పైరసీపై జక్కన్న ఏమన్నారు?
ఇప్పటివరకు థియేటర్లలో కెమెరాలు పెట్టి షూట్ చేయడం ద్వారా సినిమాలు పైరసీ చేయడం తెలుసు గానీ, ఏకంగా సెర్వర్ లోంచే మాస్టర్ ప్రింట్‌ను కాపీ చేసేసుకుని దాన్ని ఆన్‌లైన్‌లో పెడతామంటూ బెదిరించడాన్ని తొలిసారి చూశామని బాహుబలి దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అన్నారు. తమ దగ్గర మొత్తం సినిమా ఒరిజినల్ ప్రింట్ ఉందని, కావాలంటే చూసుకొమ్మని చిన్న క్లిప్పింగ్ పంపించినట్లు ఆయన తెలిపారు. దాంతో అసలు ఏం చేయాలో కూడా తనకు అర్థం కాలేదన్నారు. పైరసీ గ్యాంగును పోలీసులు పట్టుకుని అరెస్టు చేయడంతో ఊపిరి పీల్చుకున్న రాజమౌళి.. ఈ విషయమై మీడియాతో మాట్లాడారు.
అయితే ఈసారి లక్కీగా పోలీసులు చాలా యాక్టివ్‌గా స్పందించారని, దాంతో సినిమా పైరసీ కాకుండా అడ్డుకోగలిగారని చెప్పారు. ప్రధానంగా సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి, ఏసీపీ రఘువీర్ లాంటివాళ్లు చాలా పర్సనల్ ఇంట్రస్ట్ తీసుకుని మరీ ఈ కేసును ఛేదించారని జక్కన్న అన్నారు. ఇంత కష్టపడి సినిమా తీసిన తర్వాత అది పైరసీ బారిన పడటం, వాటిని అడ్డుకోడానికి ఇంతమంది ఇన్నిరకాలుగా కష్టపడాల్సి రావడం దారుణమని ఆయన చెప్పారు.