
దేవిశ్రీ మ్యూజిషియన్ కాదు... మెజీషియన్!
‘‘డి.ఎస్.పి. (దేవిశ్రీ ప్రసాద్) అంటే... డెడికేషన్, స్ట్రాటజీ, పాపులారిటీ. ప్రేక్షకులను ఎలా ఎంటర్‌టైన్ చేయాలనేది దేవిశ్రీకి బాగా తెలుసు. అతనో మ్యూజిషియన్ కాదు, మెజీషియన్’’ అన్నారు ప్రముఖ హీరో చిరంజీవి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ చేయనున్న మ్యూజిక్ టూర్ ప్రోమోను ఆదివారం చిరంజీవి విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ – ‘‘ఈ టూర్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని దివ్యాంగుల కోసం తన తండ్రి సత్యమూర్తిగారి పేరిట స్థాపించిన ఫౌండేషన్‌కు ఇవ్వబోతున్నాడు. అందుకు దేవిశ్రీని అభినందిస్తున్నా’’ అన్నారు. ఈ టూర్‌లో టాప్ మ్యూజిషియన్స్, టాప్ డ్యాన్సర్స్ పాల్గొంటారని డి.ఎస్.పి. తెలిపారు. మే 27న సిడ్నీ, జూన్ 3న మెల్‌బోర్న్ (ఆస్ట్రేలియా), జూన్ 10న బ్రిస్బేన్, జూన్ 17న ఆక్లాండ్ (న్యూజిలాండ్) నగరాల్లో జరగనున్న ఈ టూర్‌ను కేకే ప్రొడక్షన్స్ ఆర్గనైజ్ చేస్తోంది. ఈ కార్యక్రమంలో నిర్మాతలు ‘జెమిని’ కిరణ్, ‘స్రవంతి’ రవికిశోర్, ‘దిల్’ రాజు, దర్శకుడు కల్యాణ్‌కృష్ణ, పాటల రచయితలు రామజోగయ్య శాస్త్రి, శ్రీమణి తదితరులు పాల్గొన్నారు.