‘‘సాధారణంగా అందరం మన అమ్మలను టేకిట్ ఫర్ గ్రాంటెడ్‌గా తీసుకుంటాం. కసురుతాం.. విసుక్కుంటాం. అయినా అమ్మ మనకు చాలా ప్రేమను పంచుతారు. మనమందరం తల్లులకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం లేదేమో? ‘ఓ బేబీ’ సినిమాలో ఈ పాయింట్‌ని చూపించాం. ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారనే నమ్మకం ఉంది’’ అని దర్శకురాలు నందినీ రెడ్డి అన్నారు. సమంత లీడ్ రోల్‌లో నాగశౌర్య, లక్ష్మీ, రాజేంద్రప్రసాద్, రావు రమేశ్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓ బేబీ’. సునీత తాటి, వివేక్ కూచిభొట్ల నిర్మించారు. సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ఈ సినిమా ఈ నెల 5న విడుదలకానుంది. నందినీ రెడ్డి పలు విశేషాలు పంచుకున్నారు.
► కొరియన్ చిత్రం ‘మిస్. గ్రానీ’ చూస్తున్నంత సేపు నేను చాలా కనెక్ట్ అయ్యాను. మదర్ సెంటిమెంట్ ఉంటుంది. అందరూ కనెక్ట్ అయ్యే కథ ఇది. కథలో క్వాలిటీ ఉంది. బెస్ట్ యాక్టర్స్ ఈ సినిమాలో పని చేశారు. లక్ష్మిగారు, రాజేంద్రప్రసాద్, రావు రమేశ్‌గారు, సమంత అందరూ తమ బెస్ట్ ఇచ్చారు. డైరెక్షన్‌లో నేను చే సిన చిన్నచిన్న తప్పులు కూడా వాళ్ల అద్భుతమైన యాక్టింగ్‌తో కవర్ చేసేశారు.
► ఆర్టిస్ట్‌కి కథ ప్లస్ అయ్యే సినిమాలు కొన్ని.. కథకు ఆర్టిస్ట్ ప్లస్ అయ్యే సినిమాలు మరికొన్ని. ‘ఓ బేబీ’ రెండు విభాగాల్లోకి వస్తుంది. ఈ సినిమాలో ఉన్న యాక్టర్స్ అందరూ విందు భోజనంలా ఉంటారు. సినిమాలో బేబక్క పాత్ర చాలా కీలకం. లక్ష్మీగారు అద్భుతంగా చేశారు. ఆమె ఒప్పుకోకపోయి ఉంటే ఈ సినిమాను చేసేవాళ్లం కాదేమో? ఈ పాత్రకు ఆప్యాయత, వెటకారం అన్నీ ఉండాలి. లక్ష్మీగారే కరెక్ట్ అని భావించాం.
► రీమేక్‌తో వచ్చిన చిక్కేంటంటే సినిమా సరిగ్గా రాకపోతే పాడు చేశారు అంటారు. హిట్ అయితే అలానే తీశారు.. హిట్ అయిపోయింది అంటారు. రీమేక్స్‌తో ఎక్కువ పేరు సంపాదించడం కొంచెం కష్టం. నా సినిమాలన్నీ 50 రోజుల్లోనే పూర్తి చేస్తాను. కానీ సినిమా సినిమాకు మధ్య గ్యాప్ ఎందుకొస్తుంది? అని అడుగుతుంటారు. ఒక్కోసారి ఐడియా స్టేజిలో బావుంటుంది. కథ రాశాక నచ్చకపోవచ్చు. అలా లేట్ అవుతూ సినిమా సినిమాకు గ్యాప్ వస్తుంది. ఈసారి నుంచి అలా జరగుకుండా చూసుకుంటాను.
► ఈ సినిమాకు సమంత కేవలం యాక్టర్‌గానే కాకుండా అన్ని బాధ్యతలూ చూసుకున్నారు. ‘నువ్వేదైనా తప్పు చేస్తుంటే నేను చెబుతా.. నేనేదైనా తప్పు చేస్తే నువ్వు చెప్పు.. మన మధ్య ఈగో అనేది అడ్డురాకూడదు అని సినిమా స్టార్ట్ అవ్వక ముందే సమంత–నేను ఒప్పందం చేసుకున్నాం(నవ్వుతూ).
► దర్శకురాలిగా అన్ని రకాల సినిమాలు చేయాలనుంది. యాక్షన్ కామెడీ, స్పోర్ట్స్ సినిమాలు చేస్తాను. ప్రస్తుతం వైజయంతీ బ్యానర్‌లో ఓ సినిమా చేయాలి. రెండు కథలున్నాయి. అందులో మల్టీస్టారర్ సినిమా ఒకటి. వెబ్ సిరీస్‌ల ట్రెండ్ కూడా బాగా పెరుగుతోంది. ఇంకా స్టార్టింగ్ స్టేజిలోనే ఉంది. వెబ్ థియేటర్‌కి హాని చేస్తుందా? అంటే చెప్పలేం.
► ‘ఓ బేబీ’ సినిమా పూర్తయ్యాక అమ్మ మీద కసురుకోవడం కొంచెం తగ్గింది. ఒకవేళ బేబీలా నేను మళ్లీ వయసులో వెనక్కి వెళితే సినిమాలు కాకుండా వేరే ప్రొఫెషన్‌ని కూడా ట్రై చేస్తానేమో?
ఇండస్ట్రీలో మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉంది. కానీ మెల్లిగా ఆ సంఖ్య పెరగాలి. ఇంతకుముందుతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు మారాయి. ‘ఓ బేబీ’ సినిమా సెట్లో మహిళా సాంకేతిక నిపుణుల సంఖ్య కొంచెం పెరిగింది. మహిళలు ఉండాలనే ఉద్దేశం కంటే కూడా వాళ్ల ప్రతిభని గుర్తించే తీసుకున్నాం.
Comments
Please login to add a commentAdd a comment