చిరంజీవి! మీరు బాకీ పడ్డారు- పూరి జగన్నాథ్
అభిమానులకే కాకుండా సహచర నటులకు, దర్శకులకు మెగాస్టార్ చిరంజీవి అంటే ఓ స్పూర్తి, నిలివెత్తు అభిమానం. చిరంజీవితో ఓ సీన్ లోనైనా కనిపించాలని, ఆయనతో ఓ సినిమా చేయాలని కోరుకున్న నటులు దర్శకులు ఎందరో ఉన్నారు. ఇప్పటికి ఓకే అంటే చిరంజీవితో సినిమా చేయడానికి ఎంతో మంది క్యూలో ఎదురు చూస్తున్నారు.
రాజకీయాల్లోకి ప్రవేశించక ముందు వరకు చిరంజీవి 149 సినిమాల్లో నటించారు. 150 చిత్రంలో నటించడానికి సిద్ధమంటే తాను దర్శకత్వం వహిస్తానని రాంగోపాల్ వర్మ, పూరి జగన్నాధ్, కృష్ణ వంశీలాంటి క్రియేటివ్ డైరెక్టర్లు పలు ఇంటర్వ్యూలో వెల్లడించిన సంగతి తెలిసిందే.
అయితే ఆగస్టు 22న చిరంజీవి జన్మదినోత్సవం. చిరంజీవి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని దర్శకుడు పూరి జగన్నాధ్ సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో ఆసక్తికరమైన వ్యాఖ్యలను పోస్ట్ చేశారు.
'మీ సినిమాలు చూస్తూ పెరిగాం. కాని మీరు మాకు ఒక సినిమా బాకీ పడ్డారు. అది ఎప్పుడు?' అంటూ పూరి ట్వీట్ చేశారు. చిరంజీవి 2009 సంవత్సరంలో చివరిసారిగా తన కుమారుడు రాం చరణ్ తేజ నటించిన 'మగధీర' చిత్రంలో మెరుపులా అలా వచ్చి ఇలా వెళ్లారు. ఆతర్వాత ప్రజారాజ్యం పార్టీ పెట్టి రాజకీయాల్లోకి ప్రవేశించారు. అప్పటి నుంచి అభిమానులకు మెగాస్టార్ చిరంజీవి దూరమయ్యారు.