
ఆమిర్‌కు ధూమ్ 3 టెన్షన్
ముంబై: తాను నటించిన ధూమ్ 3 సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ల గురించి ఆలోచించడం లేదని బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్‌ఖాన్ స్పష్టం చేశాడు. అయితే ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారనే దాని గురించి ఆందోళనగా ఉందన్నాడు. ‘బాక్సాఫీస్ వసూళ్లు గురించి ఎలాంటి అంచనా లేదు. వీటన్నింటి గురించి పెద్దగా ఆలోచించను. తమ విలువైన సమయాన్ని ప్రేక్షకులు కేటాయించి సినిమాను ఎంజాయ్ చేయడమే నాకు ప్రధానమ’ని పేర్కొన్నాడు. మంగళవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రేక్ష కులు కూడా బాక్సాఫీస్ కలెక్షన్ల గురించి పట్టించుకోరని, తాను కూడా అంతేనని తెలిపాడు. సినిమాను ప్రేక్షకులు ఆదరించారా? లేదా? అన్నదే తనకు ప్రధానమని చెప్పాడు.
గత రెండేళ్ల నుంచి స్మోకింగ్‌కు దూరంగా ఉన్న తాను ధూమ్ 3 సినిమా ఎలా ఆడుతుందనే ఒత్తిడితో తిరిగి ప్రారంభించానన్నాడు. విరివిగా ఆహారాన్ని తీసుకోవడం అలవాటైందన్నాడు. ఈ సినిమాలో ఆస్ట్రేలియా కొరియోగ్రాఫర్, ప్రముఖ డ్యాన్సర్ దియాన్ పెర్రీ మార్గదర్శనంలో డ్యాన్స్ చేశానన్నాడు. టాప్ డ్యాన్సింగ్ గురించి 45 రోజులు శిక్షణ తీసుకున్నానని చెప్పాడు. తాను డ్యాన్సర్‌ని కాదని, హృతిక్, గోవిందా, షాహీద్ తనకన్నా మెరుగ్గా డ్యాన్స్ చేస్తారని తెలిపాడు. అయితే రెండేళ్ల పాటు సాధన చేస్తే బాగా రాణిస్తానని వెల్లడించాడు. కాగా, ఈ ధూమ్ 3 సినిమా ఈనెల 20న విడుదల కానుంది.