యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా... బాలీవుడ్ బ్యూటీ క్వీన్ దీపికా పదుకొనే ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఛపాక్’. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ముంబైలో ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దీపికతో పాటు లక్ష్మీ అగర్వాల్ కూడా పాల్గొన్నారు. ఇందులో భాగంగా ప్రముఖ సింగర్ శంకర్ మహదేవన్ ఈ చిత్రంలోని పాట పాడుతుండగా స్టేజీపై ఉన్న లక్ష్మీ భావోద్యేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. దీంతో పక్కనే ఉన్న దీపిక ఆమెను అక్కున చేర్చుకుని ఓదార్చారు. అలాగే ఈ కార్యక్రమంలో దీపిక కూడా కన్నీటి పర్యంతమయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం షోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాగా, 2005లో యాసిడ్ దాడికి గురైన లక్ష్మీ అగర్వాల్ జీవిత కథ ఆధారంగా ‘ఛపాక్’ చిత్రాన్ని దర్శకురాలు మేఘనా గుల్జార్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో మాల్తీ పాత్రలో దీపిక లీడ్ రోల్ చేస్తున్నారు. తన పాత్ర గురించి మాట్లాడుతూ.. ‘ఇది కేవలం లక్ష్మీ బయోపిక్ మాత్రమే కాదు. ఆమె ప్రయాణం, పోరాటం, విజయం, మానవ ఆత్మకథ’ అంటూ చెప్పుకొచ్చారు. షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ‘ఛపాక్’ సినిమాను ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు దీపిక నిర్మాతగా కూడా వ్యవహరించారు.
Comments
Please login to add a commentAdd a comment