ఒక్క రోజులో జరిగే కథ
‘‘టైటిల్ చూసి ఇదేదో డ్యాన్స్‌కు సంబంధించిన చిత్రం అనుకోకండి. ఇది డిఫరెంట్ థ్రిల్లర్ మూవీ. ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టే మర్డర్ మిస్టరీ’’ అని హీరో విశాల్ అన్నారు. విశాల్, కేథరిన్ జంటగా పాండిరాజ్ దర్శకత్వంలో విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై రూపొందిన చిత్రం ‘కథకళి’. సంక్రాంతి సందర్భంగా తమిళంలో ఈ నెల 14న విడుదలైన ఈ చిత్రాన్ని అదే పేరుతో త్వరలో తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు.
‘‘తన మిత్రుడికి జరిగిన సంఘటన ఆధారంగా దర్శకుడు ఈ చిత్రం తెరకెక్కించారు. చెన్నై నుంచి కడలూర్ వెళ్లే వరకూ ఒక్క రోజులో జరిగే కథ ఇది. స్క్రీన్‌ప్లే, ట్రీట్‌మెంట్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అని విశాల్ తెలిపారు. ‘‘ తమిళంలో సూర్యతో ‘పసంగ 2’ చిత్రం తర్వాత నేను చేసిన మూవీ ఇది’’ అని దర్శకుడు అన్నారు. ‘‘డిఫరెంట్ కాన్సెప్ట్‌తో సాగే మూవీ ఇది. తమిళంలో నాకిది రెండవ చిత్రం. తెలుగులోనూ విడుదలవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని కేథరిన్ పేర్కొన్నారు. సంగీత దర్శకుడు హిప్ హాప్ తమిళ, నటులు మధుసూదనరావు, శత్రు తదితరులు మాట్లాడారు.