
అంజలి అమీర్ (ఫైల్)
తమిళనాడు ,పెరంబూరు: యాసిడ్ పోస్తానంటూ ప్రియుడు బెదిరిస్తున్నాడని హిజ్రా నటి అంజలి అమీర్ తెలిపింది. తమిళం, మలయాళం భాషల్లో నటిస్తున్న ఈమె ఆ మధ్య పేరంబు అనే తమిళ చిత్రంలో నటుడు మమ్ముట్టితో కలిసి నటించింది. అంజలీ అమీర్ మలయాళ బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో ద్వారా ప్రాచుర్యం పొందింది. ఈమె తన ఫేస్‌బుక్‌లో తన ప్రియుడు యాసిడ్‌తో దాడి చేస్తానని బెదిరిస్తున్నాడని పేర్కొంది. అతను రెండేళ్లుగా తాను సంపాదించుకున్న డబ్బును రూ.4 లక్షలకు పైగా దోచుకున్నాడని, ఇప్పుడు యాసిడ్ పోస్తానంటూ బెదిరిస్తున్నాడని కంటతడి పెడుతూ వీడియోను పోస్ట్ చేసింది. అందులో తనకు అండగా ఎవరూ లేరని, తల్లిదండ్రులు కూడా దగ్గర్లో లేరని చెప్పింది. ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలన్న నిర్ణయానికి కూడా వచ్చానని చెప్పింది. తనను ఆదుకునే వారు లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. కాగా ఈమె తన బయోపిక్‌ను సినిమాగా రూపొందించనుందట. ఈ చిత్రాన్ని 2020 మేలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొంది. అయితే తన ప్రియుడు ఎవరో, అతని పేరు కూడా అంజలి అమీర్ పేర్కొనలేదు.