త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు భారీ చిత్రం!
కొన్ని కాంబినేషన్స్ ఆసక్తికరంగా ఉంటాయి. అసలా కాంబినేషన్‌ని ఎవరూ ఊహించరు కూడా. దర్శకుడు త్రివిక్రమ్ - నిర్మాత ‘దిల్’ రాజులది అలాంటి కాంబినేషనే. ఎప్పట్నుంచో ఈ ఇద్దరికీ పరిచయం ఉన్నప్పటికీ ఇప్పటివరకూ త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు సినిమా నిర్మించలేదు. ఇప్పుడు అది జరగబోతోంది.
కుటుంబ కథా చిత్రాలతో పాటు యువతకు నచ్చే ప్రేమకథా చిత్రాలు తెరకెక్కించడంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దిట్ట. సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రాలను నిర్మించడంలో ‘దిల్’ రాజుది అందెవేసిన చేయి. ఈ ఇద్దరి కాంబినేషన్ అంటే ఫుల్ మీల్స్ లాంటి సినిమాని ఎదురు చూడొచ్చు. ఈ చిత్రం గురించి ‘దిల్’ రాజు మాట్లాడుతూ- ‘‘నువ్వేకావాలి’ చిత్రం నుంచి నాకు త్రివిక్రమ్‌తో మంచి స్నేహం ఉంది.
ఎప్పుడు కలిసినా సినిమాల గురించే మాట్లాడు కుంటుంటాం. ఇప్పుడు మా బ్యానర్‌లో ఆయన దర్శకత్వంలో ఓ భారీ చిత్రం తెరకెక్కించనున్నాం. ఇందులో ఓ స్టార్ హీరో నటిస్తారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేస్తా’’ అని చెప్పారు. ‘‘జూన్‌లో విడుదలైన పెద్ద చిత్రాలు సక్సెస్ అయినట్టు చరిత్ర లేదు. ‘అ..ఆ’ దాన్ని బ్రేక్ చేసింది. మంచి విజయం అందుకున్న దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత చినబాబుగారికి అభినందనలు’’ అని కూడా ‘దిల్’ రాజు అన్నారు.