ఝాన్సీ రాణి టైలర్‌ | Costume designer for historical films | Sakshi
Sakshi News home page

ఝాన్సీ రాణి టైలర్‌

Published Tue, Jan 8 2019 12:17 AM | Last Updated on Wed, Aug 21 2019 10:25 AM

Costume designer for historical films - Sakshi

రెండు దశాబ్దాలుగా చారిత్రక చిత్రాలకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేస్తున్నారు నీతా లుల్లా! ఖుదా గవా, చాందినీ, లమ్హే, దేవ్‌దాస్, జోధా అక్బర్‌.. ఇంకా ఎన్నో సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. తన సుదీర్ఘ ప్రయాణంలో ప్రశంసలతో పాటు అవార్డులు కూడా అందుకున్నారు నీతా. 2016లో అషుతోష్‌ తీసిన ‘మొహెంజదారో’ చిత్రం తరవాత ఇప్పుడు ‘మణికర్ణిక’ చిత్రంలో ఝాన్సీరాణిగా నటిస్తున్న కంగనా రనౌత్‌కి డిజైనర్‌గా పని^ ó శారు. నీతా రూపొందించిన దుస్తులలో కంగనా ఝాన్సీరాణిలాగ ఎంతో సాహసోపేతంగా కనిపించడం ఇప్పటికే ట్రైలర్‌లలో, టీజర్‌లలో మీరు చూసే ఉంటారు. జనవరి 25న విడుదల కానున్న ఈ చిత్రానికి కంగనే డైరెక్టర్‌. 

నీతా తన టీమ్‌తో కలిసి ఝాన్సీరాణి వస్త్రాల మీద బాగా పరిశోధన చేశారు. నాలుగు మాసాల పాటు తయారు చేసిన వస్త్రాలు రాణి పాత్రకు అనుగుణంగా ఉన్నాయా లేవా అని పరీక్షించారు. ‘‘అంతకు ముందే ఈ అంశం మీద చిత్రాలు తీద్దామనుకున్న కొందరు వ్యక్తులు నన్ను కలిశారు. అందువల్ల ఈ చిత్రం తీసే నాటికి నాకు ఈ పాత్రకు తగ్గ ఆహార్యం మీద అవగాహన కలిగింది. మణికర్ణిక కోసం నా దగ్గరకు వచ్చినప్పుడు, నేను ఫ్రెష్‌ మైండ్‌తో పని ప్రారంభించాను’’ అంటారు నీతా లుల్లా. గ్రంథాలయాలు, మ్యూజియమ్‌లు గాలించి, మణికర్ణిక వస్త్రాలకు సంబంధించిన సమాచారం సేకరించారు నీతా. అంత లోతుగా పరిశీలించడం వల్ల ఝాన్సీలక్ష్మీబాయిని ఎంత శక్తిమంతంగా చూపాలో నీతాకి అర్థమైంది. ఎక్కడెక్కడివో పెయింటింగ్స్, ఇలస్ట్రేషన్స్, ఫ్యాబ్రిక్‌ శాంపుల్స్‌ కూడ పరిశీలించారు. దానితో రాజరికాన్ని ఏ విధంగా ప్రతిబింబించాలో తెలుసుకున్నారు. 

సందర్భానికో వస్త్రధారణ
‘‘యుద్ధవీరురాలికి వస్త్రాలు తయారు చేయడంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లక్ష్మీ బాయి వేసిన రకరకాల వేషాలకు సంబంధించిన వస్త్రాలను డ్రామా కంపెనీల దగ్గరకు వెళ్లి తెలుసుకున్నాను. లక్ష్మీబాయి లేదా మణికర్ణిక.. యవ్వనంలో ఉండగా ఆమెను ఒక యోధురాలిగా, పెళ్లికూతురిగా, రాణిగా, విధవరాలిగా చూపాలి. చివరగా ఆమెను ఒక విప్లవ నాయకురాలిగా చూపాలి. ప్రతి దశలోను రకరకాల రంగులను ఉపయోగించాను. తొమ్మిది గజాల ఎమరాల్డ్‌ గ్రీన్‌ చీరలో రనౌత్‌ను చూస్తుంటే పోరాటయోధురాలు ఝాన్సీలక్ష్మీబాయి కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. ఆకుపచ్చ రంగు సిరిసంపదలకు, విశాల హృదయానికి ప్రతీక’’ అంటారు నీతా.  కంగన కూడా ఆ వస్త్రాలకు దీటైన నటన కోసం శ్రమించారు. ‘‘ఈ పాత్రకు సంబంధించి రకరకాల భావాలు ప్రదర్శించడం చాలా కష్టంగా ఉందని, కాని ఆ పాత్రకు న్యాయం చేయడం కోసం శతవిధాల ప్రయత్నిస్తున్నానని కంగనా అనేవారని’’ చెబుతున్నారు నీతా. 

యుద్ధంలో అంగ్రఖా కుర్తా
రాచరికం ప్రతిబింబించేలా హ్యాండ్‌స్పన్‌ ఫ్యాబ్రిక్, ఖాదీ వస్త్రాల మీద సహజ రంగులతో డిజైన్‌ చేశారు నీతా. రాణిగా లక్ష్మీబాయి పాత్రకు రిచ్‌ రెడ్‌ కలర్, ఆరెంజ్, గ్రీన్‌ రంగులను ఉపయోగించారు. ఆమెలోని విషాదాన్ని చూపడానికి లేత రంగులను ఉపయోగించారు. యుద్ధరంగంలో ఉన్న సమయంలో రనౌత్‌ ‘అంగ్రఖా కుర్తా’ వేసుకున్నారు. మరాఠా వీరులకు సంబంధించిన బొమ్మలను, తెల్లటి వస్త్రాల మీద బంగారు, ఎరుపు రంగులలో చిత్రించారు. కవచాన్ని లెదర్‌తో రూపొందించారు. అది కూడా చేతితో చేయించారు. కాస్ట్యూమ్స్‌ కోసం నీతా ఇంత కృషి చేసిన విధంగానే నగల ఎంపికకు మరో విభాగం పెద్ద అధ్యయనమే చేసింది. మణికర్ణిక మరాఠా మహారాణి కావడంతో వివాహానికి ముందు ధరించే నగల విషయంలో ప్రత్యేకత చూపారు. ముక్కుకి నత్తు, కంఠానికి తుషీ చోకర్‌ తయారుచేశారు. వివాహం అయ్యాక ఆవిడ కుందన్స్, ముత్యాలు ధరించేలా నగలు తయారుచేశారు. పెద్ద పాపిడి బిళ్ల, చేతులకు కంకణాలు, నెక్‌లేస్‌.. ఉపయోగించారు. వీటన్నిటినీ త్వరలోనే మనం తెర మీద కళ్లారా చూడొచ్చు.
– జయంతి

ఇంతలా ఎప్పుడూ శ్రమించలేదు
నేను 12 వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాను. నాకు చరిత్ర గురించి అస్సలు తెలియదు. సంప్రదాయ చదువుల పట్ల నాకు ఆసక్తి లేదు. ఇప్పటికి 100 కు పైగా చిత్రాలకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేశాను. నిరంతరం ఏదో ఒకటి కొత్తగా చే యడం మీద నాకు ఆసక్తి ఎక్కువ. మణికర్ణికలో నేను రనౌత్‌కి చేసిన కాస్ట్యూమ్స్‌కి ఎప్పుడూ లేనంతగా శ్రమించాన. ఆమె శిరస్సు కోసం చేసిన అలంకారాలు, రనౌత్‌కు కొత్త అందాలు తీసుకువచ్చాయి. ఆవిడ జీవితంలో ఆ మేకప్‌ ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుంది. 
– నీతా లుల్లా 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement