార్, జెనెసిస్, ఏక్ దిన్ అఛానక్ వంటి చిత్రాలు ఆమెకు పేరు తెచ్చిపెట్టాయి. సినిమాల్లో తలమునకలుగా ఉంటూనే, రంగస్థలంపైనా విరివిగా ప్రదర్శనలు ఇచ్చే షబానా అంకితభావం హాలీవుడ్‌నూ ఆకట్టుకుంది. జాన్ ష్లెసింగర్ దర్శకత్వంలో ‘మేడమ్ సౌసాజ్కా’, రోలండ్ జాఫీ దర్శకత్వంలో ‘సిటీ ఆఫ్ జాయ్’ వంటి హాలీవుడ్ చిత్రాల్లో షబానా నటించింది. సినీ కెరీర్ ఊపులో ఉన్న సమయంలోనే బాలీవుడ్ గీతరచయిత జావేద్ అక్తర్‌ను పెళ్లాడింది. పెళ్లి తర్వాత సైతం ఆమె ‘ఫైర్’ వంటి సాహసోపేతమైన సినిమాల్లోనూ నటించింది. దీపా మెహతా చిత్రం ‘వాటర్’లో శకుంతల పాత్ర కోసం షబానా గుండు చేయించుకుంది. దీనిపై వివాదాలు తలెత్తడంతో కొంత షూటింగ్ తర్వాత అటకెక్కింది. ఐదేళ్ల తర్వాత తిరిగి షూటింగ్ చేపట్టినా, షబానా స్థానంలో సీమా బిశ్వాస్ ఆ పాత్ర ధరించింది.
సామాజిక చైతన్యశీలి...
షబానా నటనకు మాత్రమే పరిమితం కాలేదు. సామాజిక కార్తకర్తగానూ ఆమెది చురుకైన పాత్ర. బాలలు, మహిళలు, అట్టడుగు వర్గాల వారి హక్కుల కోసం పలు ఆందోళనల్లో పాల్గొంది. మత సామరస్యం కోసం ఢిల్లీ నుంచి మీరట్‌కు నాలుగు రోజుల యాత్రలోనూ పాల్గొంది. ఎయిడ్స్ బాధితులు, హెచ్‌ఐవీ పాజిటివ్ చిన్నారుల కోసం ప్రచారంలో చురుగ్గా పాల్గొన్న షబానా, బెంగాలీ చిత్రం ‘మేఘ్లా ఆకాశ్’లో ఎయిడ్స్ రోగులకు చికిత్స చేసే వైద్యురాలి పాత్రలో సహజ నటనను ప్రదర్శించింది. భారత ప్రభుత్వం ఆమెను 1997లో రాజ్యసభకు నామినేట్ చేసింది. ఐక్యరాజ్య సమితి ఆమెను 1998లో గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమించింది. భారత ప్రభుత్వం ఆమెను 1988లో ‘పద్మశ్రీ’, 2012లో ‘పద్మభూషణ్’ అవార్డులతో సత్కరించింది. ఇవేకాకుండా, నటిగా షబానా పలు అంతర్జాతీయ అవార్డులనూ పొందింది.
- పన్యాల జగన్నాథదాసు