
పూరితో... ఆటోజానీ?
రాజకీయాలకు కొంత దూరంగా ఉంటూ, మళ్ళీ గ్లామర్ మీద, ఫిజికల్ ఫిట్‌నెస్ మీద దృష్టిపెట్టిన నటుడు - రాజకీయవేత్త చిరంజీవి. ఇంతకీ ఆయన నటించే 150వ సినిమా ఏమిటి? దర్శకుడు ఎవరు? కొన్ని నెలలుగా ఈ చర్చ సాగుతూనే ఉంది. ఇంతకీ, ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించనున్నారా? ఇప్పుడు వినిపిస్తున్న మాట అదే! చిరంజీవి కోసం ఇప్పటి దాకా కథ, స్క్రిప్టు సిద్ధం చేయలేదన్న మాటే కానీ, ‘ఆటో జానీ’ పేరిట పూరి ఒక టైటిల్ రిజిస్టర్ చేయించారట! తాజాగా ఓ ఇంటర్వ్యూలో పూరి జగన్నాథే ఈ సంగతి వెల్లడించారు.
సాక్షాత్తూ అమితాబ్ సైతం ఆ మధ్య మాట్లాడుతూ, చిరంజీవి 150వ సినిమాకు పూరి పేరు సిఫార్సు చేస్తూ, ఆయన దర్శకత్వం వహిస్తే తాను అందులో అతిథి పాత్ర చేస్తానన్న సంగతినీ పూరీయే గుర్తు చేశారు. ఇక, ఇటీవలే రామ్‌గోపాల్ వర్మ తన ట్విట్టర్ తూటాల్లో చిరుకు పూరి పేరు సూచించిన విషయం తెలిసిందే! మరి ట్వీట్లు, సిఫార్సు మాటల మాటెలా ఉన్నా, టైటిల్ పెట్టి మరీ సిద్ధంగా ఉన్న వీరాభిమాని పూరికి చిరంజీవి చాన్సిస్తారా? చిరంజీవి ఫోన్‌కాల్ కోసం పూరి ఎదురు చూస్తుంటే, ఈ వార్త నిజమై, అధికారికంగా ఈ కాంబినేషన్ ఖరారైతే అంతకన్నానా అని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇక పెదవి విప్పాల్సింది చిరంజీవే!