'మేకప్ వేసుకునేందుకు నేను రెడీ'
లండన్ : నటన చాలా కష్టమైన వృత్తి అని ఇంగ్లండ్ ఫుట్బాల్ టీమ్ మాజీ కెప్టెన్ డేవిడ్ బెకహామ్ అన్నాడు. ఇప్పటికే అతడు గయ్ రిచీ మూవీ 'నైట్స్ ఆఫ్ ది రౌండ్ టేబుల్' లో ఓ పాత్రకు తన గొంతు అరువిచ్చిన విషయం విదితమే. త్వరలో పూర్తిస్థాయి నటుడు అనిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మేకప్ వేసుకుని తెరపై కనిపించేందుకు తాను నిర్ణయించుకున్నట్లు ప్రటించేశాడు. వచ్చే ఏడాది ఆ మూవీ విడుదలవుతుంది. ఈ ప్రముఖ ఆటగాడు బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొందరికి మాత్రమే తెలుసు. మోడలింగ్ నుంచి ఛారిటీ ట్రస్ట్ వరకు పలు రంగాలలో అపార అనుభవం అతడి సొంతం. అయితే, తన టాలెంట్కు హద్దులు లేవని నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నాడు మరి. సినిమాలలో నటించాలనుకున్నట్లు ఇటీవలే తెలిపాడు. క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ప్రఖ్యాత ఆటగాడు సచిన్ టెండూల్కర్ కూడా సిల్వర్ స్క్రీన్ వైపు అడుగులు వేసిన విషయం విదితమే.
'నటన అనేది చాలా టఫ్ జాబ్' అని తనకు తెలుసునని బెకహామ్ అన్నాడు. అయితే, చాలా మంది క్రీడాకారులు నటన వైపు అడుగులేసి చేతులు కాల్చుకున్నారనీ, ఎందుకంటే నటించడం అనేది నైపుణ్యం, క్రమశిక్షణతో కూడుకున్న పని అంటూ చెప్పుకొచ్చాడు. నటనలో ఓనమాలు నేర్చుకుని శిక్షణ తీసుకున్న తర్వాతే ఈ రంగంలోకి అడుగుపెడతానని పేర్కొన్నాడు. 'నైట్స్ ఆఫ్ ది రౌండ్ టేబుల్' దర్శకుడు బెకహామ్ డబ్బింగ్ చెప్పడంపై ప్రశంసల జల్లులు కురిపించాడట. ఇప్పటివరకు చాలా రంగాల్లో పనిచేసిన అనుభవం తనకు ఉందని, గుర్తింపు ఉన్న వ్యక్తిని అవడంతో విమర్శలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు.