తెలుగులో తనకు ఇష్టమైన హీరో నేనే | Celebrate birthday with family. | Sakshi
Sakshi News home page

తెలుగులో తనకు ఇష్టమైన హీరో నేనే

Published Fri, Jun 30 2017 3:10 AM | Last Updated on Tue, Sep 5 2017 2:46 PM

తెలుగులో తనకు ఇష్టమైన హీరో నేనే

తెలుగులో తనకు ఇష్టమైన హీరో నేనే

‘‘సక్సెస్‌ కోసం చేస్తా గానీ... ఇమేజ్‌ మారాలని నేనెప్పుడూ సినిమాలు చేయలేదు. నా సినిమాల్లో కొన్ని ఎందుకు ఆడాయి? కొన్ని ఎందుకు ఆడలేదు? అని విశ్లేషించుకున్నా. ‘సుడిగాడు’ తర్వాత ఎక్కువ నవ్వించాలనే తాపత్రయంతో సెంటిమెంట్‌ను కూడా కామెడీ చేసేశాం. సినిమా చూసినప్పుడు నవ్వుకున్నా... థియేటర్‌ బయటకొచ్చిన తర్వాత కథలోంచి కామెడీ వచ్చేలా, ఎమోషన్స్‌ మిస్‌ కాకుండా సినిమాలు చేయాలనుకున్నా’’ అన్నారు ‘అల్లరి’ నరేశ్‌. నేడు పుట్టినరోజు సందర్భంగా పలు విశేషాలను పంచుకున్నారీ కామెడీ హీరో.
బర్త్‌ డే స్పెషల్‌ ఏంటి?
ఈ రోజంతా మా పాపతోనే ఉంటాను. ఇప్పుడు తనకు తొమ్మిది నెలలు. నేను తండ్రైన తర్వాత వచ్చిన ఫస్ట్‌ బర్త్‌ డే ఇది. నా వైఫ్‌ విరూప వన్‌ వీక్‌ సర్‌ప్రైజ్‌ హాలిడే ట్రిప్‌ ఏదో ప్లాన్‌ చేసింది. సో, బర్త్‌డేను ఫ్యామిలీతో సెలబ్రేట్‌ చేసుకుంటున్నా.
అయానా ఈవిక... మీ పాప పేరు భలే ఉందే!
అయానా అంటే ‘అందమైన పువ్వు’ (ఆఫ్రికన్‌ లాంగ్వేజ్‌) అని అర్థం. సంస్కృతంలో ‘లక్ష్యం, దిశ’ అనే అర్థాలు వస్తాయి. తిరుపతి వెళ్లినప్పుడు ఓ చోట ఆ పేరు చూశా. అప్పుడే నాకు అమ్మాయి పుడితే ‘అయానా’ అని పేరు పెట్టాలనుకున్నా. ‘ఈవిక’ అంటే హిబ్రూ భాషలో ‘జీవితం’ అని అర్థం. నాన్నగారి పేరు ‘ఈవీవీ’లో ఏదో ఒకటి కలసి రావాలని ‘ఈవిక’ అని పెట్టా.
అన్నప్రాశన రోజున అయానా ఏం పట్టుకుంది?
నాన్నగారు దర్శకుడు కాబట్టి, పిల్లల అన్నప్రాశన రోజున క్లాప్‌ బోర్డు పెట్టడం సెంటిమెంట్‌. అయానా పెన్ను, క్లాప్‌ బోర్డు పట్టుకుంది. పెళ్లి తర్వాత, ముఖ్యంగా పాప పుట్టిన తర్వాత లైఫ్‌ మారింది. షూటింగ్‌ ఎప్పుడు కంప్లీట్‌ అవుతుందా? ఎప్పుడెప్పుడు ఇంటికి చేరుకుందామా? అనిపిస్తుంది. పిల్లలకు రెండు మూడేళ్లు వచ్చేవరకు భలే ముద్దుగా ఉంటారు. వాళ్లను వదలాలనిపించదు.
మీ వైఫ్‌కు ఇష్టమైన హీరో ఎవరు?
అజిత్‌. చెన్నై అమ్మాయి కదా! మిగతా తమిళ హీరోలన్నా ఇష్టమే. కానీ, అజిత్‌కి పెద్ద ఫ్యాన్‌.
 మరి, తెలుగులో?
ఇంకెవరూ? నేనే.
ఫ్యామిలీ లైఫ్‌లో ఆల్‌ హ్యాపీస్‌. మరి, సినిమా లైఫ్‌ ఎలా ఉంది? ఆచి తూచి అడుగులు వేస్తున్నట్టున్నారు?
ఎక్కువ సినిమాలు చేయడం కన్నా మంచి సినిమాలు చేద్దామని! నరేశ్‌ బాగా నవ్విస్తాడంటారు. కానీ, నటుడిగా నాకు పేరొచ్చిన, గుర్తింపు తెచ్చిన సినిమాలు మాత్రం ‘గమ్యం’, శంభో శివ శంభో’ వంటివే. ‘ఇటీవల మీరు ఎక్కువగా కామెడీపై కాన్సంట్రేట్‌ చేస్తున్నారు. ఎమోషన్స్‌ మీద కూడా దృష్టి పెట్టండి’ అని చాలామంది అన్నారు. ఆల్రెడీ 52 సినిమాలు చేశా. ఓసారి చేసిన సినిమాలు రిపీట్‌ కాకుండా చూసుకుంటున్నా. ప్రేక్షకులు నా నుంచి ఆశించే వినోదం, భావోద్వేగాలకు ప్రాముఖ్యత ఉండే కథలపై దృష్టి పెట్టాను.
ఈవీవీగారి తర్వాత నరేశ్‌తో అలా నవ్వించే సినిమాలను దర్శకులు తీయలేకపోతున్నారని కొందరు అంటున్నారు!
ఒక్కోసారి కాంబినేషన్‌ వర్కౌట్‌ అవుతుంది. జంధ్యాలగారు, రాజేంద్రప్రసాద్‌ గారి కాంబినేషన్‌లా... నాన్నగారితో నా కాంబినేషన్‌ వర్కౌట్‌ అయింది. తెలుగులో ఎక్కువమంది కమెడియన్స్‌ ఉన్నారు. వాళ్లందర్నీ సినిమాలో నటింపజేసి, వాళ్లకంటూ ప్రత్యేకంగా ఓ క్యారెక్టర్‌ క్రియేట్‌ చేయడం కష్టం. కానీ, నాన్నగారు క్రియేట్‌ చేశారు. ఆయన సినిమాల్లో ప్రతి పాత్రకూ ఓ ఫినిషింగ్‌ ఉంటుంది. నాన్న తర్వాత అలా చేసినోళ్లు ఉన్నారు. లేరని చెప్పడం లేదు. నాతో వాళ్ల కాంబినేషన్‌ కుదరాలి.
‘మేడ మీద అబ్బాయి’ ఎంతవరకు వచ్చాడు?
షూటింగ్‌ ఆల్‌మోస్ట్‌ పూర్తయింది. ఇందులో కథతో పాటు మంచి కామెడీ పడింది. నిర్మాత బొప్పన చంద్రశేఖర్‌గారు నాతో మంచి ఎమోషన్స్, కామెడీ రెండూ ఉన్న సినిమా తీయాలనేవారు. ఈ సినిమాకి ఈ రెండూ బాగా కుదిరాయి.
మహేశ్‌బాబు సినిమాలో చేస్తున్నారని టాక్‌?
ఆ సినిమా గురించి వాళ్లు (మహేశ్‌ 25వ సినిమా టీమ్‌) కలిశారు. మా మధ్య డిస్కషన్‌ జరిగింది. త్వరలో అసలు సంగతి చెబుతా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement