మనోజ్ అసలైన సినీ యాత్ర ఇప్పుడే మొదలైంది :దాసరి నారాయణరావు
‘‘మనోజ్ పదేళ్ల ప్రయాణం తర్వాత వస్తున్న సినిమా ఇది. సినీరంగంలో పదేళ్ల తర్వాతే కెరీర్ అనేది మొదలవుతుంది. అంటే... మనోజ్ అసలైన సినీ యాత్ర ఇప్పుడే మొదలైందన్నమాట. ‘కరెంట్‌తీగ’ కథ నాకు తెలుసు. నాగేశ్వరరెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు అనగానే.. సినిమా హిట్ అని చెప్పేశాను. నా సొంత సినిమాల విషయంలో నా జడ్జిమెంట్ తప్పిందేమో కానీ... ఇతరుల సినిమాల విషయంలో నా జడ్జిమెంట్ ఎప్పుడూ తప్పలేదు. ఎందుకంటే.. నాగేశ్వరరెడ్డి ప్రతిభావంతుడైన దర్శకుడు. సక్సెస్ ఫార్ములా అతనికి బాగా తెలుసు’’ అని డా. దాసరి నారాయణరావు అన్నారు. డా. మోహన్‌బాబు సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మనోజ్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా మంచు విష్ణు నిర్మించిన చిత్రం ‘కరెంటు తీగ’. జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అచ్చు పాటలు స్వరపరిచారు. ఆడియో సీడీని దాసరి ఆవిష్కరించారు.
ఈ వేడుకలో దాసరి ఇంకా మాట్లాడుతూ- ‘‘ఎలాంటి ఫీట్ అయినా... డూప్ లేకుండా చేయడానికి మనోజ్ ఇష్టపడతాడు. అలా చేస్తానని ఏ హీరో అన్నా.... పక్కవాళ్లు కూడా ప్రోత్సహిస్తారు. కానీ... అది ఎంతవరకు సబబు. మీరు డూప్ లేకుండా చేసినా, చూసే జనాలు మాత్రం డూపే అంటారు కదా. ఇంకేంటి ప్రయోజనం? నా చిన్నతనంలో యడ్లబండ్ల మీద ప్రయాణించేవాళ్లం. అందుకని ఇప్పుడు కూడా యడ్లబండ్లపైనే ప్రయాణిస్తామంటే ఎలా? మా రోజుల్లో ఇన్ని సాంకేతిక విలువలు లేవు. కానీ... మీకు ఎన్నో సౌకర్యాలుండగా వాటిని ఉపయోగించుకోకుండా... డూప్ లేకుండా చేసేస్తాం అంటే ఎలా? మీపై మీ కుటుంబం ఆధారపడి ఉంటుంది. పైగా హీరో అనేవాడు పబ్లిక్ ప్రాపర్టీ. ఈ విషయాన్ని మనోజ్‌తో పాటు ప్రతి హీరో గుర్తుంచుకోవాలి’’ అన్నారు.
మోహన్‌బాబు - ‘‘నటుడిగా పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇప్పటివరకు తనతో సినిమాలు తీసిన దర్శక, నిర్మాతలను గౌరవించాలని మనోజ్ అనుకోవడం అభినందనీయం. ‘నిన్ను అందరూ మంచి నటుడు అంటుంటే చాలా ఆనందంగా ఉంది. అయితే, రిస్కీ ఫైట్స్ చేయడం మాత్రం నాకూ, మీ అమ్మకూ చాలా బాధగా ఉంది. అంత రిస్క్ చేయకూడదు’ (మనోజ్‌ని ఉద్దేశించి). మనోజ్ పుట్టినప్పుడు మా గురువుగారు దాసరి నారాయణరావు ఎత్తుకున్నారు. మరి.. ఆ సమయంలో ఏమనుకున్నారో కానీ.. ఆయన లక్షణాలన్నీ వచ్చాయి. నటిస్తున్నాడు.. పాటలు రాస్తున్నాడు.. ఫైట్స్ సమకూరుస్తున్నాడు.. ఇలా మనోజ్ అన్నీ చేస్తున్నాడు. నాగేశ్వరరెడ్డి అద్భుతమైన దర్శకుడు.
అప్పట్లో నా ‘అసెంబ్లీ రౌడీ’ సంచలన విజయం సాధిస్తుందన్నాను. ఈరోజు ‘కరెంటు తీగ’కు కూడా అలానే అంటున్నాను’’ అన్నారు. విష్ణు మాట్లాడుతూ - ‘‘ఈ చిత్రంలోని ‘పిల్లా...’ పాట రెండేళ్ల క్రితం తయారైంది. నాకలాంటి మెలోడీ సాంగ్స్ అంటే ఇష్టం. అందుకని, నా సినిమాలో ఉపయోగించుకోవాలనుకున్నాను. కానీ, మనోజ్ సినిమాకే కుదిరింది. మిగతా పాటలన్నీ కూడా బాగుంటాయి. ఈ చిత్ర సంగీతదర్శకుడు అచ్చు పెళ్లి ఈరోజే. అందుకే తను ఈ వేడుకకు రాలేదు’’ అని చెప్పారు. మనోజ్ మాట్లాడుతూ- ‘‘బేసిక్‌గా నాకు చదువు వచ్చేది కాదు. కుదరుగా వుండేవాణ్ణి కాదు. చిన్నప్పుడు బుద్ధి కూడా ఉండేది కాదు. నా చిన్నప్పుడు దాసరి అంకుల్ తనతో పాటు రీ-రికార్డింగ్ థియేటర్‌కు, షూటింగ్స్‌కు తీసుకెళ్లేవారు.
అందుకేనేమో సినిమా మీద నాకు ఇష్టం ఏర్పడింది. నన్ను ప్రోత్సహించిన మా అమ్మా, నాన్న, అన్నయ్య అక్కకు ధన్యవాదాలు’’ అని చెప్పారు. ‘‘మోహన్‌బాబుగారు నన్ను కోప్పడినా ఫర్వాలేదు.. ఆయనకన్నా మనోజ్ గొప్ప నటుడు. జగపతిబాబుతో సినిమా చేయాలనే నా బలమైన కోరిక ఈ చిత్రంతో తీరింది’’ అని నాగేశ్వరరెడ్డి తెలిపారు.
ఈ వేడుకలో యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, టి. సుబ్బిరామిరెడ్డి, సి. నరసింహారావు, చుక్కపల్లి సురేష్, పరుచూరి గోపాలకృష్ణ, రామ్‌గోపాల్ వర్మ తదితర అతిథులు శుభాకాంక్షలందజేశారు. జగపతిబాబు, విష్ణు, సుప్రీత్ తదితర చిత్రబృందంతో పాటు మనోజ్‌తో సినిమాలు చేసిన దర్శక, నిర్మాతలు దశరథ్, వీరు పోట్ల, అనిల్, ఎన్వీ ప్రసాద్, అనిల్ సుంకర, డీయస్ రావు తదితరులు పాల్గొన్నారు. మనోజ్ పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హీరోలు రామ్‌చరణ్, అల్లరి నరేశ్, నాని, వరుణ్ సందేశ్, నిఖిల్.. అందించిన శుభాకాంక్షల వీడియో క్లిప్పింగ్‌ని ప్రదర్శించారు.