
'నాకు డజను సంతానం కావాలనుకున్నా'
లాస్‌ఏంజిల్స్: 'ఖుషీ' సినిమా క్లైమాక్స్‌లో పవన్ కళ్యాణ్, భూమిక డజనుకుపైగా పిల్లలతో ఇక్కట్లు పడే సీన్ ఒకటి ఉంటుంది. అదేవిధంగా తనకు కూడా డజను మంది సంతానం ఉండాలన్న కోరిక ఉండేదని హాలీవుడ్ నటుడు బ్రాడ్‌పిట్ తెలిపాడు. భార్య ఏంజెలినా జోలీతో కలిసి తాను 12 మంది పిల్లల్ని కనాలని భావించినా.. ఇప్పటికే ఇంట్లో ఆరుగురు పిల్లలు ఉండటం.. వారితో వేగలేక ఇళ్లంతా గందరగోళంగా మారాడంతో ఆ ఆలోచన మానుకున్నట్టు చెప్పాడు.
ఈ దంపతులకు మడోక్స్ (14), పాక్స్ (11), జహరా (10), శిలొహ్ (9), ఏడేళ్ల కవలలు నాక్స్, వివీన్నె.. మొత్తం ఆరుగురు పిల్లలు ఉన్నారు. 'ఏంజీ, నేను కలిసి 12 మంది పిల్లల్ని కనాలనుకున్నాం. కానీ ఆరుగురికే ఆపేశాం' అని 51 ఏళ్ల బ్రాడ్ చెప్పాడు. ప్రస్తుతం కుటుంబ జీవితం అప్పుడప్పుడు గందరగోళంగా తోస్తుందని ఆయన తెలిపాడు. 'ఎంతో ప్రేమిస్తారు. ఎంతో కొట్టుకుంటారు. ఎన్నో చాడీలు చెప్తారు. అందరి పళ్లు తోమాలి. ముఖం కడుగాలి.. ఇదంతా ఎంతో గందరగోళం. కానీ ఎంతో సంతోషాన్ని కూడా ఇస్తుంది' అని బ్రాడ్‌పిట్ చెప్పాడు.