
అయ్యో రామ ఈ భామ...తెగ ముద్దొస్తున్నాదె!
అందమైన భామలు ఒకే చోట కనిపిస్తే చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. కన్‌ఫ్యూజన్‌లో కొంతమంది కన్నార్పకుండా వాళ్లను అదే పనిగా చూస్తారు.. ప్రస్తుతం ఫ్రాన్స్ దేశంలోని కాన్స్ నగరంలో జరుగుతున్న కాన్స్ చలన చిత్రోత్సవాల్లో పాల్గొంటున్న మగవాళ్ల పరిస్థితి ఇలానే ఉంది. ఎక్కడా తగ్గేది లేదన్నట్లు అందాల తారలందరూ ఒకర్ని మించి మరొకరు అందంగా ముస్తాబై, ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు.
‘మన్మథుడు’ చిత్రంలో మన నాగార్జున ‘అయ్యో రామ ఈ భామ.. తెగ ముద్దొస్తున్నాదె’ అని అమ్మాయిలపై మనసు పారేసుకున్నట్లుగా, అక్కడివాళ్లు ఇంగ్లిషులో సాంగేసుకుంటున్నారు. మంగళవారం వేడుకల్లో పాల్గొన్న తారల్లో ఎమీ ప్రత్యేక ఆకర్షణ అయ్యారు. ఈ బ్రిటిష్ మోడల్ ఇండియన్ సినిమాల్లో నటిస్తూ, ఇక్కడి అమ్మాయి అయిపోయిన విషయం తెలిసిందే. తొలిసారి ఈ ఏడాది కాన్స్ ఉత్సవాల్లో పాల్గొన్నారామె. అందుకే 25 నుంచి 30 డ్రెస్సులు తయారు చేసుకున్నారు.
మంగళవారం బ్రిటిష్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో జరిగిన భోజన సమావేశంలో పాల్గొన్నారు ఎమీ. ముదురు నీలం రంగు గౌనులో మెరిసిపోయారామె. ‘కాన్స్‌లో నా మొదటి సాయంత్రం’ అని అక్కడ ఫొటో దిగి, ట్విట్టర్‌లో పెట్టారు.