Mohan Babu Birthday Special Story in Telugu - Sakshi
Sakshi News home page

నటనలో కింగ్.. పెదరాయుడు.. ఆయన అసలు పేరేంటో తెలుసా?

Published Sun, Mar 19 2023 4:24 PM | Last Updated on Sun, Mar 19 2023 5:14 PM

Mohan Babu Birthday Special Story  - Sakshi

మహానుభావుల విజయగాథలు ఎందరికో స్ఫూర్తి. ఓ సామాన్య వ్య‌క్తి నుంచి అసామాన్య శక్తిగా ఎదిగిన మహోన్నత వ్యక్తి. తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న నిత్య నూతన కళాకారుడు, కళామాతల్లి ముద్దుబిడ్డ ఆయన. నటప్రపూర్ణ, కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్, విలన్, హీరో, క్యారెక్టర్ నటుడు, మంచు భక్తవత్సలం నాయుడు, పెద‌రాయుడు అన్ని ఆయ‌నే. నటనలో వైవిధ్యాన్ని చూపిస్తూ విలక్షణ నటుడిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న డాక్టర్ మంచు మోహన్ బాబు జన్మదినం ఈ రోజే.

చిత్తూరుజిల్లా మోదుగులపాలెం గ్రామంలో 1952 మార్చి 19న మోహన్ బాబు జన్మించారు.‌ ఆయన అసలు పేరు మంచు భక్తవత్సలం నాయుడు. ఆయన  ప్రాథమిక విద్య యేర్పేడు, తిరుపతిలో సాగింది. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు మోహన్ బాబుకు చిన్నప్పటి నుంచి నాటకాలంటే ప్రత్యేక అభిమానం. అలా నాటకాలతో పాటు నటనపై ఆయనకు ఆసక్తి పెరిగింది. అలా సినిమాల్లో నటించాలనే కల ఎన్నో నిదురలేని రాత్రులని మిగిల్చేలా చేసింది. 

నటనపై ఆసక్తితో మద్రాసుకు

ఆ తర్వాత తన కల నెరవేర్చుకోనేందుకు మ‌ద్రాసుకు వెళ్లారు. అక్కడ కొన్ని రోజులు వైఎంసీఏ కాలేజీలో ఫిజికల్ ట్రైనీగా పనిచేశారు. కానీ నటుడవ్వాలనే కోరిక పరుగులు పెట్టించింది. అవకాశాల కోసం ఎండా, వానా, ఆకలి, దప్పికలు లెక్క చేయకుండా అహర్నిశలు శ్రమించారు. అలా ఆయన దర్శకుడు లక్ష్మి దీపక్ దగ్గర పనిచేశారు.

తొలి అవకాశమిచ్చిన దాసరి నారాయణరావు

1975లో దాసరి నారాయణరావు కొత్త నటీనటులతో నిర్మించ తలపెట్టిన 'స్వర్గం-నరకం' చిత్రం కోసం జరిగిన ఆడిషన్‌లో భక్తవత్సలం దాసరి దృష్టిని ఆకర్షించి నటునిగా తొలి ఆవకాశం సంపాదించారు. దాసరి నారాయణరావు.. భక్తవత్సలం నాయుడిని మోహన్ బాబుగా వెండి తెరకు పరిచయం చేశారు.

'స్వర్గం నరకం' చిత్రం ద్వారా సినీ ప్రయాణం ప్రారంభించిన మోహన్‌బాబు  573 చిత్రాలకు పైగా నటించారు. ఆయన హీరోగా నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాయి. వాటిలో అల్లుడుగారు , అసెంబ్లీ రౌడీ , రౌడీ గారి పెళ్లాం, మోహన్ బాబుని హీరోగా నిలబెట్టాయి. ఆ తరువాత వచ్చిన అల్లరి మొగుడు, బ్రహ్మ , మేజర్ చంద్రకాంత్, సినిమాలతో స్టార్ హీరోగా 'కలెక్షన్ కింగ్' అనే పేరు తెచ్చుకున్నాడు. 

ఆ తరువాత వచ్చిన 'పెదరాయుడు' ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అంతే కాకుండా పెదరాయుడి సినిమా సాధించిన రికార్డులను ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా తాకలేదంటే అర్థం చేసుకోవచ్చు. ఇక శ్రీ రాములయ్య , అడవిలో అన్నతో మోహన్ బాబు లో మరో నటుడిని ప్రేక్షకులు చూశారు. వీటితో 216 చలన చిత్రాల్లో ప్రధాన పాత్రలో నటించాడు.

శ్రీ విద్యానికేతన్ స్థాపన

అలాగే 1983లో శ్రీ లక్ష్మిప్రసన్న పిక్చర్స్‌ను  స్థాపించి నిర్మాతగా మారి 72కి పైగా చిత్రాలు నిర్మించారు. సక్సెస్‌ఫుల్‌ నిర్మాతగా పేరు తెచ్చుకున్నాడు. సినీరంగానికే పరిమితం కాకుండా 1992లో విద్యారంగంలోకి ప్రవేశించి చిత్తూరు జిల్లాలోని రంగంపేటలో స్థాపించిన శ్రీ విద్యానికేతన్ ద్వారా పేద విద్యార్థులకు రాయితీ విద్యను అందిస్తున్నాడు. క్రమశిక్షణకు మారు పేరైన మోహన్ బాబు తన ఇంట్లో పిల్లలనే కాదు.. బడిలో పిల్లలను సైతం క్రమశిక్షణగా పెరిగేలా తీర్చిదిద్దడంలో విజయం సాధించారు. 

వరించిన పద్మశ్రీ

కళారంగంలో, విద్యారంగంలో మోహన్‌బాబు చేసిన విశిష్ట సేవలను గుర్తించిన కేంద్రప్రభుత్వం 2007లో ఆయన్ని పద్మశ్రీతో సత్కరించింది. మోహన్ బాబు ప్రెస్, సాంస్కృతిక సంస్థలు, స్క్రీన్, ఫిలిం ఫేర్,, అనేక విభాగాల్లో అనేక పురస్కారాలు పొందాడు. ఆయనకు నటప్రపూర్ణ, డైలాగ్ కింగ్, కల్లెక్షన్ కింగ్  'యాక్టర్ ఆఫ్ ది మిలీనియం' లాంటి పలు బిరుదులు పొందారు. వీటితో పాటు తెలుగు ఫిలింఫేర్ అవార్డ్స్  లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డ్ ఇచ్చింది. ఇవే కాకుండా 'నటవాచస్పతి' 2015లో 'స్వర్ణకనకం', 2016లో నవరస నటరత్నం అవార్డులు పొందారు. 1995లో యన్‌టీఆర్ సహకారంతో 2001వ‌ర‌కు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. 

మోహన్ బాబు బాటలో పిల్లలు

ఆయన మాత్రమే కాదు ఆయన పిల్లలైన మంచు విష్ణు , లక్ష్మీప్రసన్న, మనోజ్ సైతం క్రమశిక్షణగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ప్రేక్షకుల ప్రేమను పొందుతున్నారు. పెద్ద కుమారుడు విష్ణు సినిమాతో తెలుగు తెరపై తెరంగేట్రం పలు సినిమాల్లో నటించి మెప్పించారు. ఒకవైపు సినిమాలు.. మరో వైపు విద్యాసంస్థల బాధ్యతలు చూసుకుంటూ  మా అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా గెలిచి సినిమా ఆర్టిస్టులకు తన వంతు సేవ చేస్తున్నారు. 

ఇక మంచు లక్ష్మి సైతం తండ్రి మోహన్ బాబు బాటలోనే నడుస్తోంది. సినిమాలు మాత్రమే కాదు సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటారామె. గతేడాది యాదగిరిగుట్ట పరిధిలోని కొన్ని ప్రభుత్వ పాఠశాలలను కూడా దత్తత తీసుకొని తండ్రి పెంపకం అంటే నిరూపించారు. 
అలాగే సినిమాల్లో రాణిస్తూనే.. సమాజంలో అడబిడ్డలపై ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా వారి కుటుంబం తరుపున నిలబడి న్యాయం కోసం నిలబడే మరో డైనమిక్ మంచు మనోజ్. ఇలా మంచు మోహన్ బాబు ఆయనే కాకుండా కుటుంబం అంత సమాజ స్పృహ ఉన్నవారే కావడం గొప్పవిషయం.

కళను, కళాకారులను అమితంగా అభిమానించే మోహాన్ బాబు సొంత బ్యానర్‌లో సినిమాలు నిర్మించ‌డంతో పాటు ఆయ‌నే హీరోగా, ప్ర‌ధాన పాత్ర‌లు చేస్తూ పలు సినిమాల్లో న‌టిస్తున్నారు. వెండితెరపై అదే ఉత్సాహంతో ఇలాగే మ‌రిన్ని చిత్రాల్లో న‌టిస్తూ మ‌న‌ల్ని ఎప్పుడు అలరించాలని కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబుకు మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement