
కార్ల చోరీ ఇతివృత్తంగా బొంగు
కార్ల దొంగల ఇతివృత్తంగా రూపొందిస్తున్న చిత్రం బొంగు అని ఆ చిత్ర దర్శకుడు తాజ్ తెలిపారు. ఈయన ప్రముఖ కళాదర్శకుడు
కార్ల దొంగల ఇతివృత్తంగా రూపొందిస్తున్న చిత్రం బొంగు అని ఆ చిత్ర దర్శకుడు తాజ్ తెలిపారు. ఈయన ప్రముఖ కళాదర్శకుడు సాబు శిరిల్ వద్ద పలు చిత్రాలకు సహయ కళాదర్శకుడిగా పనిచేసి ఈ చిత్రం ద్వారా మెగాఫోన్ పట్టారు. ఆర్‌టీ.ఇన్ఫినిటీ డీల్ ఎంటర్‌టెయిన్‌మెంట్ పతాకంపై రఘుకుమార్ అనబడే తిరు, రాజరత్నం, శ్రీధర్ ముగ్గురు కలిసి నిర్మిస్తున్న చిత్రం బొంగు.
చతురంగం తదితర విజయవంతమైన చిత్రాల ఫేమ్ నటరాజ్(నట్టి) కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ఇది. 2014లో మిస్ ఇండియా పట్టం గెలుచుకున్న రూహీసింగ్ నాయకిగా ఈ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు.ఈ బ్యూటీ ఇప్పటికే హిందీతో పాటు ఇతర భాషల్లో నటిస్తున్నారన్నది గమనార్హం. మాధూర్ బండార్కర్ దర్శకత్వం వహించిన క్యాలెండర్ గర్ల్స్ చిత్రంలో నటించి ప్రాచుర్యం పొందిందీ భామ.
బొంగు చిత్రంలో ఇతర పాత్రల్లో అతుల్‌కులకర్ణి, ముండాసుపట్టి రాందాస్,అర్జున్, పావలా లక్ష్మణన్, మయిల్‌సామి,శ్యామ్ నటిస్తున్నారు. ప్రస్తుతం స్థానిక రాయపేటలోని ఓల్డ్ ఉడ్‌ల్యాండ్ హోటల్‌లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ నలుగురు కార్ల దొంగల ఇతివృత్తం తెరకెక్కిస్తున్న చిత్రం బొంగు అని అన్నారు. అయితే వారు ఎందుకు దొంగలుగా మారారు. ఆ తరువాత ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారన్న సంఘటనలో కథ, కథనం జెట్ స్పీడ్‌లో నడుస్తుందన్నారు.
ఇందులో ఒక రేస్ కారు ముఖ్య పాత్రగా ఉంటుందన్నారు. అందుకు ఖరీదైన రేస్ కారును ఉపయోగించామని చెప్పారు. ఆ కారు షోరూమ్ కోసం దేశం అంతా శోధించామనీ చివరికి అహ్మదాబాద్‌లో కనిపించిందని, అక్కడ అనుమతి తీసుకుని కీలక సన్నివేశాలు చిత్రీకరించినట్లు తెలిపారు. చిత్ర షూటింగ్‌ను చెన్నై,అహ్మదాబాద్, మధురై ప్రాంతాల్లో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దీనికి శ్రీకాంత్‌దేవా సంగీతాన్ని అందిస్తున్నారు.