కట్ చేస్తే... కాంట్రవర్సీ!
సినిమా అంటే వినోదం. అది థియేటర్‌లో తెర మీద వరకే ఉంటే బాగుంటుంది. కానీ... ఇప్పుడది తరచూ వీథిన పడుతోంది. కోర్టులకూ, స్టేషన్‌లకూ చేరుతోంది. ఒక్కోసారి బాహాబాహీ వరకూ వెళుతోంది. ప్రేక్షకులు టికెట్ కొని, వినోదం చూడడానికి ఇష్టపడతారు. కానీ, ఈ తాజా వివాదాల ఉచిత వినోదం వారికి సినిమాపై గౌరవం పోగొడుతోందేమో అనిపిస్తోంది. తెలుగు సినిమాలో కథ ఉండాలి. కాంట్రవర్సీ కాదు. కొన్ని కొత్త... పాత కాంట్రవర్సీల స్పెషల్ ఇది.
1. నోరు జారారు!
‘‘సమంత లో నాకు నచ్చేదేంటంటే ఆమె నడుము... ఆ నడుము చూసినప్పుడు బెజవాడ బెంజ్ సర్కిల్ గుర్తొస్తుంది’’, ‘‘అనుష్క తొడలంటే నాకు చాలా ఇష్టం. ‘బిల్లా’ సినిమాలో ఆమె తొడలు సామాన్యంగా ఉండవు’’ అని పబ్లిక్‌గా కథానాయికలపై కమెడియన్ అలీ అభ్యంతర కరమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సినిమా ఫంక్షన్స్‌లో యాంకర్‌గా అలీ చేసే ఈ కామెంట్స్ ఒక్కోసారి శ్రుతి మించుతాయి. అందర్నీ నవ్వించడం కోసమే చేస్తున్నానని అలీ అన్నప్పటికీ చాలామంది తేలికగా తీసుకోలేదు. సమంత, అనుష్కలు ఈ వ్యవహారాన్ని పెద్దగా పట్టించుకోకపోయినా, అలీ మీద విమర్శల దాడి మాత్రం ఆగలేదు. ‘బాహుబలి’లో హీరోయిన్ తమన్నాను చూపించిన వైనం గురించి విరుచుకు పడిన ప్రవాస భారతీయురాలు అన్నపూర్ణ సుంకర ఆ తర్వాత అలీపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, హీరో నందమూరి బాలకృష్ణ కూడా ఇటీవల ‘సావిత్రి’అడియో ఫంక్షన్‌లో చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. సినిమాల్లో తాను ఎలాంటి పాత్రలు చేస్తే అభిమానులు హర్షిస్తారనే విషయాన్ని ప్రస్తావిస్తూ - ‘‘అమ్మాయిలు వెంటపడే పాత్రలు చేస్తే నా అభిమానులు ఒప్పుకోరు. ముద్దైనా పెట్టాలి.. కడుపైనా చేయాలి’’ అని బాలకృష్ణ అనడం పెద్ద దుమారాన్నే రేపింది. సినిమాల్లో పాత్రలను ఉద్దేశించి అన్నప్పటికీ పబ్లిక్‌గా ఇలా వ్యాఖ్యానించడం తప్పే అని చాలామంది అన్నారు. ‘సావిత్రి’లో నటించిన నందిత కూడా ‘బాలకృష్ణ అలా అనడం తప్పు’ అని పేర్కొంది. మొత్తానికి, పబ్లిక్ వేదికలపై ప్రసంగించేటప్పుడు చాలా మెలకువగా ఉండాలి. ఇలా నోరు జారితే అభాసుపాలు కాక తప్పదు మరి.
2.లీక్‌లతో బ్లాస్ట్‌లు
స్టిల్స్ బయటికొస్తేనే కథ బయటపడిపోతుందనేంత అతిజాగ్రత్త సినిమా వాళ్లది. అందుకే చాలా సినిమాల షూటింగ్ స్పాట్‌కి అవుటర్స్ నాట్ ఎలౌడ్! ఒకవేళ వచ్చినా సెల్‌ఫోన్స్ స్విచ్చాఫ్ చేయాల్సిందే. ఇంత జాగ్రత్త తీసుకున్నా సరే- రిలీజ్‌కు ముందే ఏకంగా సగం సినిమానే బయటికొచ్చేస్తే ఆ యూనిట్ పరిస్థితేంటి? ‘అత్తారింటికి దారేది’ విషయంలో అదే జరిగింది. సినిమా రిలీజ్ దగ్గర పడిన సమయంలో సినిమా నెట్‌లో ప్రత్యక్షమైపోయింది. ఇంకేముంది. నిర్మాత గుండె జారిపోయింది. ఇండస్ట్రీ కూడా షాక్‌కి గురైంది. సినిమా రిలీజయ్యాక వస్తున్న పైరసీని కంట్రోల్ చేయలేక నానా తంటాలు పడుతుంటే మరి రిలీజ్‌కు ముందే ఇలా జరిగితే పరిస్థితేంటి? హీరో పవన్ కల్యాణ్, డెరైక్టర్ త్రివిక్రమ్‌ల సపోర్ట్‌తో నిర్మాత భోగవల్లి ప్రసాద్ విపత్కర పరిస్థితి నుంచి బయటపడగలిగారు. సినిమా బ్లాక్‌బస్టర్ కావడంతో అందరూ రిలాక్స్‌డ్‌గా ఊపిరి పీల్చుకున్నారు. ‘బాహుబలి’ విషయంలో కూడా ఇలాంటిదే జరిగింది. విజువల్ ఎఫెక్ట్స్ కోసం పంపిన 12 నిమిషాల షూటింగ్ పుటేజీను వ్యక్తిగత కక్షతో నెట్‌లో పెట్టేశారు. ఆ వీడి యోను నెట్‌లోంచి తొలగించడానికి యూనిట్ సభ్యులు నానా తంటాలు పడాల్సి వచ్చింది. అలాగే ఆడియో రిలీజ్‌కన్నా ముందే పాటలు ఎవరో నెట్‌లో పెట్టేశారు.
3.వర్మ... పెద్ద ట్విట్లర్!
రామ్‌గోపాల్ వర్మ తన సినిమాలతోనే కాదు ఈ మధ్య ట్వీట్లతో కూడా భయపెడుతున్నారు. ఎవరిని, ఎప్పుడు, ఎక్కడ, ఎలా ట్వీట్లతో గిచ్చుతాడోనని చాలామంది సెలబ్రిటీలు భయపడి చచ్చిపోతున్నారు. ఆ మధ్య చిరంజీవినీ, ఆ తర్వాత పవన్ కల్యాణ్‌నీ వరుస ట్వీట్లతో ముంచెత్తాడు. వాళ్లను పొగుడుతున్నాడో, తిడుతున్నాడో తెలీనంతగా వర్మ కామెంట్స్ ఉంటాయి. ‘బాహుబలి’ తెలుగు సినిమా ఖ్యాతిని అందలానికి తీసుకెళ్తే ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ దాన్ని పాతాళానికి చేర్చేసిందని డెరైక్ట్‌గా విమర్శించాడు కూడా! అసలు మామూలుగా ఇలాంటి వాటికి స్పందించని పవన్ కల్యాణ్ కూడా వర్మ ట్వీట్లకు ఇరిటేట్ అయి, స్పందించాల్సొచ్చింది. ‘‘ఆయన ఎదుటివాళ్లపై కాకుండా తనపై తాను శ్రద్ధ పెడితే జేమ్స్‌కామెరూన్ స్థాయికి వెళ్లేవాడు’’ అని పవన్ కల్యాణ్ ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు. ఆ మధ్య ‘శ్రీదేవి’ పేరుతో ఒక సినిమా అనౌన్స్ చేసి ఇలాగే కాంట్రవర్సీ లేవనెత్తాడు వర్మ. శ్రీదేవి పోస్టర్‌ను బట్టి ఒక ప్రౌఢను ఒక స్కూలు పిల్లాడు మోహించడం కథా వస్తువుగా కనిపించడంతో విమర్శలు వెలువెత్తాయి. దాంతో పాటు ఇలాంటి అశ్లీలమైన సినిమాకి తన పేరు పెట్టడం గురించి నటి శ్రీదేవి సీరియస్ అయ్యిందని వార్త. మొత్తం మీద ఆ సినిమా ప్రయత్నం ఆదిలోనే ఆగిపోయింది.
4. నేల పాలు!
రజనీకాంత్ సినిమాలంటే పాలు పొంగుతాయి. నిమ్మకాయల దండలు మెడలో పడతాయి. భారీ పూలమాలలు తల ఎత్తి చూసేలా చేస్తాయి. అయితే ఇక మీదట అభిమానులకు ఉండే ఇలాంటి ముచ్చట తీరకపోవచ్చు. ఇందుకు కారణం ఒక వ్యక్తి నుంచి వచ్చిన అభ్యంతరం. డి.ఐ.ఎం.ఎస్. మణివణ్ణన్ అనే సామాజిక కార్యకర్త బెంగళూరు కోర్టులో ఒక కేసు వేశారు. పాలు అందని దయనీయ స్థితిలో దేశవ్యాప్తంగా ఎంతోమంది పసిపిల్లలు ఉన్నారనీ, తాగడానికి పాలు లేనప్పుడు సినిమా విడుదల సమయంలో కటౌట్లకు ఫ్యాన్స్ చేసే క్షీరాభిషేకాలు ఎంతవరకు సమంజసమనీ, ఇలాంటి పనుల్ని స్వయంగా రజనీకాంత్ వ్యతిరేకిస్తే బాగుంటుందనీ ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మణివణ్ణన్ ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన న్యాయస్థానం రజనీకాంత్‌కు నోటీసు పంపించింది. ఒకవేళ న్యాయస్థానం నుంచి క్షీరాభిషేకాలు వద్దనే తీర్మానం వస్తే అప్పుడు దీన్ని దేశవ్యాప్తంగా అందరి దృష్టికీ తీసుకెళ్లాలనుకుంటున్నానని మణివణ్ణన్ పేర్కొన్నారు. దేశంలో ఎంతోమంది హీరోలకు ఇలాంటి అభిషేకాలు జరుగుతున్నాయనీ, అన్నింటినీ ఆపేయవచ్చనీ అంటున్నారు.
కటౌట్ పడిందా? అంతే సంగతులు!
త్వరలో కటౌట్‌ల సంస్కృతికి కూడా తెర పడవచ్చు. ఈ మధ్య విడుదలైన తమిళ చిత్రం ‘తేరి’ (తెలుగులో ‘పోలీస్’) కోసం ఆ చిత్ర హీరో విజయ్ అభిమానులు తమిళనాడులోని నెల్లై జిల్లాలోని రామ్ థియేటర్ ముందు140 అడుగుల భారీ కటౌట్ పెట్టారు. ఇది గాలికి నేలకొరిగింది. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగలేదు. అయితే, ఆ కటౌట్ సరిగ్గా పోలీసు జీపు మీద పడటంతో ఆ జీపు నుజ్జు నుజ్జయ్యింది. దీని మీద కూడా విమర్శలు వచ్చాయి. దీంతో, కటౌట్‌ల ఊపు తగ్గే అవకాశం ఉంది.
5. రియల్ వర్సెస్ రీల్ పోలీస్!
సమాజంలో బాధ్యతాయుతమైన పాత్రలను పోషిస్తున్న వాళ్లలో రక్షకభటుల స్థానం చాలా కీలకమైనది. సినిమాల్లో అన్యాయాన్ని ఎదిరించడానికి విజృంభించే పోలీసులను చూస్తుంటాం. అలాగే, నెగటివ్ టచ్ ఉన్న పోలీసులను కూడా చూస్తాం. పాజిటివ్‌గా చూపించినప్పుడు ఎలా ఉన్నా.. నెగటివ్ షేడ్‌లో చూపించడం మాత్రం రియల్ పోలీసులకు మింగుపడని విషయమే. అప్పట్లో ‘పోలీసోడి పెళ్లాం’ టైటిల్‌పరంగా విమర్శలు ఎదుర్కొంటే.. ‘పోలీస్ భార్య’గా మార్చారు. ఇటీవల విడుదలైన తమిళ ‘తేరి’ తెలుగు అనువాదానికి ‘పోలీసోడు’ అని పెట్టడం వివాదమైంది. దాంతో ‘పోలీస్’ అని మార్చారు. త్వరలో విడుదల కానున్న శ్రీకాంత్ ‘మెంటల్ పోలీస్’ కూడా టైటిల్ వివాదంలో ఇరుక్కుంది. పోలీస్ శాఖను కలిసి, ఈ టైటిల్ ఎందుకు పెట్టామో వివరిస్తామనీ, వాళ్లు వ్యతిరేకిస్తే టైటిల్ మారుస్తామనీ హీరో శ్రీకాంత్ పేర్కొన్నారు. మొత్తానికి రియల్ పోలీసులకు రీల్ పోలీసులకు మధ్య ఇలాంటి వివాదం ఎప్పట్నుంచో ఉంది. ఆ సంగతలా ఉంచితే... ‘లక్ష్మీనరసింహా’, ‘గబ్బర్‌సింగ్’, ‘టెంపర్’, ‘పటాస్’ వంటి చిత్రాల్లో నెగటివ్ ఉన్న షేడ్ ఉన్న పోలీసులే కనిపించారు. ఈ చిత్రాలు బంపర్ హిట్టయ్యాయి. ఇది సక్సెస్ ఫార్ములా అనే ముద్రపడింది. వివాదాలు నెలకొన్న నేపథ్యంలో ఈ ఫార్ములాని కొనసాగిస్తారో? లేదో? కాలమే చెప్పాలి.
6.ఆమె వ్యాఖ్యలు ఓ హాట్ టాపిక్!
టాలీవుడ్ సంచలన చిత్రం ‘బాహుబలి’ తెచ్చుకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా పేలవంగా ఉందని కొందరంటే, ఇదో అద్భుతం అని మరికొందకన్నారు. అన్నపూర్ణ సుంకర అనే ఎన్నారై అమ్మాయి మాత్రం సోషల్ మీడియా ద్వారా ఈ చిత్రంలో తమన్నా చేసిన అవంతిక పాత్ర గురించి విమర్శనాస్త్రాలు సంధించారు. ఫలితంగా ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోయారు. ‘బాహుబలి’లో ‘పచ్చబొట్టేసినా..’ పాటకు ముందు అవంతిక దుస్తులను శివుడు (ప్రభాస్) విప్పడాన్ని వాళ్లిద్దరికీ మధ్య జరిగే ఓ రొమాంటిక్ సీన్‌గా దర్శకుడు చూపించారు. కానీ, ఇలా చూపించడం అవంతికను అత్యాచారం చేసినట్లుందని అన్నపూర్ణ వ్యాఖ్యానించారు. ఇది పెద్ద దుమారమే రేపింది. శివగామి అనే అద్భుతమైన పాత్రను సృష్టించిన రాజమౌళి, అవంతికను ఓ బలహీన మనస్కురాలిగా చూపించడం ఎంతవరకూ సమంజసమని ఆమె ప్రశ్నించారు. పబ్లిక్ ఫంక్షన్స్‌లో కథానాయికలపై అలీ విసిరే వ్యంగ్యాస్త్రాలకు సంబంధించి కూడా అన్నపూర్ణ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. తెలుగు సినిమా పరిశ్రమపై వ్యాఖ్యలు చేసిన అన్నపూర్ణ సుంకర మీద పలువురు సినీ, టీవీ కళాకారులు కూడా కౌంటర్‌లు ఇచ్చారు. దాంతో, ఈ వివాదం గత ఏడాది కొంత కాలం సినీ పరిశ్రమలో పెద్ద చర్చకే దారి తీసింది.
7.దొరకనివాళ్లు దొరలా?
ఫలానా నటి వ్యభిచారం చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిందనే వార్తలు అప్పుడప్పుడూ వస్తుంటాయి. అయితే ఆ తారల పేర్లు పెద్దగా వెలుగులోకి రావు. కానీ వర్ధమాన యువనటి శ్వేతాబసు ప్రసాద్ వ్యవహారం మాత్రం రచ్చ రచ్చ అయ్యింది. వ్యభిచారం కేసులో అరెస్ట్ అయిన శ్వేత కొన్ని నెలల పాటు రెస్క్యూ హోంలో ఉండాల్సి వచ్చింది. తర్వాతే న్యాయస్థానం విడుదల చేసింది. మరి వ్యభిచారం కేసులో పట్టుబడ్డప్పుడు పురుష పుంగవుల మాటేంటి? దొరకని దొరల సంగతేంటి? ఇలాంటి వ్యవహారాల్లో మధ్యవర్తిత్వం నడిపించే తార్పుడుగాళ్ళు ఏమయ్యారు? అనే చర్చలు రేగాయి. ఈ నేపథ్యంలో శ్వేతపై చాలామంది సానుభూతి వ్యక్తం చేశారు. దాదాపు మూడేళ్లగా ఖాళీగా ఉంటున్న శ్వేత త్వరలో ఓ హిందీ చిత్రంలో నటించనున్నారనే వార్త వినిపిస్తోంది.
8.వారి అనుబంధం ఇప్పుడు కోర్టులో!
బాలీవుడ్‌లో లేటెస్ట్ హాట్ టాపిక్... హృతిక్‌రోషన్, కంగనా రనౌత్‌ల మధ్య నలుగుతున్న వివాదమని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ ‘క్రిష్-3’ టైమ్‌లో ప్రేమలో పడ్డారని అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. కానీ, అప్పట్లో ఎవరూ స్పందించలేదు. ఇటీవల హృతిక్ రోషన్‌పై సడన్‌గా కంగనా రనౌత్ పరోక్షంగా కామెంట్లు చేయడంతో ఇద్దరి మధ్యా మాటల యుద్ధానికి తెర లేచింది. కంగన తనను ఉద్దేశించే వ్యాఖ్యానించిందని ఆమెకు హృతిక్ లీగల్ నోటీస్ పంపడంతో వ్యవహారం కోర్టు దాకా వెళ్లింది. ప్రధానంగా ఈ ఇద్దరి వ్యవహారం వీళ్లిద్దరూ చేసుకున్న మెయిల్ సంభాషణ చుట్టూ తిరుగుతోంది. హృతిక్, తానూ మెయిల్స్ ద్వారా మాట్లాడుకున్నామని కంగన పేర్కొన్నారు. అయితే, హృతిక్ వాదన మరోలా ఉంది. అసలు కంగనతో సంభాషణ జరిపింది తాను కాదని ఆయన స్పష్టం చేశారు. తన పేరు చెప్పుకుంటూ కంగనతో వేరే వాళ్లు మెయిల్ సంభాషణ జరిపారని హృతిక్ చెప్పడంతో ఈ వివాదం మరింత వేడెక్కింది. కంగనా రనౌత్ లాయర్ హృతిక్ ఆరోపణలకు మెలిక పెడుతూ ఓ నోటీసు పంపించారు. రెండేళ్ల క్రితమే, తన బదులు ఎవరో నకిలీ మెయిల్ ఐడీ క్రియేట్ చేశారని హృతిక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరి.. ఇప్పటివరకూ దాని గురించి పోలీసులు ఎందుకు విచారణ చేపట్టలేదని కంగన లాయర్ తన నోటీసులో ప్రశ్నించారు. చూడబోతుంటే ఈ వ్యవహారం ఇప్పట్లో ఓ కొలిక్కివచ్చేలా లేదు. మరి.. కంగన అలసిపోయారేమో... ఈ గొడవలన్నిటికీ దూరంగా కాస్త బ్రేక్ తీసుకుని ఎక్కడికో వెళ్లాలనుకుంటున్నారట.
9.డిష్యుం... డిష్యుం
తెర మీద బాహాబాీహ చేసే హీరోలు ఈసారి నిజ జీవిత ఎన్నికల్లో హోరాహోరీగా తలపడడం విశేషం. తెలుగు నటీనటుల సంఘానికి చెందిన ఎన్నికలు మాత్రమే కాదు చెన్నైలోని దక్షిణాది నటీనటుల ‘నడిగర్ సంఘం’ ఎన్నికలు కూడా వాడివేడిగా జరిగాయి.‘మా’ అధ్యక్ష పదవికి నటుడు రాజేంద్రప్రసాద్, నటి జయసుధ పోటీపడటంతో తెలుగు పరిశ్రమ రెండు వర్గాలుగా చీలిపోయి, తాము మద్దతు ఇస్తున్న ప్యానెల్‌ని గెలిపించడానికి జోరుగా ప్రచారం చేశాయి. బరిలో ఉన్న అభ్యర్థుల్లో కొంతమంది మాటల తూటాలు వదులుకున్నారు. ఎవరికివారు ‘మా’ మధ్య విభేదాలు లేవు అని చెప్పినప్పటికీ అదంతా పై పై మాటలే అని తేలింది. చివరకు రాజేంద్రప్రసాద్ అధ్యక్ష పదవి దక్కించుకున్నారు. దక్షిణాది సినీనటుల సంఘమైన ‘నడిగర్ సంఘం’ విషయానికొస్తే సీనియర్ నటుడు శరత్‌కుమార్‌కి బలమైన సవాలే విసిరారు యువహీరో విశాల్. నాజర్ వంటి సీనియర్ నటుడు, కార్తీలాంటి యువ హీరోలను కలుపుకొని ‘పాండవర్ అణి’ అని తమ టీమ్‌కి పేరు పెట్టి బరిలోకి దిగారు. ఇటు విశాల్ వర్గం, అటు శరత్‌కుమార్ వర్గం తగ్గేది లేదన్న చందంగా ఒకరినొకరు తూలనాడుకున్నారు. ‘పాండవర్ అణి’ టీమ్‌లో నాజర్ అధ్యక్షుడవగా, విశాల్, కార్తీ తదితరులు ఇతర కీలక బాధ్యతలు చేపట్టారు. ఈ రెండు నటీనటుల సంఘాలు ఎన్నికల సమయంలో చేసిన రచ్చ ఔత్సాహికులకు వినోదం పంచింది.
10.కాపీ... రైటా?
ఇటీవల తెలుగు, తమిళ భాషల్లో హాట్ టాపిక్‌గా నిలిచిన సినిమా ‘కత్తి’. విజయ్ హీరోగా తమిళంలో పెద్ద విజయం సాధించిన ఈ సినిమా మూల కథ మన తెలుగు దర్శకుడైన నరసింహారావుదనే వివాదం బలంగా ఉంది. చాలా ఏళ్ల క్రితం నరసింహారావు తన మూల కథతో తమిళ హీరో విజయ్‌ని కలవగా, సూపర్‌గుడ్ ఆర్.బి. చౌదరి నిర్మాతగా కొంత పని కూడా జరిగింది. ఈ కథకు అనుభవజ్ఞుడైన దర్శకుడైతే బావుంటుందని విజయ్ భావించి, కథ ఇచ్చేయమని నరసింహారావుని అడిగారు. అతనొప్పుకోలేదు. దాంతో ఆ ప్రాజెక్ట్ అక్కడితో ఆగిపోయింది. కట్ చేస్తే- అదే కథను స్వల్ప మార్పులతో దర్శకుడు మురుగదాస్ ‘కత్తి’ పేరుతో తెరకెక్కించాడు. సినిమా రిలీజయ్యాక నరసింహారావుకి ఇది తన కథేనని అర్థమైంది. అప్పట్నుంచీ నరసింహారావు పోరాటం మొదలుపెట్టారు. ఈలోగా చిరంజీవి 150వ చిత్రంగా ‘కత్తి’ని రీమేక్ చేయడానికి సిద్ధమయ్యారు. ఇంకా తన సంగతి తేల్చకుండా రీమేక్ చేయడానికి వీల్లేదని నరసింహారావు ఫెడరేషన్‌ను, డెరైక్టర్స్ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం చైర్మన్ దాసరి నారాయణరావు ఉద్దేశపూర్వకంగానే చిరంజీవి 150వ చిత్రానికి అడ్డంకులు కల్పిస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఆరోపణలు వెల్లువెత్తాయి. దాంతో పలువురు సినీ పెద్దలు తెరవెనుక ఈ వివాదానికి ముగింపు పలకడానికి సిద్దమయ్యారు. ‘‘దాదాపుగా ఈ వివాదం ముగిసినట్టే. ప్రముఖ నిర్మాత ఎన్.వి. ప్రసాద్ దీన్ని డీల్ చేస్తున్నారు’’ అని నరసింహారావు ‘సాక్షి’ కి తెలిపారు. తెలుగు సినిమాకు ఇలాంటి కాపీరైట్ వివాదాలు కొత్త అని కాదు, బ్లాక్‌బస్టర్ మూవీలైన ‘మగధీర’, ‘శ్రీమంతుడు’ విషయాల్లో కూడా కథలు ఫలానా నవలల్లోవంటూ ఇలాంటి వివాదాలొచ్చాయి.
లోఫర్ కాదు
డెరైక్టర్ పోలీస్‌స్టేషన్‌లో యాక్షన్ చెప్పారు. డిస్ట్రిబ్యూటర్లు ప్రెస్ ముందు కట్ చెప్పారు. ప్రస్తుతం ‘లోఫర్’ సినిమా వివాదం ఇటు పరిశ్రమలో, అటు ప్రేక్షకులలో హాట్ టాపిక్‌గా మారింది.
అసలు ఏం జరిగింది?
‘లోఫర్’ చిత్రం నష్టాలు తెచ్చింది కనుక డబ్బులు వెనక్కి కట్టమని డిస్ట్రిబ్యూటర్లు కొందరు దర్శకుడు పూరీ జగన్నాథ్‌ను అడుగుతున్నారు. కొద్ది నెలలుగా ఈ వివాదం నలుగుతోంది. ఈ నేపథ్యంలో ముగ్గురు డిస్ట్రిబ్యూటర్లు (ముత్యాల రామ్‌దాస్, నామా అభిషేక్, అతని మిత్రుడైన కాలి సుధీర్‌లు) తన ఇంటికొచ్చి, తనపై దాడికి దిగారని పోలీస్ స్టేషన్‌లో పూరీ ఫిర్యాదు చేశారు. తాము దాడికి దిగలేదన్నది డిస్ట్రిబ్యూటర్ల ఆవేదన కాగా, వాళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని పూరీ వాదన.
పూరి జగన్నాథ్ ఏమంటున్నారు?
‘‘నిజానికి, ‘లోఫర్’ సినిమా రిలీజ్‌కు ముందే (డిస్ట్రిబ్యూటర్లు) అభిషేక్, సుధీర్‌లు నా ఆఫీసుకు వచ్చారు. వాళ్ళ బ్యానర్‌లో 5 సినిమాలు చేసేందుకు సంతకం పెట్టమని అభ్యర్థించారు. అలాగే, (డిస్ట్రిబ్యూటర్) ముత్యాల రామ్‌దాస్ కూడా వచ్చి, తన బ్యానర్‌లో ఒక సినిమా చేయాల్సిందిగా అడిగారు. అయితే, నాతో సినిమాల టై అప్ పెట్టుకోవడం ద్వారా వాళ్ళ అన్ని నష్టాల్నీ, అలాగే ఇతర ఆర్థిక భారాల్నీ నా మీద మోపి, నన్ను బాధ్యుణ్ణి చేయాలనేది వాళ్ళ ప్రధాన ఉద్దేశం, రహస్య అజెండా అని నాకు అర్థమైంది.
‘లోఫర్’ చిత్ర ప్రచార సమయంలో, సినిమా రిలీజ్‌కు కొద్దిగా ముందు ‘‘పూరీ జగన్నాథ్ డిస్ట్రిబ్యూటర్ల దర్శకుడు. మాకు గనక ఏదైనా నష్టమొస్తే, మా సంగతి ఆయన చూసుకుంటారు. ఆయన అలాంటి మంచిమనిషి’’ అని ముత్యాల రామ్‌దాస్ పత్రికల్లో అన్నారు. అలాగే, సుధీర్ కూడా నాతో, ‘‘పూరీ సర్! కేవలం మీ కోసమే ఈ సినిమా మేము కొన్నాం. లేదంటే, కొనేవాళ్ళమే కాదు. నైజామ్ ఏరియాకు మేము రూ. 7.5 కోట్లు చెల్లించాం’’ అన్నారు. కానీ, వాస్తవానికి నైజామ్ ఏరియాకు వాళ్ళు కేవలం రూ. 3.40 కోట్లు మాత్రమే చెల్లించారని ‘లోఫర్’ చిత్ర నిర్మాత సి. కల్యాణ్ గారు నాకు చెప్పారు.
దీన్ని బట్టి వాళ్ళు నాటకం ఆడుతున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. బ్లాక్‌మెయిల్ చేయడం, డబ్బు గుంజడం వాళ్ళకు అలవాటుగా మారింది. బయ్యర్లు అసలు లెక్కల్ని ఉన్నదాని కన్నా పెంచి చూపిస్తున్నారు. నేను నా నిర్మాత సి. కల్యాణ్ గారినీ, ఆయన నిర్ణయాలనూ గౌరవిస్తాను. నన్ను ఆ సినిమాకు తీసుకొన్నది ఆయన. ఒకవేళ గనక నాతో సినిమా తీసిన అలాంటి నిజాయతీ నిర్మాత ఎవరైనా సమస్యల్లో ఉంటే, ఆ వ్యక్తి కోసం నేను మళ్ళీ మళ్ళీ పని చేస్తాను. అంతేకానీ, ఇలాంటి అబద్ధపు వ్యక్తుల కోసం ఏదైనా ఎందుకు చేయాలి?నిజానికి, నేను కూడా చాలా సినిమాలే నిర్మించాను. నా హిట్ సినిమాలు వేటికీ బయ్యర్ల నుంచి సరైన రిటర్న్స్ నాకు రాలేదు. కానీ, నా బ్యానర్‌లో నేను నిర్మించిన ఫ్లాప్ సినిమాలన్నిటికీ నేను మాత్రం వాళ్ళకు చెల్లించాల్సిన బాకీలన్నీ కట్టేశాను.
ఈ ‘లోఫర్’ చిత్రం నా బ్యానర్‌లో నేను నిర్మించిన సినిమా కాదు. నేను కేవలం దర్శకుణ్ణి. మరి, వాళ్ళకు నేనెందుకు డబ్బులు ఇవ్వాలి? ఏదైనా ఉంటే, వాళ్ళు నా నిర్మాతతో మాట్లాడుకోవాలి. ఇక్కడ మరో విషయం చెప్పాలి. ‘లోఫర్’ చిత్ర నిర్మాత సి. కల్యాణ్ నాకు ఒక నిర్ణీత మొత్తం ఇస్తానన్నారు. కానీ, నేను మాత్రం ‘‘వరుణ్‌తేజ్ వర్ధమాన హీరో కాబట్టి, ఈ ప్రాజెక్ట్ మీద భారం మోపాలని నేను అనుకోవడం లేదు’’ అని నిర్మాతకు చెప్పి, నా పారితోషికంలో కోటి రూపాయలు తగ్గించుకున్నా. అలా నా నిర్మాత అడగడాని కన్నా ముందే, నా పారితోషికం తగ్గించాల్సిందిగా నిర్మాతకు చెప్పినవాణ్ణి నేను. నిర్మాతలపై ఎలాంటి భారం పెట్టని అలాంటి దర్శకుణ్ణి నేను.
కానీ, ఇప్పుడు వీళ్ళు నాకు ఏ మాత్రం సంబంధం లేని, నా ప్రమేయం లేని విషయం తెచ్చి, నాకు సమస్యలు సృష్టిస్తున్నారు. సృజనాత్మకత నిండిన సాంకేతిక నిపుణులకు ఈ వ్యక్తులు ఇలా సమస్యలు సృష్టించడం సినీ పరిశ్రమకు ఆరోగ్యదాయకం కాదు. అసలు ప్రధానమైన పాయింట్ ఏమిటంటే, నా సినిమా కొనాల్సిందంటూ వాళ్ళని నేను అడగలేదు. ఇలాంటి నష్టాలకూ - హీరోలు, దర్శకులకూ ఎలాంటి సంబంధమూ లేదు.
ఇంకా చెప్పాలంటే, హిందీ చిత్రసీమలో సినిమాల వసూళ్ళ లెక్కలన్నీ పక్కాగా ఉంటాయి. ప్రతి ఒక్కరికీ ఆ గణాంకాలు తెలుసు. కానీ, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మల్టీప్లెక్స్‌లు మినహా మిగిలిన చోట్ల, సింగిల్ స్క్రీన్స్‌లో కంప్యూటరైజ్డ్ బిల్లింగ్ వ్యవస్థ కానీ, సరైన అకౌంటింగ్ వ్యవస్థలు కానీ లేనే లేవు. దీనివల్ల వాళ్ళు సరైన వసూళ్ళ వివరాలు, లెక్కలు చూపించడం లేదు. అలా వీళ్ళ నుంచి ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన సొమ్ము నష్టమవుతోంది. ప్రభుత్వం ఈ వ్యవస్థను మార్చాలి.
మొత్తం మీద కొంతమంది బయ్యర్లు చేస్తున్నది సరిగ్గా లేదు. అది ఇటు సినీ పరిశ్రమకు కానీ, అటు ప్రభుత్వానికి కానీ ఆరోగ్యదాయకం కాదు. వాళ్ళు ఇలాగే గనక బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడితే, అప్పుడు ఈ అంశంపై పోరాటానికి మిగిలిన దర్శక, హీరోలందరి నుంచి మద్దతు తీసుకోవడం మినహా నాకు మరో మార్గం లేదు. ఎందుకంటే, ఇది కేవలం ఒక్క పూరీ జగన్నాథ్ సమస్య కాదు. ప్రతి ఒక్కరి సమస్య. ఎంతోమంది జీవితాలు పణంగా ఉన్న సమస్య. సినీ పరిశ్రమ సమస్య... ప్రభుత్వానికి సమస్య. ఇప్పటికైనా దీనిపై సరైన చర్య తీసుకోవాలి! - పూరీ జగన్నాథ్ (బ్యాంకాక్ నుంచి)’’
నిర్మాతలు: శ్వేతాలాన, వరుణ్, తేజ, సి.వి. రావు, సి. కల్యాణ్
కథ - స్క్రీన్‌ప్లే - మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాథ్
రిలీజ్: 2015 డిసెంబర్ 17న
బడ్జెట్: రూ. 22 - 23 కోట్లు
జరిగిన వ్యాపారం: ముత్యాల రామ్‌దాస్ - రూ. 1.1 కోట్లకు ఈస్ట్ గోదావరి, అభిషేక్ - రూ. 7.5 కోట్లకు (5 కోట్లు ఎన్.ఆర్.ఎ, 2.5 కోట్లు రికవరబుల్ ఎడ్వాన్స్) నైజామ్, నెల్లూరు ఏరియాలు ఎన్.ఆర్.ఎ.లో కొన్నారు. మిగిలిన ఏరియాల్ని ఇతరులు రికవరబుల్‌లో కొన్నారు.
వసూలైంది: రూ. 16 - 17 కోట్లు
వచ్చిందంటున్న నష్టం: ముత్యాల రామ్‌దాస్‌కు రూ. 27 లక్షలు, అభిషేక్‌కు రూ. 2.6 కోట్లు
సిన్మా ఫెయిల్యూర్‌తో నిర్మాతకు నష్టం: రూ. 5 కోట్లట! (ఈ వ్యాపార గణాంకాలన్నీ సినీపరిశ్రమ వర్గాల అంచనా)
దర్శకుడు పూరీ జగన్నాథ్‌పై దాడి చేశారంటూ డిస్ట్రిబ్యూటర్లు కొందరిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు దాఖలైన నేపథ్యంలో కొన్నేళ్ల క్రితం కొత్తగా ఏర్పాటై, ఇంకా ఫిల్మ్ ఛాంబర్ గుర్తింపు పొందని‘తెలుగు ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ కౌన్సిల్’ పక్షాన పలువురు పంపిణీదారులు సోమవారం ఉదయం ఫిల్మ్‌చాంబర్‌లో పత్రికల వారి ముందుకు వచ్చారు. తమ వైపు వాదనను వినిపించారు.
‘‘మేమెవ్వరం పూరీ ఇంటికి వెళ్ళలేదు. దాడి జరిగిందని చెబుతున్న రోజున నేను బయటెక్కడో ఉన్నా. మిగిలిన ఇద్దరిలో సుధీర్ ముంబయ్‌లో ఉంటే, మరొకరు ఆడియో ఫంక్షన్ వేదికపై ఉన్నారు. ఇది పూర్తిగా తప్పుడు కేసు. ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అయిన నేనెలా దాడి చేయగలను?’’ - ముత్యాల రామ్‌దాస్, ‘లోఫర్’ చిత్ర డిస్ట్రిబ్యూటర్
‘‘నిజానికి ‘లోఫర్’ సిన్మా కొనడానికి నేను వెళ్ళలేదు. నిర్మాత సి. కల్యాణ్ పిలిచి, ‘నేనూ హామీ’ అని అంటే, కొన్నా. తీరా, కొని రిలీజ్ చేశాక సిన్మాకు బాగా నష్టం రావడంతో నష్టం భర్తీ కోసం మా డిస్ట్రిబ్యూటర్ల కౌన్సిల్‌కు లెటర్ పెట్టాను. తీరా ఇప్పుడు మా పై పూరీ కేసు పెట్టినట్లు టీవీలో చూసి, కల్యాణ్‌కి ఫోన్ చేస్తే, పూరీతో మాట్లాడి, సర్దుబాటు చేస్తానన్నారు.’’ - అభిషేక్, ‘లోఫర్’ డిస్ట్రిబ్యూటర్
‘‘మాపై పూరి పెట్టినది తప్పుడు కేసు. మేము ముగ్గురం గడచిన మూడు, నాలుగు నెలలుగా మేము పూరీ మీదకు వెళ్ళినట్టు ఒక్క ఫోన్ కాల్ కానీ, ఎస్సెమ్మెస్ కానీ, వాట్సప్ మెసేజ్ కానీ, చివరకు సీసీ టీవీలో దృశ్యం కానీ ఒక్క సాక్ష్యం చూపించమనండి. కనీస విచారణైనా చేయకుండా, ఏకపక్షంగా మా మీద 6 సెక్షన్ల కింద కేసులు పెట్టారు.’’ - సుధీర్, డిస్ట్రిబ్యూటర్ అభిషేక్‌కు ఆప్తమిత్రుడు
‘‘ఒకప్పుడు 300 పైగా డిస్ట్రిబ్యూటర్లుండే నైజామ్‌లో, ఇవాళ 9 మంది డిస్ట్రిబ్యూటర్లే మిగిలారు. మా వాళ్ళపై పూరీ పెట్టినవన్నీ తప్పుడు కేసులు. సామరస్యంగా ట్రేడ్‌బాడీలో తేల్చుకోవాల్సిన విషయం రచ్చకెక్కింది.’’ - ఎన్. సుధాకరరెడ్డి, నిర్మాత, ‘తెలుగు ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ కౌన్సిల్’ ప్రెసిడెంట్
‘‘డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో గతంలో ఉన్న పారదర్శకత పోయింది. నిఖార్సైన డిస్ట్రిబ్యూటర్లు తగ్గిపోతున్నారు. ‘బతుకు - బతికించు’ పద్ధతిలో డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను అందరం కాపాడుకోవాలి. కానీ, అందుకోసం దర్శక, నిర్మాతలతో స్నేహంగానే ముందుకు సాగాలి.’’ - ప్రసన్నకుమార్, డిస్ట్రిబ్యూటర్ - తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కార్యదర్శి
సొమ్ములు పోనాయండి... ... కొంచెం తిరిగి ఇచ్చారండీ!
సినిమా వ్యాపారం చిత్రవిచిత్రమైన చిక్కుముడులతో నడిచే గమ్మత్తై వ్యవహారం. మునుపటి సినిమాల హిట్ - ఫ్లాప్ ఫలితాల మీద, లేటెస్ట్ సినిమాలోని దర్శక, హీరోల క్రేజీ కాంబినేషన్ మీద ఆధారపడి చాలా భాగం నమ్మకాన్ని బట్టి గుడ్డిగా ఆడే ‘బ్లైండ్ గేమ్’. సినీ పరిశ్రమలోని వారికే అర్థమయ్యే మినిమమ్ గ్యారెంటీ (ఎం.జి), నాన్ రికవరబుల్ అడ్వాన్స్ (ఎన్.ఆర్.ఎ), అవుట్‌రైట్ - లాంటి రకరకాల సంక్లిష్టమైన రెగ్యులర్ ట్రేడ్ విధానాలుంటాయి. ఆ పద్ధతుల్లోనే బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు సినిమా పంపిణీ హక్కుల్ని నిర్మాతల దగ్గర కొంటూ ఉంటారు. ఈ పెను జూదంలో ‘‘నూటికి 10 సిన్మాలు ఆడితే, 90 సిన్మాలు ఆడవు. అయినా, డబ్బులొచ్చిన ‘బాహుబలి’, ‘శ్రీమంతుడు’ లాంటి ఆ పది సినిమాలు చూసి, ఆశాభావంతో కొత్త సినిమాలు కొంటూ ఉంటాం’’ అని ప్రముఖ పంపిణీదారు - నిర్మాత ఎన్. సుధాకరరెడ్డే ఒప్పుకున్నారు. కొన్నేళ్ళ క్రితమే ఆరంభమై, ఇంకా ఫిల్మ్ ఛాంబర్ గుర్తింపు పొందాల్సి ఉన్న ‘తెలుగు ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ కౌన్సిల్’కు ఆయన అధ్యక్షులు.
లాభాలు వచ్చినప్పుడు పంచుకొనే మాట ఎలా ఉన్నా, నష్టాలు వచ్చినప్పుడు మాత్రం దాన్ని భర్తీ చేయడానికి నిర్మాతలు, హీరోలు, దర్శకులు తలా ఒక చెయ్యి వేయాలనే వాదన సినీ రంగంలో తరచూ వినిపిస్తూ ఉంటుంది. గతంలో హీరో పవన్‌కల్యాణ్ స్వీయ నిర్మాణ, దర్శకత్వాల్లో తీసిన ‘జానీ’ ఘోరంగా ఫ్లాపైంది. అప్పుడాయన పంపిణీదారుల్ని పిలిచి, దాదాపు రూ. 3 కోట్ల మేర మొత్తాన్ని తిరిగి ఇవ్వడం అప్పట్లో సంచలనమైంది. ఆ తరువాత తమిళనాట రజనీకాంత్ తన ఫ్లాప్ చిత్రం ‘బాబా’ విషయంలోనూ అలాంటి సహృదయతే చూపారు. ‘‘అలా ఇవ్వాలని రూలేమీ లేదు. కానీ, డిస్ట్రిబ్యూటర్ల వల్లే సినీ రంగంలో తాము, తమ సినిమాలు ఉన్నాయని గుర్తించి, మంచి మనసుతో హీరోలు ఆ పని చేశారు’’ అని డిస్ట్రిబ్యూటర్ ముత్యాల రామ్‌దాస్ వ్యాఖ్యానించారు.
‘నాన్ రికవరబుల్ అడ్వాన్స్’ పద్ధతిలో డిస్ట్రిబ్యూటర్‌కిచ్చే కమిషన్ 20 శాతమే. కానీ, ప్రస్తుతం సినిమా సినిమాకీ రిస్క్ పెరిగి, దరిమిలా నష్టమొస్తే కోలుకోలేని పరిస్థితి తలెత్తింది. దాంతో, ఈ ఎన్.ఆర్.ఎ పద్ధతిలో గనక డిస్ట్రిబ్యూటర్ డబ్బు చెల్లించి సినిమాను కొంటే, 20 శాతం మేరకే నష్టాన్ని భరిస్తాడనీ, అంతకు మించి నష్టమొస్తే దానిలో నిర్మాత కూడా భాగం పంచుకోవాలనీ కొత్తగా వచ్చిన ‘డిస్ట్రిబ్యూటర్స్ కౌన్సిల్’ ప్రతిపాదించింది. ఆ ప్రతిపాదనకు ఇంకా ఛాంబర్ కానీ, నిర్మాత, దర్శ కుల సంఘం లాంటివి కానీ అంగీకరించలేదు. అయినా, సరే ఒత్తిడి సాగుతోంది. ‘‘20 శాతానికి మించి కొద్దిగా ఎక్కువ నష్టమొచ్చినా మేమె వరినీ అడగడం లేదు. కానీ, నష్టం 50 - 60 శాతమైనప్పుడు భర్తీ చేయా ల్సిందిగా నిర్మాతను అభ్యర్థిస్తున్నాం’’ అని సుధాకరరెడ్డి వివరించారు.
నష్టం పంచుకోమంటూ ఇలా ఒత్తిడులు పెరగడంతో నష్టపోయినవారిని ఆదుకొనేందుకు బాకీ పారితోషికాన్ని గతంలో కొందరు వదులుకు న్నారు. వారిలో ‘ఆగడు’ చిత్రానికి మహేశ్‌బాబు, దర్శకుడు శ్రీను వైట్ల, ‘అఖిల్’ చిత్రానికి దర్శకుడు వి.వి. వినాయక్ ఉన్నారు. ‘సికిందర్’ చిత్రా నికి తెలుగు వెర్షన్ నిర్మాత లగడపాటి శ్రీధర్ బలవంతంతో హీరో సూర్య, దర్శకుడు లింగుస్వామి రూ. 1 కోటి వెనక్కిచ్చారు. ‘అఖిల్’ వ్యవహారంలో నిర్మాత సుధాకరరెడ్డికి రూ. 6 కోట్ల పైగా నష్టమొచ్చి ఇబ్బందుల్లో పడ్డారు. సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్లు - బయ్యర్లకు దర్శకుడు వినాయక్ రెండో రోజే ఫోన్ చేశారట. నిర్మాత తనకివ్వాల్సి బాకీ రెమ్యూనరేషన్ తాలూకు చెక్ వెనక్కిచ్చారు. అలాగే, కొంత మొత్తాన్ని డిస్ట్రిబ్యూటర్లకు పంచి, వారికి ఉపశమనం కలిగించారు. అదంతా కలిపి దాదాపు రూ. 3 కోట్లని భోగట్టా.
నిజానికి, ‘‘మమ్మల్ని ఆదుకోమని మేము అడుక్కుంటున్నాం. అలాంటి మాపై తప్పుడు కేసులు పెడితే, ఇక పోలీసు, న్యాయవ్యవస్థలే దిక్కు’’ అని డిస్ట్రిబ్యూటర్ల ఆవేదన. అయితే, పరిశ్రమలో ఒకరినొకరం ఆదుకోవడమనేది స్నేహపూర్వకంగా జరగాల్సిందే తప్ప, బ్లాక్‌మెయిలింగ్ ధోరణితో బలవంతాన చేయించుకోగలిగింది కాదనేది దర్శక, నిర్మాతల వాదన. పైగా, లాభాలొచ్చినప్పుడు లెక్కలు చూపి నిర్మాతలకివ్వకుండా, నష్టాలొచ్చినప్పుడు మాత్రం నోరు పెట్టుకొని మీద పడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం వెనక ఉన్న ఇతరేతర రాజకీయశక్తులు ఏంటి, డబుల్ గేమ్ ఆడుతున్న ఇంటి దొంగలెవరు, తప్పొప్పులు ఎవరివెంత అన్నది బేతాళప్రశ్న. ఏమైనా, తప్పుడు కారణాల రీత్యా సినీరంగం పబ్లిసిటీలోకి రావడం, ఇంటిగుట్టు రచ్చకెక్కడం విషాదమే!
- రెంటాల జయదేవ