‘వారికి శిరసువంచి పాదాభివందనం చేస్తున్నా’ | Boyapati Salute Pm Modi Uncompromising Fight Against Coronavirus | Sakshi
Sakshi News home page

ప్రధాని మాటలు ఎంతో విలువైనవి: బోయపాటి

Apr 16 2020 9:30 AM | Updated on Apr 16 2020 9:30 AM

Boyapati Salute Pm Modi Uncompromising Fight Against Coronavirus - Sakshi

ప్రజల ప్రాణాలే గొప్పవని ప్రధాని చెప్పిన మాటలు ఎంతో విలువైనవి

హైదరాబాద్‌: కరోనా వ్యాప్తిపై పోరాటంలో డాక్టర్లు, వైద్య సిబ్బంది, పోలీసులు రేయింబవళ్లు కష్టపడుతున్న తీరుకు శిరసువంచి పాదాభివందనం చేస్తున్నట్లు టాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను తెలిపారు. మన దేశం ఇంత ప్రభావవంతంగా కరోనాపై పోరాడుతున్నదంటే అందుకు వాళ్లు చేస్తున్న సేవలే ప్రధాన కారణమని, ఆలాగే పారిశుద్ధ్య కార్మికులు కూడా తమ వంతు పాత్రను గొప్పగా పోషిస్తున్నారని ప్రశంసించారు. లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు ప్రధాన నరేంద్రమోదీ ప్రకటించిన అనంతరం మీడియాకు బోయపాటి ఓ లేఖను విడుదల చేశారు. 

‘లాక్‌డౌన్‌ కాలాన్ని మే3 వరకు పొడిగిస్తూ మన ప్రధాని నరేంద్ర మోదీ గారు తీసుకున్న నిర్ణయం ఎంతైనా సముచితం. కోవిడ్‌-19పై రాజీలేని పోరాటాన్ని కొనసాగించడానికి లాక్‌డౌన్‌ మించిన ఆయుధం లేదనేది నిపుణులంగా చెప్తున్న విషయం. ఇప్పటివరకు 21 రోజుల లాక్‌డౌన్‌ను దేశంలోని అందరం ఏకతాటిపై నిల్చొని విజయవంతం చేశాం. అందువల్లే కరోనా వైరస్‌ సమాజంలో విరివిగా వ్యాప్తి చెందకుండా అడ్డుకోగలిగాం. మరో 19 రోజుల పాట అదే స్పూర్థితో, స్వీయ నియంత్రణతో లాక్‌డౌన్‌ను విజయవంతం చేసి, తద్వార కరోనా మహహ్మారిపై పోరాటంలోనూ విజయం సాధించాలని మనసారా కోరుకుంటున్నాను. 

దేశంలో కరోనా మహమ్మారిని అరికట్టడానికి అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు గొప్పగా పనిచేస్తున్నాయి. అహర్శిశం అప్రమత్తంగా ఉంటూ, ఎప్పటికప్పుడు ప్రజలకు సలహాలు, సూచనలు ఇస్తూ చైతన్య పరుస్తున్న ప్రభుత్వ యంత్రాంగాలకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. కరోనా వ్యాప్తిపై పోరాటంలో డాక్టర్లు, వైద్య సిబ్బంది, పోలీసులు రేయింబవళ్లు కష్టపడుతున్న తీరుకు శిరసువంచి పాదాభివందనం చేస్తున్నా. మన దేశం ఇంత ప్రభావవంతంగా కరోనాపై పోరాడుతున్నదంటే అందుకు వాళ్లు అద్భుతంగా చేస్తున్న సేవలే ప్రధాన కారణం. అలాగే పారిశుద్ధ్య కార్మికులు కూడా తమ వంతు పాత్రను గొప్పగా పోషిస్తున్నారు. 

లాక్‌డౌన్‌ కారణంగా దేశానికి ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లినా, దాని కంటే ప్రజల ప్రాణాలే గొప్పవని ప్రధాని చెప్పిన మాటలు ఎంతో విలువైనవి. సినిమా ఇండస్ట్రీపై కూడా లాక్‌డౌన్‌ తీవ్ర ప్రభావం కలిగిస్తోంది. ప్రధానంగా ఉపాధి కోల్పోయిన పేద కళాకారులు, దినసరి వేతనంతో జీవించే కార్మికులను ఆదుకోవడానికి సినిమా ఇండస్ట్రీ అంతా ఒక్టిగా ముందుకు రావడం ముదావహం. కరోనా వైరస్‌ ఎంత భయానకమైనదైనా, దాని వల్ల దేశమంతా ఒక్కటేననే భావన ఏర్పడటం, కుల మత భేదం లేకుండా, పేద ధనిక తారతమ్యం లేకుండా అందరం ఐకమత్యం ప్రదర్శించడం గొప్ప విషయం. ఇదే స్పూర్థితో మే3 వరకు కొనసాగనున్న లాక్‌డౌన్‌ను విజయవంతం చేద్దాం. అందరం ఇళ్లల్లో ఉండి ప్రభుత్వాలకు, పోలీసులకు పూర్తిగా సహకరిద్దాం. ఇంట్లోనే ఉందాం. క్షేమంగా ఉందాం. మీ బోయపాటి శ్రీను’ అంటూ లేఖలో బోయపాటి పేర్కొన్నారు. 

చదవండి:
గబ్బిలాన్ని కరోనా ఏం చేయలేదా?​​​​​​​
ఒకే ఇంట్లో వేరు వేరుగా ఉన్నాం​​​​​​​

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement