కంటెంట్ నమ్మిన కొరియర్... | 'Courier Boy Kalyan' Review | Sakshi
Sakshi News home page

కంటెంట్ నమ్మిన కొరియర్...

Published Sat, Sep 19 2015 4:17 AM | Last Updated on Sun, Sep 3 2017 9:35 AM

కంటెంట్ నమ్మిన కొరియర్...

కంటెంట్ నమ్మిన కొరియర్...

 ఇవాళ ఆధునిక ప్రపంచంలో రకరకాల వైద్య పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ, అలాంటి పరిశోధనల్లో కొన్నింటి కోసం జనం నమ్మకాన్ని వమ్ము చేసి ద్రోహానికి పాల్పడితే? అలాంటి అక్రమం అనుకోకుండా బయటపడితే? ఒక సామాన్యుడు తన డ్యూటీ తాను సక్రమంగా చేసే క్రమంలో సమాజానికి తోడ్పడే కథానాయకుడిగా పరిణమిస్తే? ఈ సింపుల్ పాయింట్‌ను జెట్ స్పీడ్‌లో కాకుండా... కొరియర్ స్పీడ్‌లో చెప్పిన ప్రయత్నం - ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’.
 
 హీరో నితిన్ ఒక కొత్తరకం కథను ట్రై చేశాడు. అందుకు కారణం ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన క్రియేటివ్ డెరైక్టర్ గౌతమ్ మీనన్ కావచ్చు. రకరకాల కారణాల వల్ల ప్రొడక్షన్‌లో జాప్యం జరిగి రెండున్నర ఏళ్ల కాలం తీసుకున్న ఈ సినిమా వినాయక చవితికి విడుదలయ్యింది.
 
 కొరియర్ చుట్టూ తిరిగే కథ
 కల్యాణ్ (నితిన్) ఒక మామూలు మధ్యతరగతి కుర్రాడు. చిన్నప్పటి నుంచి అక్క (సురేఖావాణి) చాటున పెరుగుతాడు. కొరియర్ సర్వీస్ ఆఫీసులో పనిచేసే స్నేహితుడు (‘సత్యం’ రాజేష్) హీరోకు తోడు. స్నేహితుడి బదులు అనుకోకుండా కొరియర్ ఇవ్వడానికి వెళ్ళి, ఖాదీ భండార్‌లో పనిచేసే సూపర్‌వైజర్ గర్ల్ కావ్య (యామీ గౌతమ్)ను చూస్తాడు. చూడగానే ప్రేమలో పడతాడు. ఆమెకు వారానికి రెండో మూడో కొరియర్లు రాకపోతాయా, వాటిని ఇచ్చే మిషతో ఆమెకు దగ్గర కాకపోతానా అనే ఆలోచనతో అంతకు ముందు వద్దనుకున్న కొరియర్ బాయ్ ఉద్యోగంలో చేరతాడు. సినిమాకు మెయిన్ పాయింట్ మాత్రం మరోచోట ఉంటుంది. ఎక్కడో బుకారెస్ట్‌లో పరిశోధనలు చేస్తుంటాడు ఒక డాక్టర్ (అశుతోష్ రాణా).
 
 చూపు పోయిందనుకున్న వాళ్ళకు కూడా తన పరిశోధన ద్వారా చూపు తెప్పిస్తాడు. అయితే, ఆ పరిశోధన క్రమంలో అతని హాస్పిటల్‌లో గర్భవతులకు అర్ధంతరంగా అబార్షన్లు అవుతుంటాయి. ఆ అబార్షన్లకూ, ఈ పరిశోధనకూ చిత్రమైన సంబంధం ఉంటుంది. కోట్ల డాలర్లు సంపాదిస్తున్న ఆ డాక్టర్ అక్కడ పోలీసులు, దర్యాప్తుల గోల నుంచి తప్పించుకొనేందుకు మకాం ఇండియాకు మార్చేస్తాడు. హైదరాబాద్ కేంద్రంగా కార్పొరేట్ హాస్పిటల్ నడుపుతూ, తన పరిశోధన కోసం అబార్షన్ల రాకెట్‌ను గుడివాడ లాంటి చిన్న ఊళ్ళతో సహా తెలుగు నేల అంతటా విస్తరింపజేస్తాడు. ఆ అబార్షన్ల వెనుక ఉన్న రహస్యం ఏమిటన్నది గుడివాడ హాస్పిటల్‌లోని వార్డ్‌బాయ్ మాణిక్యం (‘అమృతం’ సీరియల్ ఫేమ్ వాసు ఇంటూరి)కి అనుకోకుండా తెలుస్తుంది.
 
 దాంతో ఆ వార్డ్‌బాయ్ ఈ వ్యవహారాన్ని రాష్ట్రంలో అవినీతి, అక్రమాలపై నిస్వార్థంగా పోరాడే హైదరాబాద్‌లోని సోషల్‌వర్కర్ సత్యమూర్తి (నాజర్)కి చేరవేయడానికి ప్రయత్నిస్తాడు. మందు చీటీల ప్రిస్క్రిప్షన్లు, గర్భవతులకు డాక్టర్లిస్తున్న అనుమానాస్పద ట్యాబ్లెట్ల సీసా కొరియర్ చేస్తాడు. హైదరాబాద్‌కు వెళ్ళిన ఆ కొరియర్ సంగతి విలన్ డాక్టర్ల బృందానికి తెలుస్తుంది. ఆ కొరియర్ డెలివరీ అనుకోకుండా మన కథానాయకుడు కల్యాణ్ పని కింద పడుతుంది. ఆ కొరియర్ గమ్యానికి చేరకూడదనీ, చేరినా వ్యవహారం సత్యమూర్తి ద్వారా మీడియాకు పొక్కకూడదనీ విలన్లు తంటాలు పడుతుంటారు. ఆ కథ తెలియని మన కొరియర్ బాయ్ కళ్యాణ్‌కు అసలు సంగతి ఎలా తెలిసింది? తెలిశాక ఏం చేశాడు? ఏమైందన్నది మిగతా సినిమా. గర్భస్రావాలకు లింక్ అయిన ఆ పరిశోధన ఏమిటన్న పాయింట్ తెరపై చూడాల్సిన సస్పెన్స్ పాయింట్.
 
 డ్యాన్స్... కెమేరా... యాక్షన్...
 హీరో ఇమేజ్ ఉన్న నితిన్ ఈ కామన్‌మ్యాన్ క్యారెక్టర్‌లో ఇమిడిపోవడానికి బాగానే ప్రయత్నించారు. కొన్ని సీన్స్‌లో అతని నటన, ముఖ్యంగా పాటల్లో వేసిన స్టెప్పుల కోసం అతను పడిన శ్రమ బాగుంది. ఖాదీ దుస్తుల సేల్స్‌గర్ల్‌గా యామీ గౌతమ్ పెద్దగా చేయడానికి ఏమీ లేదు. హర్షవర్ధన్, సురేఖావాణి పాత్రల పరిధి మేరకు నటించారు. ఇక, ‘సత్యం’ రాజేశ్‌తో పాటు సప్తగిరి, ‘గుండు’ సుదర్శన్, దువ్వాసి మోహన్, జెన్నీ లాంటి సుపరిచిత నటులు ఉన్న ఒకటి, రెండు సీన్స్‌లోనే కాసేపు వినోదం అందిస్తారు. యాక్షన్ సీన్లు, సెకండాఫ్ బైక్ ఛేజ్ సీన్ టెంపోతో నడుస్తుంది. కెమేరా వర్క్ కూడా బాగుంది. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో కొన్ని షాట్లు, సీన్‌లో తానూ భాగమే అన్నట్లుగా కెమేరాతో పాటు ప్రేక్షకుల కళ్ళు ప్రయాణిస్తాయి.
 
 దర్శకుడు గౌతమ్ మీనన్ ఈ సినిమాకు కేవలం సమర్పకుడు, నిర్మాతే. కానీ, పబ్లిసిటీ చూసి ఆయన తరహా లవ్‌స్టోరీనో, యాక్షనో ఆశిస్తే చిక్కే! తమిళ టీవీ నటుడు ప్రేమ్‌సాయికి దర్శకుడిగా ఇదే తొలి సినిమా. రెండు భాషల్లో వేర్వేరు హీరోతో చేసిన ఈ ద్విభాషా చిత్రంలో తమిళ వాసన కనిపించకపోవడం చెప్పుకోదగ్గ విశేషం. కథకు కీలకమైన పాయింట్ ఏమిటనేది - టైటిల్స్ పడుతున్నప్పటి నుంచి సినిమా ఫస్టాఫ్ అంతటా ఒకటికి రెండు సంఘటనల ద్వారా చెబుతూ వచ్చారు. దాంతో, ఆ పాయింట్‌ను ఇంటర్వెల్ ముందు బయటపెట్టే సరికల్లా ప్రేక్షకుడు కూడా మానసికంగా ఒక క్లారిటీతో ఉంటాడు. సరైన టైమ్ చూసుకొని ఇంటర్వెల్ పడుతుంది. ఆ క్రమంలో ఆ కీలకమైన విషయం ఎలా బయటకొచ్చింది, అందుకోసం హీరో ఎలా పోరాడాడన్నవే సెకండాఫ్ ముప్పావు గంట! అయితే, క్లైమాక్స్‌కు వచ్చేసరికి కథ చాలా సింపుల్‌గా, అర్ధంతరంగా ముగించారేమోనన్న భావన కలిగే అవకాశం ఉంది. హీరో పాత ప్రొఫెషన్ తాలూకు నైపుణ్యాన్ని ఆఖరు క్షణంలో వాడటం బాగుంది.
 
 అక్క సెంటిమెంట్ అదనం
 చాలా చిన్న పాయింట్‌తో వచ్చిన ఈ చిన్న సినిమా నిడివి పరంగా కూడా చిన్నదే. నిజానికి ఈ కథకు బలమైన సెంటిమెంటల్ కోణం- హీరో అక్కాబావలకు కూడా పన్నెండేళ్ళుగా పిల్లలు పుట్టకపోవడం. రాక రాక గర్భం దాల్చిన హీరో అక్కకు కూడా విలన్ డాక్టర్ గర్భస్రావమయ్యే ఆ ట్యాబ్లెట్ల సీసా ఇవ్వడం! డాక్టరిచ్చిన ఆ మందు వేసుకోమని హీరోయే తన అక్క చేతికి ఇవ్వడం! ఈ సెంటిమెంటల్ ట్రాక్‌ను దర్శక-రచయిత ఎందుకనో పెద్దగా వాడుకోలేదు. దాన్ని కొంత పొడిగిస్తే, సినిమాకు లెంగ్త్‌తో పాటు లేడీస్ సెంటిమెంట్ కూడా బాగానే కలిసొచ్చేది. కాసేపు కాలక్షేపం కోసం వెళితే మాత్రం ఈ ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ ఆశాభంగం చేయడు. ఇవాళ ఆ మాత్రం కరుణ చూపినా, ప్రేక్షకులు పరమానందభరితులై సినిమా చూసేస్తున్నారు కాబట్టి, ఈ సినిమాకే కాదు... పరిశ్రమ పచ్చగా కళకళలాడడానికీ అది ఉపయోగమే!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement