ఎదురుచూపులన్నీ... ఈ అయిదింటి మీదే! | coming soon this five hollywood movies | Sakshi
Sakshi News home page

ఎదురుచూపులన్నీ... ఈ అయిదింటి మీదే!

Published Fri, May 15 2015 11:39 PM | Last Updated on Sun, Sep 3 2017 2:06 AM

ఎదురుచూపులన్నీ... ఈ అయిదింటి మీదే!

ఎదురుచూపులన్నీ... ఈ అయిదింటి మీదే!

డైనోసార్ విధ్వంసాలు (‘జురాసిక్ పార్క్’)... ఒళ్లు గగుర్పొడిచే సాహసాలు (‘మిషన్ ఇంపాజిబుల్’ సినిమాలో ఈథెన్ హంట్ గుర్తున్నాడుగా)... జేమ్స్ బాండ్ సినిమాల్లోని యాక్షన్ ఘట్టాలు.... రోబోల మధ్య యుద్ధం (‘టెర్మినేటర్’)... గగన వీధుల్లో మంచికి, చెడుకు మధ్య జరిగే పోరాటాలు.... హాలీవుడ్ సినిమాను తలుచుకోగానే సగటు ప్రేక్షకుల మనోఫలకాల్లో కదలాడే సన్నివేశాలు ఇవన్నీ. ఇలాంటి సినిమాలు ఎన్ని వచ్చినా ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు మళ్లీ మళ్లీ ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి సినిమాలు కొన్ని హాలీవుడ్‌లో ఈ ఏడాది వస్తున్నాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరి కళ్ళూ ఆ సినిమాల మీదే.

ఈ చిత్రాల మీద ఎన్నెన్నో ఆశలు, అంచనాలు ఉన్నాయి. వాటి గురించి ఓ సారి...! రానున్న కొద్ది నెలల్లో రానున్న అలాంటి అయిదు సినిమాల గురించి...!

 
జురాసిక్ వరల్డ్

‘జురాసిక్ పార్క్’... హాలీవుడ్ సినీ చరిత్రలో ఓ సంచలనం. స్టీవెన్ స్పీల్‌బర్గ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం తర్వాత మరో రెండు భాగాలు వచ్చాయి. వీటికి ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు. ఇప్పుడు స్పీల్‌బర్గ్ నిర్మాణ సారథ్యంలో ‘జురాసిక్ వరల్డ్’ సినిమా రానుంది.  చిత్ర కథ ప్రకారం... 22 ఏళ్ల తర్వాత జురాసిక్ వరల్డ్ థీమ్ పార్క్ ఓపెన్ చేస్తారు. శాస్త్రవేత్తల సృష్టితో తయారైన ఓ డైనోసార్ ఆ పార్క్‌లో ఎలాంటి  విధ్వంసం సృష్టించిందన్న దానికి తెరరూపం ఇచ్చారు. ఈ చిత్రం ‘జురాసిక్ పార్క్’కు సీక్వెల్ అని దర్శకుడు కొలిన్ ట్రెవెర్రో చెప్పారు. ఇందులో మరో విశేషం ఏంటంటే మన హిందీ సినీ నటుడు ఇర్ఫాన్ ఖాన్ జురాసిక్ పార్క్ సీఈవోగా కీలక పాత్రను పోషిస్తున్నారు.
 
మిషన్ ఇంపాజిబుల్-రోగ్ నేషన్
టామ్ క్రూజ్ హీరోగా  నటించిన ఈ సిరీస్‌లో ఇప్పటిదాకా వచ్చిన నాలుగు భాగాలు బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. ముఖ్యంగా నాలుగో భాగం ‘ఘోస్ట్ ప్రొటోకాల్’ కనకవర్షం కురిపించింది. త్వరలో ఐదో భాగం రాబోతోంది. ‘రోగ్ నేషన్’ టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రాన్ని  టామ్‌క్రూజ్, జె.జె. అబ్రమ్స్, బ్రియాన్ బర్క్ కలిసి నిర్మిస్తున్నారు. క్రిస్టొఫర్ మెక్‌క్వారీ దర్శకుడు. రెబెకా ఫెర్గూసన్ కథానాయికగా నటిస్తున్నారు. ఎప్పటి లాగే  ఈ చిత్రం కోసం  ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ సన్నివేశాల్లో  టామ్ క్రూజ్ నటించారు. విమానం మీద చేసిన యాక్షన్ సీక్వెన్స్ ఇప్పటికే హాట్ టాపిక్‌గా మారాయి. ఈ చిత్రం రానున్న జూలై 31న విడుదల కానుంది.
 
స్పెక్టర్

‘‘మై నేమ్ ఈజ్ బాండ్... జేమ్స్ బాండ్’’...అనగానే ప్రతినాయకులతో బాండ్ చేసే పోరాటాలు, గాళ్స్‌తో రొమాన్స్ గుర్తొస్తాయి. బాండ్ ఎవరైనా ఈ బ్రాండ్ డైలాగ్, ఆ సినిమాలకున్న బ్రాండ్ ఎప్పటికీ మారదు. అంత కొత్తగా తీస్తారు. ఇప్పటిదాకా 23 బాండ్ సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. తాజాగా 24వ సినిమా ‘స్పెక్టర్’ రానుంది. డేనియల్ క్రెగ్ కథానాయకునిగా నటిస్తున్న ఈ చిత్రంలో మోనికా బెలూసీ, లీ సీడక్స్ బాండ్ గాళ్స్‌గా నటిస్తున్నారు. శామ్ మెండెస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది నవంబర్ 6న విడుదల కానుంది.
 
టెర్మినేటర్ జెనిసిస్

హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన అద్భుతమైన చిత్రాలలో టెర్మినేటర్ ఒకటి. ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగర్ హీరోగా నటించిన ఈ చిత్రం ఇప్పటిదాకా వచ్చిన రోబో చిత్రాలకు మార్గదర్శి. ఇప్పటిదాకా నాలుగు భాగాలు విడుదలయ్యాయి. వాటిలో మూడు భాగాలకు జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించారు. ఈ ఐదో భాగానికి ‘థోర్’ చిత్ర ఫేమ్ అలెన్ టేలర్  దర్శకుడు. ఎమీలియా క్లార్క్, జై కోర్టినీ, క్రిస్టియన్ బేల్  కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం జూలై 1న విడుదల కానుంది.  
 
స్టార్ వార్స్- ద ఫోర్స్ ఎవేకెన్స్
దర్శక, రచయిత జార్జ్ లూకాస్ 1977లో అనుకుని ఉండరేమో... తన ఊహాసృష్టి ‘స్టార్ వార్స్’ పెను మార్పుకు దారితీస్తుందని! ఆయన దర్శకత్వం వహించిన ‘స్టార్ వార్స్’ ఫస్ట్‌పార్ట్ అప్పట్లో పెను సంచలనం. అది ఓ ఫ్రాంచైజ్‌గా మారిపోయింది. తర్వాత వరుసగా ఏడు వచ్చాయి. ఇప్పుడు ఎనిమిదో సినిమా కూడా రానుంది. హ్యారిసన్ ఫోర్డ్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి జె.జె. అబ్రమ్స్ దర్శకుడు. రానున్న డిసెంబర్ 18న ఈ చిత్రం రిలీజవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement