పెళ్లయితే లిప్ లాక్ సీన్స్ చేయకూడదా?
‘‘ఇప్పటివరకు నా సినిమాలు మాత్రమే విజయం సాధించాలని కోరుకుంటూ వచ్చాను. ఇకనుంచీ మా యశ్‌రాజ్ ఫిలింస్ రూపొందించే చిత్రాలన్నీ విజయం సాధించాలని కోరుకోవాలి. ఆ ఇంటి కోడల్ని కాబట్టి.. ఇప్పుడీ అదనపు బాధ్యత’’ అని రాణీ ముఖర్జీ అన్నారు. ప్రముఖ నిర్మాత యశ్‌చోప్రా తనయుడు, దర్శక, నిర్మాత ఆదిత్య చోప్రాను రాణీ ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. రాణీ నటించిన ‘మర్దానీ’ ఇటీవల విడుదలై, సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. పెళ్లి తర్వాత ఆమె అందుకున్న తొలి విజయం ఇది. ఈ సందర్భంగా తన సినీ జీవితం, వ్యక్తిగత జీవితం గురించి బోల్డన్ని విశేషాలను రాణీ ఈ విధంగా పంచుకున్నారు.
ఆ మాటలు నాకు విచిత్రంగా అనిపించాయి
‘ఇప్పుడు నువ్వు పెద్దింటి కోడలివి కదా.. ఏ సినిమా పడితే ఆ సినిమా చెయ్యకూడడదు.. పాత్రల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్త వహించాలి’ అని కొంతమంది సన్నిహితులు నాతో అంటున్నారు. ఆ మాటలు నాకు విచిత్రంగా అనిపించాయి. పెద్దింటి కోడలైతే కెరీర్‌ని మానుకోవాల్సిందేనా? అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. నాకు దొరికిన సమాధానం ’అవసరం లేదు’ అని. నా భర్త ఆదిత్య చోప్రా మంచి దర్శక, నిర్మాత. తన ఆలోచనలన్నీ ఆధునికంగా ఉంటాయి. పెళ్లయిన తర్వాత నువ్వు నటించకూడదని నాకెప్పుడూ చెప్పలేదు. అందుకని నిక్షేపంగా నేను సినిమాలు చేస్తా. నా కెరీర్ అంటే నాకు ప్రాణం. అలాగని చివరి శ్వాస వరకూ నటించాలనుకోవడంలేదు. ఎన్నాళ్లు కుదిరితే అన్నాళ్లు చేస్తా. నాకు సంతృప్తికరంగా అనిపించే పాత్రలు వచ్చేవరకూ చేస్తాను. నచ్చలేదనుకోండి.. ఇంట్లోనే కూర్చుంటా.
వాళ్లే నోళ్లు మూసుకుంటారు
ప్రస్తుతం హిందీ రంగంలో లిప్ లాక్ సీన్స్ చాలా కామన్ అయ్యాయి. కానీ, పెళ్లయినవాళ్లు ఇలాంటి సన్నివేశాల్లో నటించకూడదని అంటుంటారు. సీన్ డిమాండ్ చేసిందనుకోండి.. చేయాల్సిందే. కుదరదని చెప్పి, సినిమాకి అన్యాయం చేయాలా? లిప్ లాక్ సీన్స్‌లో నటించాలా? వద్దా? అనేది వ్యక్తిగత విషయం. ఒకవేళ ఆ హీరోయిన్‌కి నచ్చితే చేస్తారు. విమర్శించేవాళ్లు నోళ్లు ఎలాగూ ఆగవు. వాగీ వాగీ నోళ్లు మూసుకుంటారు.
గర్భవతిగా ఉన్నా నటిస్తా..
గర్భం దాల్చిన తర్వాత వచ్చే శారీరక మార్పులు, ఏర్పడే ఇబ్బందుల కారణంగా ఓ ఏడాది పాటు కెరీర్‌కి దూరంగా ఉండాలని కొంతమంది ఆడవాళ్లు కోరుకుంటారు. కానీ, గర్భం దాల్చినా నేను నటించడానికి రెడీయే. కానీ, దర్శకులు అంగీకరించాలి కదా. హాలీవుడ్ తారల్లో చాలామంది గర్భంతో ఉన్నప్పుడు కూడా హ్యాపీగా నటించారు. మరి.. మనకేంటి సమస్య?
ఆడవాళ్లందరూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి
‘మర్దానీ’లో నేను క్రిమినల్ బ్రాంచ్‌కి చెందిన సీనియర్ ఇన్‌స్పెక్టర్ పాత్ర చేశాను. ఈ పాత్ర కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. సినిమా కోసమే నేర్చుకున్నప్పటికీ వ్యక్తిగతంగా ఆడవాళ్లందరూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలన్నది నా అభిప్రాయం. ఆత్మరక్షణకు అది ఉపయోగపడుతుంది. పెళ్లికి ముందు తండ్రి లేక సోదరుల తోడు, పెళ్లి తర్వాత భర్త తోడు లేనిదే బయటికి వెళ్లలేని స్త్రీలు ఇప్పటికీ మన భారతదేశంలో చాలామంది ఉన్నారు. అలాగే, లైంగిక వేధింపులను ఎదిరించలేని స్త్రీలూ ఉన్నారు. తిరగబడే ధోరణిని పెంచుకోవాలి. మార్షల్ ఆర్ట్స్‌వంటి వాటివల్ల ఆత్మస్థయిర్యం పెరుగుతుంది.
నా భర్త దర్శకత్వంలో నేను నటించాను
యశ్‌రాజ్ ఫిలింస్ మా సొంత సంస్థ కాబట్టి, ఇకనుంచీ నాకు సినిమాలకు కొదవ ఉండదని కొంతమంది భావన. ‘మర్దానీ’ ఈ సంస్థే రూపొందించింది కానీ, నా తదుపరి చిత్రం ఈ సంస్థలో ఉండదు. నేను బయటి సంస్థల్లో కూడా సినిమాలు చేస్తాను. నా భర్త ఆదిత్య చోప్రా దర్శకత్వంలో అస్సలు సినిమాలు చేయాలనుకోవడంలేదు. ఎందుకంటే షూటింగ్ లొకేషన్లో తనను కేవలం ఓ దర్శకునిగా ట్రీట్ చేయడం నావల్ల కాదు. నా భర్త అనే ఫీలింగ్ నా మనసులో ఉంటుంది కాబట్టి, లొకేషన్లో తనేమైనా నియమాలు పెడితే, అలిగే ప్రమాదం ఉంది. మా మాధ్య చిరు అలకలు, చిన్ని చిన్ని గొడవలు కామన్. అవన్నీ ఉన్నాయి కాబట్టే.. మాది ‘హ్యాపీ ఫ్యామిలీ’ అనొచ్చు.