మొండి ధైర్యం వల్లే... అన్నీ సాధించా! | mohanbabu special interview for birthday special | Sakshi
Sakshi News home page

మొండి ధైర్యం వల్లే... అన్నీ సాధించా!

Published Fri, Mar 18 2016 10:49 PM | Last Updated on Sun, Sep 3 2017 8:04 PM

మొండి ధైర్యం వల్లే... అన్నీ సాధించా!

మొండి ధైర్యం వల్లే... అన్నీ సాధించా!

మోహన్‌బాబు రూటే సెపరేటు...అసిస్టెంట్ డెరైక్టర్‌గా ఓ చినుకులా మొదలైంది ఆయన సినిమా జర్నీ.  ఇప్పుడు మోహన్‌బాబు ఓ మహా సముద్రం! ఈ సముద్రంలోని ప్రతి కెరటమూ ఓ కథ చెబుతుంది. మోహన్‌బాబు జీవితంలోని మలుపులూ మెరుపులూ ఎప్పుడూ ఆసక్తికరమే. ఇవాళ ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా సంభాషిస్తూ, ఎన్నో విషయాలు పంచుకున్నారు.

పుట్టినరోజు సందర్భంగా జీవితాన్ని విశ్లేషించుకుంటే... దేవుడు ఇచ్చిన ఈ జన్మను సార్థకం చేసుకున్నాననే అనుకుంటున్నారా?
అన్ని జన్మలోకెల్లా మానవ జన్మ గొప్పది. ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, తల్లితండ్రుల నుంచి క్రమశిక్షణ నేర్చుకున్నాను. నటుడు అయ్యేంతవరకు ‘మన జన్మకు సార్థకత ఏంటి?’ అని ఎప్పుడూ ఆలోచించలేదు. అయ్యాక కూడా పదేళ్లు ఏమీ అనుకోలేదు. ఆ తర్వాత మాత్రం సమాజానికి ఏదో చేయాలనే ఆలోచన కలిగింది. ఆ ఆలోచన వైపుగా అడుగులు వేశా... వేస్తూనే ఉన్నా. ఆ అడుగులే నా జన్మకు ఓ సార్థకత తెచ్చాయి.

ఇప్పటికిప్పుడు ఆ దేవుడు మీ ముందు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటే మీరేం కోరతారు?
‘భగవంతుడా! కలలో కూడా ఊహించని మంచి జీవితాన్ని ఇచ్చావ్. కష్టాన్నే నమ్ముకున్నాను. దానికి ప్రతిఫలం ఇచ్చావ్’ అని ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఆ తర్వాత దేశంలో పెరిగిపోయిన పేదరికాన్ని నిర్మూలించమని కోరుకుంటాను. ‘సమాజంలో అక్రమాలు పెరిగిపోతున్నాయ్. వాటిని రూపుమాపు తండ్రీ! పేదలను పేదలుగానే మిగిల్చేయకు.. మా అందరికీ ఓ మంచి దారి చూపించినట్లే వాళ్లకీ ఓ దారి చూపించు’ అని కోరుకుంటాను.

జీవితంలో ఎక్కువ కష్టపడ్డాననే ఫీలింగ్ మీకెప్పుడైనా కలిగిందా?
ఈ మధ్య అనిపిస్తోంది. అది కూడా ఏదైనా నొప్పి కారణంగా డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సి వచ్చినప్పుడు! ‘మీ శరీరాన్ని ఎక్కువ కష్టపెట్టారు. శక్తికి మించి కష్టపడ్డారు’ అని డాక్టర్ అన్నప్పుడు ‘అవును కదా..’ అనిపిస్తుంది. ఇరవయ్యేళ్ల ముందు ఒకసారి కెమేరామ్యాన్ విన్సెంట్ గారు షూటింగ్ లొకేషన్‌లో ‘మీరు ఎక్కువ కష్టపడుతున్నారు. రోజులు గడిచే కొద్దీ ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకని కష్టపడటం కొంచెం తగ్గించండి’ అన్నారు. అది నిజమనిపిస్తోంది. అవయవాలన్నీ పని చేస్తున్నాయ్... ఆరోగ్యం బాగానే ఉంది. కానీ, శరీరం కష్టపడిన విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది.

మీ ముగ్గురు పిల్లలు (లక్ష్మీప్రసన్న, విష్ణు, మనోజ్) తెలినవైనవాళ్లే. ఈ ఫీల్డ్‌కే పరిమితం కాకుండా వేరే ఏదైనా ఫీల్డ్‌కి వెళ్లి ఉంటే, ఆ తెలివితేటలకు తగిన న్యాయం జరిగి ఉండేదనే ఫీలింగ్ ఏమైనా ఉందా?
మనోజ్ మాత్రమే సినిమాల్లోకి రావాలని కోరుకున్నాను. విష్ణుని ఐపీఎస్ ఆఫీసర్‌గా చూడాలనుకున్నా. ఇంజినీరింగ్ కాలేజీలో స్టేజి మీద విష్ణు పర్ఫార్మెన్స్ చూసి, తనలో ఇంత మంచి నటుడు ఉన్నాడా? అనుకున్నా. విష్ణు కోరుకున్నట్లు గానే నటుణ్ణి చేశాను. సినిమాలకు పరిమితం కాకుండా ప్రీ-స్కూల్స్ నడుపుతున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతానికి 50 వరకూ స్కూల్స్ ఉన్నాయి. విద్యారంగంలో బాగా రాణిస్తున్నాడు. సినిమాలు తప్ప వేరే వ్యాపారం చేయనని మనోజ్ అన్నాడు. లక్ష్మికి ఒక స్కూల్ నిర్వహణ బాధ్యత ఇచ్చాం. అది చూసుకుంటూ సినిమాలు చేస్తోంది. ‘ఐయామ్ వెరీ హ్యాపీ’.

భార్య, ఇద్దరు కొడుకులు, కూతురు, కోడళ్లు, అల్లుడు, మనవరాళ్లతో సంపూర్ణ జీవితం మీది. వృత్తిపరంగా మీరు సాధించిన సక్సెస్‌ని ఎక్కువ ఇష్టపడతారా? వ్యక్తిగత జీవితాన్నా?
నేను కష్టపడి పైకొచ్చా. నా కష్టమే నాకిష్టం. కష్టపడి పైకొచ్చాను కాబట్టే భార్యా బిడ్డలను పోషించగలిగాను. పిల్లలను బాగా పెంచగలిగాను. నేను కష్టపడినదానికి నా పిల్లలు నా మాట వినకుండా ఎలా పడితే అలా ఉండి ఉంటే... ‘అయ్యో పిల్లలు అప్రయోజకులయ్యారే’ అని బాధపడేవాణ్ణి. నా పిల్లలు మంచి దారిలో ఉండటం వల్ల నా కష్టానికి ఒక అర్థం ఉంది. పదిమందీ మెచ్చుకునే పిల్లల్ని ఆ భగవంతుడు ఇచ్చాడు కాబట్టి, గర్వంగా ఉంది.

ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, ‘ఇలా చేసి ఉండాల్సింది కాదేమో..’ అని ఏదైనా విషయంలో మీకు అనిపిస్తూ ఉంటుందా?
కొన్ని విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఒక విషయంలో ‘అలా చేసి ఉండాల్సింది కాదేమో’ అనే ఆవేదన ఒకటుంది. అది పూర్తిగా నా వ్యక్తిగత విషయం. బయటికి చెప్పను.

మరి.. ‘ఇలా చేసి ఉంటే బాగుండి ఉండేదేమో’ అనుకునే విషయం ఏదైనా ఉందా?
నేను తీసిన సినిమా ఫెయిలైనప్పుడు ‘ఇలా కాకుండా వేరేలా తీసి ఉంటే బాగుండేదేమో’ అనే ఫీల్ కలుగుతుంది. ఆ సినిమాల గురించి ఎప్పుడు తల్చుకున్నా ఇదే ఫీలింగ్.

ఫెయిల్యూర్ అంటే గుర్తొస్తోంది.. మీరు ఆర్థికంగా బాగా డౌన్‌లో ఉన్నప్పుడు ‘అల్లుడుగారు’ సినిమా నిర్మించారట.. అది అటూ ఇటూ అయితే, అంతే సంగతులట. ఏమిటా మొండి ధైర్యం?
ధైర్యం అన్నది నాకు ఊహ తెలిసినప్పటి నుంచే ఉంది. భయం ఎప్పుడూ లేదు. నా మొండి ధైర్యం వల్లే నేను అన్నీ సాధించాననుకుంటున్నాను. కానీ, మొండి ధైర్యం అనేది అందరికీ కలిసి రాదు.

అప్పట్లో మీరు ప్రతినాయకుడిగా చేస్తున్నప్పుడు ఓ ప్రముఖ దర్శకుడు మిమ్మల్ని హీరోగా పెట్టి సినిమా తీయనన్నారట?
అది అసత్యం. అలాంటిది ఎప్పుడూ జరగలేదు. నాతో సినిమాలు తీయడానికే ఇష్టడ్డారు. నేను డేట్స్ ఇస్తే చాలనుకున్న సందర్భాలూ ఉన్నాయి. ‘పెదరాయుడు’ టైమ్‌లో నాతో సినిమా చేయడానికి రామారావుగారు, నాగేశ్వరరావుగార్లతో సినిమాలు తీసిన నిర్మాతలు ముందుకొచ్చారు. ఇది జగమెరిగిన సత్యం.

మీతో పాటు కెరీర్ ఆరంభించిన రజనీకాంత్, చిరంజీవి, ఆ తర్వాతి తరం పవన్ కల్యాణ్‌లతో కలిసి సినిమా చేసే అవకాశం వస్తే...
ఈ కాంబినేషన్ అనేది జరగని పని. జరిగితే నాకభ్యంతరం లేదు.

ఈ మధ్య మీరు చేసిన ‘మామ మంచు-అల్లుడు కంచు’ మీ స్థాయికి తగ్గ సినిమా కాదేమో అనిపించింది?
ఆ సినిమా రిలీజ్ అయ్యాక నాకూ అలానే అనిపించింది. నాకంత సంతృప్తినివ్వలేదు.

సినిమాలపరంగా మీ ప్లాన్స్ ఏంటి?
విష్ణుతో ‘భక్త కన్నప్ప’కి, మనోజ్‌తో ఓ సినిమాకి ప్లాన్స్ జరుగుతున్నాయి. వీటికి లక్ష్మీప్రసన్న నిర్మాత. పూర్తి వివరాలు మరో సందర్భంలో చెబుతాను.

ఓ 30 -35 ఏళ్లు విపరీతంగా కష్టపడి సినిమాలు చేశారు. ఇప్పుడు కొంచెం రిలాక్స్ అవుతున్నారు కదా... ఎలా ఉంది?
ప్రతిరోజూ ఉదయం నిద్ర లేవగానే న్యూస్ పేపర్స్ చదువుతాను. వాటిలో ఉన్న వార్తలు చూస్తుంటే అసహ్యం కలుగుతోంది. దోపిడీలు, అత్యాచారాలు... ఇలాంటి అక్రమాలకు సంబంధించిన వార్తలే ఎక్కువ. అడవిలో మృగాలు ఆహారం కోసం పోరాడుతున్నాయి. సమాజంలో మనుషులు ఎవరు గొప్ప అనే విషయంలో పోటీపడుతున్నారు. రాజకీయ పరిస్థితులు అంత బాగా లేవు. ఇవన్నీ చూస్తుంటే ఆవేదనగా ఉంది. మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్నా.

ఇంతకీ, ఈ బర్త్‌డే ఎలా జరుపుకోబోతున్నారు?
ఎప్పటిలానే శ్రీ విద్యానికేతన్‌లో స్టూడెంట్స్ మధ్య జరుపుకుంటాను. మా నాన్నగారు మంచు నారాయణస్వామిగారి పేరు మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక ఉత్తమ ఉపాధ్యాయుణ్ణి ఎంపిక చేసి, ‘బెస్ట్ టీచర్ అవార్డు’ ఇస్తుంటాను. కమిటీ నిర్ణయించిన టీచర్‌కే ఇస్తుంటాం. లక్ష రూపాయలు నగదు, శాలువాతో సత్కరిస్తాం. ఈసారి కూడా ఆ ఆనవాయితీ కొనసాగిస్తాం. నాన్నగారి పేరు మీద అవార్డు ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంటుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement