![చెప్పీ.. చెప్పక!](/styles/webp/s3/article_images/2017/09/4/61467565984_625x300.jpg.webp?itok=dRQRMAJY)
చెప్పీ.. చెప్పక!
‘అండ్ ది బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ గోస్ టు నయనతార..’ అనగానే ఉత్సాహంగా ఈ బ్యూటీ వేదిక మీదకు వెళ్లారు. కానీ, అవార్డు స్వీకరించడానికి నిరాకరించారు. వేదిక మీద ఆల్రెడీ ఉన్న సీనియర్ల చేతుల మీదగా ఆమె అవార్డు అందుకోవడానికి ఇష్టపడలేదు. మరి.. ఎవరి చేతుల మీదగా ఇస్తే తీసుకోవాలనుకున్నారు?.. ఇప్పుడిప్పుడే పైకొస్తున్న దర్శకుడు విఘ్నేష్ శివన్ చేతుల మీదగా ఇప్పించమని నిర్వాహకులను కోరారు.
దాంతో విఘ్నేష్ శివన్‌ని వేదిక మీదకు పిలవడం, ఆయన చేతుల మీదగా నయన అవార్డు అందుకోవడం జరిగిపోయింది. సింగపూర్‌లో జరిగిన ‘సైమా’ వేడుకల్లో జరిగిన సంఘటన ఇది. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నటించిన ‘నానుమ్ రౌడీదాన్’ చిత్రానికే నయనతార ఉత్తమ కథానాయికగా అవార్డు అందుకున్నారు.
ఇదే చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా విఘ్నేష్ కూడా అవార్డు దక్కించుకున్నారు. కాగా, ఈ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారనే వార్త గత కొన్నాళ్లుగా షికారు చేస్తోంది. ఆ వార్తలకు ఊతం ఇచ్చే విధంగా విఘ్నేష్, నయనల సింగపూర్ ట్రిప్ సాగింది. ‘మేం లవ్‌లో ఉన్నాం’ అనే సంకేతాలు అందేట్లుగా ఈ ఇద్దరి ప్రవర్తన ఉందని అవార్డు వేడుకను వీక్షించినవాళ్లు అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే...
చెన్నై నుంచి విఘ్నేష్, నయన జాయింట్‌గా సింగపూర్ వెళ్లారని తెలుస్తోంది. ఎందుకంటే ఈ ఇద్దరూ ఎయిర్‌పోర్ట్ నుంచి కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్న ఫొటోలు బయటికొచ్చాయి. జాయింట్‌గా వెళితే లవ్‌లో ఉన్నట్లేనా? అన్నది కొందరి వాదన. ఏమీ లేనప్పుడు ఇద్దరూ ఎందుకు కలిసి వెళతారు? చెన్నై నుంచి చాలామంది వెళ్లారుగా.. వాళ్లతో కూడా జాయిన్ అవ్వొచ్చుగా అన్నది ఇంకొందరి వాదన.
అవార్డు వేడుక ప్రాంగణానికి కూడా ఇద్దరూ కలిసే వెళ్లారట. పక్క పక్కనే కూర్చున్నారు. ఇద్దరూ జోక్స్ వేసుకోవడం, చెవుల్లో రహస్యంగా ఏదో చెప్పుకోవడం నలుగురి దృష్టిలోనూ పడింది. వీరి వాటం చూస్తుంటే ఏదో స్నేహితుల్లా మాట్లాడుకున్నట్లు లేదని, ప్రేమికులే అనే ఫీలింగ్ కలిగిందనీ ఆ నలుగురూ అంటున్నారు.
వేదికపై ఒకరి గురించి మరొకరు కురిపించిన ప్రశంసల వర్షం అయితే హాట్ టాపిక్ అయింది. ఇప్పటివరకూ తాను కలిసినవాళ్లల్లోనే నయనతార ‘బెస్ట్ హ్యూమన్ బీయింగ్’ అని విఘ్నేష్ స్టేట్‌మెంట్ ఇచ్చేశారు. ‘స్క్రిప్ట్ చదవడానికి రావడం నుంచి లవ్‌లో పడటం వరకూ అన్నింటికీ థ్యాంక్స్’ అని కూడా విఘ్నేష్ అన్నారు. దాంతో నయన స్క్రిప్ట్‌తో లవ్‌లో పడ్డారని అర్థమా? విఘ్నేష్‌తో పడ్డారని అర్థమా? అనే చర్చ మొదలైంది. ఎంతైనా విఘ్నేష్ చాలా తెలివిగలవాడని.. చెప్పీ చెప్పక అసలు విషయాన్ని చెప్పారని కూడా చెప్పుకుంటున్నారు.
విఘ్నేష్ మాట్లాడుతున్నంతసేపూ నయనతార ముసిముసి నవ్వులు నవ్వుకున్నారట. ఇక వేదిక మీదకు వచ్చాక.. విఘ్నేష్‌ని ప్రశంసించి ఆనందపడ్డారట. ‘‘ఈ కథ విన్నప్పుడు ఇందులోని పాత్రను నేను చేయగలనా? అని సందేహపడ్డాను. కానీ, విక్కీ (విఘ్నేష్ శివన్)కి నా మీద పూర్తి నమ్మకం ఉంది. తనే నన్ను ఎంకరేజ్ చేశాడు. డిఫరెంట్ రోల్స్ ట్రై చేయడానికి ఇదే సరైన టైమ్ అన్నాడు. నేను తప్ప ఈ పాత్రను ఎవరూ చేయలేరని అన్నాడు’’ అని వేదిక మీద నయనతార అన్నారు. చివర్లో ‘థ్యాంక్యూ విక్కీ..’ అని కూడా చెప్పారు. ఆ తర్వాత ఇద్దరి ఆత్మీయ ఆలింగనం వీక్షకులకు కనువిందు అయింది.
అంతా బాగానే ఉంది. ఆల్రెడీ తనకు వేరేవాళ్ల చేతుల మీదగా అవార్డు ఇప్పించాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తే.. వారిని కాదని విఘ్నేష్ శివన్ నుంచి అందుకున్నారు నయనతార. మరి.. నిర్వాహకుల కోరిక మీదట నయనకు అవార్డు ఇవ్వాలనుకున్నవాళ్లు చిన్నబుచ్చుకోరూ. అందుకే నయనతార వారికి బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. మొత్తం మీద విఘ్నేష్, నయనల మధ్య ‘సమ్‌థింగ్.. సమ్‌థింగ్..’ ఉందని చాలామంది బలంగా ఫిక్సయ్యారు. మరి.. అందరూ అనుకుంటున్నట్లు వీళ్లది ‘బలమైన బాండింగ్’ అయితే.. అది ఎంత బలమైనదో భవిష్యత్తులో తెలిసిపోతుంది. మూడు ముళ్ల వరకూ వెళ్లేంత ఉందా? లేదా? అన్నది అప్పుడు స్పష్టం అవుతుంది.