బాలీవుడ్ ట్రాజెడీ కింగ్ దిలీప్ కుమార్ అభిమానులను శోకంలో ముంచి వెళ్లిపోయారు. గత కొంతకాలంగా శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 1944లో బాంబే టాకీస్ నిర్మాణ సంస్థలో వచ్చిన జ్వర్ భట చిత్రం ద్వారా బాలీవుడ్ తెరకు పరిచయమైన దిలీప్ కుమార్ సుమారు ఆరు దశాబ్దాల పాటు 60 చిత్రాల్లో తన నటనతో అభిమానులను అలరించారు.
1922 లో ప్రస్తుత పాకిస్థాన్లోని పెషావర్లో జన్మించిన దిలీప్ కుమార్ అసలు పేరు యూసుఫ్ ఖాన్. ఆయన తండ్రి లాలా గులామ్ సర్వార్ పండ్ల వ్యాపారి. తండ్రితో పొసగకపోవటంతో ఇంటి నుంచి వచ్చేసి పూణేకు చేరుకున్న దిలీప్ కుమర్.. అక్కడ ఆర్మీ క్లబ్ వద్ద కొంత కాలం సాండ్విచ్ స్టాల్ను నిర్వహిచారు. అనంతరం బాంబేకు చేరుకున్న ఆయన.. 'బాంబే టాకీస్' ఓనర్ దేవికా రాణి సలహా మేరకు తన పేరును యూసుఫ్ ఖాన్ నుంచి దిలిప్ కుమార్గా మార్చుకొని జ్వర్ భట(1944) చిత్రంతో బాలీవుడ్ తెరకు పరిచయమయ్యారు.
అయితే తొలిచిత్రం దిలిప్ కుమార్కు అంతగా గుర్తింపు తీసుకురాకపోయినప్పటికీ అనంతరం నటించిన జుగ్ను(1947) బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించి దిలీప్ కుమార్కు గుర్తింపు తీసుకొచ్చింది. అనంతరం షహీద్, మెహబూబ్ ఖాన్ దర్శకత్వంలో వచ్చిన అందాజ్(1949) చిత్రాలతో దిలిప్ కుమార్కు ఇండస్ట్రీలో తిరుగులేకుండా పోయింది. అదే ఏడాది రిలీజైన షబ్నం చిత్రం కూడా భారీ హిట్ సాధించడం విశేషం. ఇక 1950 దశకంలో దిలీప్ కుమార్ నటించిన చిత్రాలు.. జోగన్, తరాణా, హల్చల్, దీదర్, దాగ్, దేవ్దాస్, యహుది, మధుమతి ఆయనకు ట్రాజెడీ కింగ్ ఇమేజ్ను కట్టబెట్టాయి.
దాగ్(1952) చిత్రానికి గాను మొట్టమొదటి ఫిల్మ్ఫేర్ అవార్డును దిలిప్ కుమార్ పొందారు. ఫుట్పాత్, నయా దౌర్, ముసాఫిర్, పైఘం లాంటి పలు సామాజిక నాటక చిత్రాలలో సైతం నటించి దిలీప్ కుమార్ మెప్పించారు. కోహినూర్, మొఘల్ ఏ ఆజమ్ చిత్రాలు దిలిప్ కుమార్కు మంచి విజయాన్నిచ్చాయి. గంగా జమునా చిత్రానికి దిలీప్ కుమార్ నిర్మాతగా కూడా వ్యవహరిచారు. దిలీప్ కుమార్ నిర్మాతగా వ్యవహరించిన ఏకైక చిత్రం గంగా జమునానే కావడం విశేషం.
దిలిప్ కుమార్ తన కన్నా వయసులో 22 సంవత్సరాలు చిన్నవారైన నటీమణి సైరాభానును 1966లో వివాహమాడారు. అనంతరం 1980లో దిలిప్ కుమార్ సంతానం కోసమని ఆస్మాను వివాహం చేసుకున్నప్పటికీ అది ఎక్కువకాలం నిలువలేదు.
1970 దశకంలో దిలిప్ కుమార్ కెరీర్ గ్రాఫ్ అనూహ్యంగా పడిపోయింది. ఈ కాలంలో ఆయన నటించిన దస్తాన్(1972), బైరాగ్(1976) చిత్రాలు విజయం సాధించలేదు. దిలీప్ కుమార్ అవకాశాలను ఎక్కువగా రాజేష్ ఖన్నా, సంజీవ్ కుమార్లు దక్కించుకున్నారన్న వాదన సైతం ఉంది. 1976 నుంచి 1981 వరకు దిలీప్ కుమార్ సినిమాల నుంచి విరామం తీసుకున్నారు.
అనంతరం అమితాబ్ బచ్చన్తో కలిసి నటించిన 'శక్తి' చిత్రానికి గాను దిలీప్ కుమార్ మరోసారి బెస్ట్ యాక్టర్గా ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు. అత్యధికంగా ఎనిమిది సార్లు బెస్ట్ యాక్టర్గా ఫిల్మ్ఫేర్ అవార్డును దిలీప్ కుమార్ పొందారు. ఆయనతో సమానంగా షారుక్ ఖాన్ సైతం 8 ఫిల్మ్ఫేర్లు పొందారు. అత్యధిక అవార్డులు పొందిన నటుడిగా దిలీప్ కుమార్ గిన్నిస్ వరల్డ్ రికార్డులకెక్కారు. చిత్రరంగంలో ఆయన అసమాన సేవలకు గాను భారత ప్రభుత్వం పద్మ భూషణ్(1991), పద్మ విభూషణ్(2015) అవార్డులతో సత్కరించింది. 1994లో దాదాసాహెబ్ పాల్కే అవార్డు దిలీప్ కుమార్‌ను వరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1997లో ఎన్టీఆర్ జాతీయ అవార్డుతో ఆయనను సత్కరించింది.
దిలిప్ కుమార్ మరణం పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. భారత చలనచిత్ర రంగంలో దిలీప్ కుమార్ చేసిన సేవలు మరువలేనివని, ఆయన మరణం తీరని లోటని అన్నారు. భారత్‌లోనే కాదు పాకిస్థాన్‌లో సైతం దిలీప్ కుమార్ అభిమానులు విషాదంలో మునిగిపోయారు.
దిలీప్ కుమార్ మృతి
Published Sat, Apr 16 2016 4:06 PM | Last Updated on Sun, Sep 3 2017 10:04 PM
Advertisement
Advertisement