
చిరంజీవి ఆ పాట వద్దన్నారు!
‘‘హీరోల టేస్టుకు తగ్గట్టు ఇప్పుడు పాటలు చేస్తున్నారు. హీరో డ్యాన్స్ స్పెషలిస్ట్ అయితే పాటలన్నీ డ్యాన్స్ బేస్డ్ అడుగుతారు. హీరో మాస్ అయితే మాస్. ఒక్కో హీరో ఒక్కో స్టైల్ ఫిక్స్ చేసుకుని అటువైపు వెళ్తున్నారు’’ అన్నారు మణిశర్మ. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సంగీతమందించిన ఆయన చేసిన తాజా సినిమా ‘ఫ్యాషన్ డిజైనర్’. సుమంత్ అశ్విన్ హీరోగా వంశీ దర్శకత్వంలో ‘మధుర’ శ్రీధర్ నిర్మించిన ఈ సినిమా గురించి మణిశర్మ చెప్పిన ముచ్చట్లు...
వంశీగారితో పని చేయాలనే నా చిరకాల కోరిక ‘ఫ్యాషన్ డిజైనర్’తో తీరింది. ప్రతి హీరోకి ఓ స్టైల్, బాడీ లాంగ్వేజ్ ఉంటాయి. ఓ హీరోకి చేసిన పాటలు మరో హీరోకి సూట్ కావు. ఎవరి స్టైల్‌కి తగ్గట్టు వాళ్లకు పాటలు ఇవ్వడంలో నేను ఎక్స్‌పర్ట్. వంశీగారి సినిమాల్లో పాటలు విన్నాను. ఆయన స్టైల్ తెలుసు కనుక ఈజీగా సాంగ్స్ కంపోజ్ చేశా. ఈ సినిమాలో అన్నీ మెలోడీలే. ఒక్కో పాటను ఒక్కో కాన్సెప్ట్‌లో డిజైన్ చేశారు. ∙ప్రతి పాటకు ఒకేలా కష్టపడతా. కానీ, ఏ పాట ఎంత హిట్టవుతుందనేది ఎవరూ చెప్పలేరు. పాటలు హిట్టయితే మనలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. జనాలకు ‘వీడు మ్యూజిక్ చేస్తే పాటలు వినొచ్చు’ అనే నమ్మకం కలుగుతుంది. అప్పుడు ప్రయోగాలు చేస్తా. ఉదాహరణకు... ‘చూడాలని వుంది’ చిత్రంలో ‘రామ్మా చిలకమ్మా’ పాటను చిరంజీవిగారు వద్దన్నారు.
నేను కాన్ఫిడెన్స్‌తో చేశా. కానీ, ఆయన వద్దన్నారని వేరే పాట రికార్డు చేశా. సెట్‌లో డ్యాన్సర్స్ అంతా ‘రామ్మా చిలకమ్మా’కు ఓటేయడంతో ఓకే చేశారు. అలాంటి హిట్ పాటను మళ్లీ చేయాలనుకుంటే కుదరదు. అద్భుతాలు వాటికవే జరగాలి. ∙నాకు కథే ముఖ్యం. హీరోల ఛాయిస్ వల్ల కథ, సందర్భాలతో పనిలేకుండా పోతోంది. ఈ ధోరణి వల్ల సంగీత దర్శకులపై ఒత్తిడి ఎక్కువైంది. అందుకే నేను చిన్న దర్శకులతో పని చేస్తున్నా. చిన్న సినిమాలు చేస్తున్నా. ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య ‘శమంతకమణి’, హను రాఘవపూడి ‘లై’ ఇంకొన్ని చేస్తున్నా. యువ దర్శకులు కథకు తగ్గట్టు మంచి సంగీతాన్ని కోరుకుంటున్నారు.