దుమ్ము రేపుతున్న ధూమ్ 3
అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో ప్రవేశించి దుమ్ము రేపిన ధూమ్ 3 ఇప్పటివరకు ఎంత వసూలు చేసిందో తెలుసా? ఒక్కసారి గుండె చిక్కబట్టుకోండి. ఎందుకంటే, ఇప్పటివరకు భారత సినీ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని మొత్తమది. వంద కోట్ల కలెక్షన్లను అత్యంత తక్కువ సమయంలో సాధించిన ఘనత ధూమ్ 3దే. దాంతోపాటు.. ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ కలెక్షన్లు 466.29 కోట్లు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది సరికొత్త రికార్డులు సాధిస్తోంది. పాకిస్థాన్, నేపాల్ లాంటి దేశాల్లో కూడా ఈ సినిమా కలెక్షన్ల వరద పారిస్తోంది.
తొలిరోజు భారత దేశంలో బాక్సాఫీసు రికార్డులను ఇది బద్దలుకొట్టింది. మొదటి రోజే 36.22 కోట్ల నెట్ కలెక్షన్లతో పాటు తొలి మూడు రోజుల్లో 107 కోట్లు సంపాదించింది. తొలిరోజు 36.22 కోట్లు, రెండో రోజు 33.36 కోట్లు, మూడో రోజు ఆదివారం 36.05 కోట్ల నెట్ వసూళ్లు చేసింది.
అమీర్ ఖాన్, కత్రినా కైఫ్ కలిసి వెండితెర మొత్తాన్ని ఏలేసిన ఈ సినిమా ఇప్పటికి దాదాపు 184.70 కోట్ల రూపాయల నెట్ వసూళ్లు కేవలం భారత్ లోనే సంపాదించింది. పక్కాగా ప్లాన్ చేసుకుంటే ఎలాంటి విజయాలు సాధించవచ్చో యష్ రాజ్ ఫిలింస్ చేసి చూపించింది. భారతదేశంలో 4వేల థియేటర్లలోను, విదేశాల్లో 700 థియేటర్లలోను ఒకేసారి విడుదల చేశారు. దాంతోపాటు రాబోయే నెల రోజుల పాటు ఎలాంటి పెద్ద సినిమాలు విడుదల కాని సమయం చూసుకుని దీన్ని బయటకు తీసుకొచ్చారు. ధూమ్ బ్రాండు ఎటూ ఉండటంతో మొదటి మూడు నాలుగు రోజుల్లో జనం ఆటోమేటిగ్గా థియేటర్లకు వచ్చారు. వచ్చిన తర్వాత అందులోని గ్రాఫిక్స్, యాక్షన్ సన్నివేశాలు, అమీర్ మ్యాజిక్ లాంటివాటితో పాటు కత్రినా కూడా ప్రేక్షకులను కట్టిపడేసింది. రిపీట్ ఆడియన్స్ కూడా ఈ సినిమాకు బాగానే ఉన్నట్లు తెలుస్తోంది.
దీంతో పోటీ పడుతుందనుకున్న క్రిష్ 3 నవంబర్ 1న విడుదలైనా, మూడువారాలతో దాని కథ చాలావరకు ముగిసిపోయింది. నవంబర్ 14న రామ్ లీలా విడుదలైనా దానికి డివైడ్ టాక్ వచ్చింది. దాంతోపాటు ఫ్యామిలీ ఆడియన్స్ ఆ సినిమాకు వెళ్లేందుకు కాస్త మొహమాటపడ్డారు కూడా. ఇవన్నీ కూడా ధూమ్ 3కి బాగా కలిసొచ్చాయి. తదుపరి పెద్ద చిత్రం సల్మాన్ ఖాన్ నటించిన ‘జై హో’ జనవరి 24న విడుదల కానుంది. దాంతో అప్పటివరకు ధూమ్ 3దే రాజ్యం అన్నమాట. ఇంకా ఎన్ని వందలకోట్లు మూటగట్టుకుంటుందో చూడాలి మరి!!