నిర్వేదానికి లోనయ్యా..
‘‘మనిషికి రెండు కళ్లు ఎంత ముఖ్యమో... తెలుగువారికి మన రెండు రాష్ట్రాలూ అంత ముఖ్యం. వీటిలో దేనికి ఇబ్బందులెదురైనా... అది తెలుగువారందరికీ బాధాకరమే. ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్ సహిత ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు తుఫాన్ బీభత్సానికి గురవ్వడం నా మనసును కలచివేసింది. ఈ ప్రళయం గురించి విని ఒక విధమైన నిర్వేదానికి లోనయ్యాను. తెలుగువారు ఇబ్బందుల్లో ఉన్న ఈ తరుణంలో మా ‘కరెంట్ తీగ’ చిత్రాన్ని విడుదల చేయడం సబబు కాదు. అందుకే, ఈ నెల 17న విడుదల కావాల్సిన ఆ చిత్రం విడుదలను వాయిదా వేస్తున్నాం’’ అని మోహన్‌బాబు తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లో పత్రికలవారితో మోహన్‌బాబు మాట్లాడుతూ -‘‘తుఫాన్ బీభత్సానికి గురైన ప్రాంతాలకు నా బిడ్డలతో కలిసి వెళ్లాలనుకుంటున్నాను.
మాతో పాటు కలిసి సహాయం అందించాలని ఎవరైనా ముందుకొస్తే ఇంకా ఆనందిస్తా. నేనెప్పడూ స్వయంగానే వెళ్లి సహాయం అందిస్తాను. రాజీవ్‌గాంధీ చెప్పిన ఓ మాటే దానికి కారణం. ‘ప్రభుత్వం సొమ్ము 80 శాతం కూడా ప్రజలకు చేరదు. దోచుకునేవాళ్లు దోచుకోగా 20 శాతమే వెళుతుంది’ అని. అందుకే... ఆ అవకాశం ఎవరికీ ఇవ్వకుండా, నేనే స్వయంగా వెళ్లి సహాయం అందిస్తా. వంద మందిని నేను కాపాడలేకపోవచ్చు. కానీ నేనొక్కణ్ణి ఒక్క వ్యక్తినైనా కాపాడలేనా అనేది నా నమ్మకం’’ అన్నారు. ‘కరెంట్ తీగ’ సినిమా గురించి మాట్లాడుతూ -‘‘నేనిప్పుడు అయ్యప్ప మాలలో ఉన్నాను. చెడు మాట్లాడకూడదు. చెడు ఆలోచనలు చేయకూడదు. నిజమే చెప్పాలి. మనోజ్‌కి ఈ సినిమా పెద్ద బ్రేక్ అవుతుందంటే అహంకారం అవుతుంది. అందుకే... బ్రేక్ అవుతుందని నమ్ముతాను అని చెబుతున్నా. ఇంతకు ముందు మనోజ్ సినిమాలు ఓ ఎత్తు. ఇదొక ఎత్తు’’ అని మోహన్‌బాబు నమ్మకంగా చెప్పారు.