o baby
-
లేడీ పోలీస్
ఈ ఏడాది కొరియన్ కథతో ‘ఓ బేబి’ (కొరియన్ చిత్రం ‘మిస్ గ్రానీ’కి తెలుగు రీమేక్) వంటి బ్లాక్‌బస్టర్ హిట్ సాధించారు సమంత. లేడీ ఓరియంటెడ్ సినిమాగా సమంత కెరీర్లో పెద్ద హిట్ సినిమా అనిపించుకుంది ‘ఓ బేబి’. ఇప్పుడు నయనతార కూడా ఓ కొరియన్ కథలో నటించడానికి అంగీకరించారని తెలిసింది. తెలుగు, తమిళ భాషల్లో ఈ లేడీ ఓరియంటెడ్ సినిమా తెరకెక్కనుందట. ఈ చిత్రాన్ని హీరో రానా నిర్మిస్తారట. ఇందులో నయనతార పోలీస్ పాత్రలో కనిపిస్తారని సమాచారం. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
నాన్నకు ప్రేమతో మిస్సయ్యాను
‘స్వామి రారా, దోచెయ్, కొత్తజంట, బాబు బంగారం’ వంటి చిత్రాలకు కెమెరామేన్‌గా మంచి మార్కులు అందుకున్నారు రిచర్డ్ ప్రసాద్. తాజాగా ఆయన ఛాయాగ్రాహకుడిగా చేసిన చిత్రం ‘ఓ బేబీ’. సమంత లీడ్ రోల్లో నందనీరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 5న విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రిచర్డ్ మాట్లాడుతూ– సినిమా అనేది ఎమోషన్స్ కలయిక కాబట్టి నా చుట్టూ జరిగే ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉంటాను. నాన్న రిజిస్ట్రార్‌గా పని చేసేవారు. అమ్మ టీచర్. ఆమె తన జాబ్‌కి రిజైన్ చేసి ఇంటి వ్యవహారాలను చూసుకునేవారు. ఇప్పుడు ఆవిడ లేరు. చనిపోయారు. మా సిస్టర్ను నా స్నేహితుడే పెళ్లి చేసుకున్నాడు. మా బావగారు కూడా సినిమాటోగ్రాఫర్. నేను విజువల్ కమ్యూనికేషన్స్ చదివాను. అందులో జర్నలిజం, ఫోటోగ్రఫీ, పెయింటింగ్ అన్నీ ఉండేవి. చదువు పూర్తి చేసుకున్న తర్వాత జయ టీవీలో పార్ట్ టైమర్‌గా జాయిన్ అయ్యాను. జయ టీవీ వెబ్‌సైట్‌ను నేనే స్టార్ట్ చేశాను. వెబ్ డిజైనింగ్ చేసేవాడిని. ఓ సారి స్పీల్బర్గ్ `సిల్వస్టర్ ` సినిమా చూశాను. అప్పుడు డైరెక్టర్ కావాలనుకున్నాను కానీ.. నాకు డైరెక్షన్ కంటే ఫోటోగ్రఫీ అంటేనే ఆసక్తిఉందని గ్రహించాను. అన్నిక్రాఫ్ట్స్ తెలుసుకోవాలనే ఆసక్తి ఉండేది. అందువల్ల సినిమాటోగ్రఫీలో కోర్సు చేయాలనుకున్నాను. అంత కంటే ముందే నేను చదువుకునే రోజుల్లో ఎడిటింగ్‌పై పట్టు సాధించాను. ఎడిటింగ్ అవగాహన ఉంటే సీన్ డివిజన్, సౌండింగ్ అన్ని తెలుస్తాయి. నేను ప్రతి సినిమాకు సినిమాటోగ్రాఫర్ అనే భావనతో కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్ అనే భావనతో పనిచేస్తాను. ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క ఎమోషన్‌ను ఎలా క్యారీ చేస్తారనే దాన్ని అబ్జర్వ్ చేసేవాడిని. కానీ పూర్తి ఫోకస్ అంతా ఫోటోగ్రఫీపైనే ఉండేది. నేను కోర్సు పూర్తి చేయగానే కమర్షియల్ యాడ్స్‌కు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశాను. ఓసారి థియేటర్లో పాటల రచయిత కృష్ణ చైతన్యతో పరిచయం ఏర్పడింది. అక్కడ నుండి సుధీర్ వర్మతో పరిచయం ఏర్పడింది. ఇక్కడ వారితో కలిసి షార్ట్ ఫిలింస్‌కు పనిచేస్తూ వచ్చి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాను. తొలిసారి `స్వామిరారా`తో సినిమాటోగ్రాపర్‌గా మారాను. తర్వాత కొత్తజంట, దోచెయ్, బాబుబంగారం సినిమాలకు పనిచేశాను. `దోచెయ్`లో నా వర్క్ చూసిన ఎన్టీఆర్‌గారు, సుకుమార్‌గారు ..`నాన్నకు ప్రేమతో` సినిమాలో అవకాశం ఇచ్చారు. సినిమా లండన్ షూట్ చేయాలి. నేను రెండు సార్లు వీసాకు అప్లై చేశాను. కానీ రెండు సార్లు రిజెక్ట్ అయ్యింది. వీసా ఉండుంటే ఎన్టీఆర్ వంటి స్టార్‌తో పనిచేసే అవకాశం దక్కి ఉండేది. మిస్ అవడం నా దురదృష్టం. డైరెక్షన్ పరంగా నాకు స్పీల్బర్గ్ అంటే చాలా ఇష్టం. సినిమాటోగ్రఫీ పరంగా ఇద్దరినీ బాగా ఇష్టపడతాను. క్రిస్టోఫర్ డైల్‌గారంటే చాలా ఇష్టం. అలాగే పి.ఎస్.వినోద్‌గారు, రత్నవేలుగారు కెమెరావర్క్ బాగా నచ్చుతాయి. నేను సినిమాలు ఎక్కువగా చూస్తుంటాను. భాషతో సంబంధం లేకుండా అన్ని సినిమాలు చూస్తాను. అలాగే మన చుట్టూ జరిగే ప్రతి విషయాన్ని బాగా అబ్జర్వ్ చేస్తుంటాను. ఎందుకంటే సినిమా అంటే అన్నింటి కలయికే అని నా ఉద్దేశం. `ఓ బేబీ` సినిమా విషయానికి వస్తే ప్రస్తుత సమయంలో జరిగే ఫాంటసీ మూవీ. కాబట్టి కలర్స్ ఎంపికలో చాలా జాగ్రత్తలు వహించాలి. వారు వేసుకునే డ్రెస్‌ను బేస్ చేసుకుని టోన్ ఉండేలా కేర్ తీసుకున్నాను. సాధారణంగా టోన్ ఆధారంగా డ్రెస్ సెలక్ట్ చేసుకుంటారు. కానీ మేం రివర్స్‌గా వెళ్లాం. మన సినిమాల్లో కెమెరా స్టైల్ కొరియన్, ఫిలిఫైన్, థాయ్ మూవీస్ స్టైల్లో ఉంటాయి. -
రచయితగా ఎప్పుడూ ఓడిపోలేదు
‘‘15ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. 50 నుంచి 60 సినిమాలకు రచయితగా పనిచేశా. ఇప్పటి వరకూ చేసిన సినిమాల్లో ‘ఓ బేబీ’ చాలా సంతృప్తినిచ్చింది’’ అన్నారు రచయిత లక్ష్మీభూపాల్. ‘చందమామ, అలా మొదలైంది, నేనే రాజు నేనే మంత్రి, కల్యాణ వైభోగమే’ వంటి సినిమాలకు మాటలు రాశారాయన. రచయితగా తన జర్నీ గురించి ఆయన మాట్లాడుతూ – ‘‘నేను యాక్సిడెంటల్ రైటర్ని. 1994 నుంచి టీవీ, మీడియా రంగంలో ఉన్నాను. 2004లో నటుడు లక్ష్మీపతిగారి ద్వారా మాటల రచయితగా మారాను. కష్టాలన్నీ ముందే పడ్డాను.. అందుకే సినిమా ప్రయాణం సాఫీగా సాగినట్టుంది(నవ్వుతూ). ఫస్ట్ ‘సోగ్గాడు’ సినిమాకు మాటలు రాశాను. అప్పటినుంచి వరుసగా సినిమాలు రాస్తూనే ఉన్నాను. పెద్ద హీరోల సినిమాలు ఎక్కువగా రాయలేదు. కానీ, పెద్ద బ్యానర్లలో సినిమాలకు రాశాను. నేను అందరికీ ఓపెన్‌గానే ఉన్నాను. పెద్ద హీరోల సినిమాలు ఎందుకు రావడం లేదో నాకు తెలియదు. బహుశా పంచ్‌లు, ప్రాసలు రాయనని పిలవట్లేదేమో? ‘ఓ బేబీ’ సినిమా కోసం నేను ప్రత్యేకంగా రాసింది ఏం లేదు. అన్నీ దేవుడు రాయించారనుకుంటాను. మా అమ్మమ్మ, అమ్మ మాట్లాడే మాటల్ని సినిమాలో పెట్టాను. ‘మగాడికి మొగుడులా బతికాను’ అనే మాట మా అమ్మమ్మ నోట్లో నుంచి చాలాసార్లు వచ్చింది. ఈ సినిమాని మా అమ్మమ్మ, అమ్మకు అంకితం చేస్తున్నాను. సమంత, నందినీగార్లు ప్రతి ఫంక్షన్లో నా గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నందుకు థ్యాంక్స్. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న దారుణాలు చూసి ‘మొలతాడుకి మోకాలుకి మధ్య కొవ్వు ఎక్కువై కొట్టుకుంటున్నారు’ అనే డైలాగ్ రాశాను. నేను చేసిన సినిమాల్లో ఎక్కువ శాతం ఫెయిల్యూర్సే ఉన్నాయి. కానీ, రైటర్‌గా నేనెప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. అలా అయ్యుంటే రెండో సినిమా దగ్గరే వెళ్లిపోయేవాణ్ణి. సినిమా నాకు నచ్చితేనే చేస్తాను. నాకే నచ్చకపోతే ప్రేక్షకుడికి నచ్చేలా ఏం రాస్తాను? త్రివిక్రమ్‌గారి వల్ల రచయితలకు డబ్బు విలువ తెలిసింది. రచయిత దర్శకుడిగా మారడానికి ఫ్రస్ట్రేషనో, రెమ్యూనరేషనో కారణం అవుతున్నాయి. దర్శకుడిగా మారే ఆలోచన ప్రస్తుతానికి నాకు లేదు. నా వద్ద ఓ 24 కథలు ఉన్నాయి. దర్శకుడిగా మారితే తీద్దాం అని ఆరు కథలు పక్కన పెట్టాను. నా తర్వాతి ప్రాజెక్టులు తేజ, నందినీ రెడ్డిగారు చేయబోయే సినిమాలే’’ అన్నారు. -
నిర్మాణం అంటే రోజుకో పెళ్లి చేసినట్టే
‘‘నిర్మాణంలో ముగ్గురు, నలుగురు ఇన్వాల్వ్ అయినప్పుడు వ్యత్యాసాలు రావడం సహజం. కానీ, మా అందరిలో ఒకరి బలం ఏంటో మరొకరికి తెలుసు. అలా అందరం కలసి సాఫీగా వర్క్ చేశాం. మా అందరి రథసారథి సురేశ్‌బాబు’’ అని సునీత తాటి, వివేక్ కూచిభొట్ల అన్నారు. సమంత లీడ్ రోల్లో లక్ష్మీ, రాజేంద్రప్రసాద్, రావు రమేశ్, నాగశౌర్య కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓ బేబీ’. నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. సురేశ్ బాబు, సునీతా తాటి, వివేక్ కూచిభొట్ల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదలైంది. ఈ సందర్భంగా సునీత తాటి మాట్లాడుతూ– ‘‘ఇంతకు ముందు ‘కొరియర్ బాయ్, సాహసం శ్వాసగా సాగిపో’ వంటి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాను. 2017లో ‘ఓ బేబీ’ సినిమా మొదలైంది. ఈ పాత్రకు లక్ష్మీగారు బావుంటారన్నది నందినీరెడ్డి ఐడియా. రాజేంద్రప్రసాద్ లుక్ బాగా సెట్ అయింది. ఆయన లుక్‌ని అల్లు అర్జున్ కూడా బాగా అభినందించారు. ‘ఓ బేబీ’ను హిందీలో రీమేక్ చేస్తాం. ఆలియా భట్ హీరోయిన్ అయితే బాగుంటుందనుకుంటున్నాం. వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్తుంది. కన్నడ, బెంగాలీలోనూ రీమేక్ కోసం అడుగుతున్నారు. చైనాలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. ఈ సినిమాను బూసాన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు తీసుకెళ్తున్నాం. ఇంత మంచి కథ ఇచ్చినందుకు మేం వాళ్లకు ఇవ్వబోయే గౌరవం అది’’ అన్నారు సునీత. వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ– ‘‘మా సినిమా విడుదలైన తొమ్మిదో రోజు కూడా బుక్ మై షోలో ట్రెండింగ్‌లో ఉంది. ఓవర్సీస్లో కూడా బాగా ఆడుతోంది. సినిమా నిర్మాణం అంటే రోజుకో పెళ్లి చేసినట్టే. ఫిల్మ్ మేకింగ్ చాలా ఈజీగా అనిపించేట్టు సురేశ్‌బాబు చేశారు. ఆయన సినిమాల్లో ప్రాఫిట్స్ ఇచ్చి మాకు పాఠాలు నేర్పారు. ప్రస్తుతం మేం చేస్తున్న ‘వెంకీ మామ’ సినిమా 70శాతం పూర్తయింది. దసరాకు రిలీజ్ చేద్దామనుకుంటున్నాం. మా ముగ్గురి కాంబినేషన్లో మూడు సినిమాలు రెడీ అవుతున్నాయి. త్వరలోనే వివరాలు చెబుతాం’’ అన్నారు. -
కటౌట్ పెట్టి అంచనాలు పెంచేశారు
‘‘ఓ బేబీ’ చిత్రం కోసం హైదరాబాద్‌లో నా కటౌట్ పెట్టడం సంతోషంగా ఉన్నా టెన్షన్‌గానూ ఉంది. నేను నటించిన ‘యు టర్న్’ సినిమా చాలా బావుందని చెప్పారు. కానీ, కలెక్షన్లు అనుకున్నంత రాలేదు. ఏ సినిమాకు అయినా కలెక్షన్లు ముఖ్యం. ఇందాక ఇంటి నుంచి వస్తున్నప్పుడు చైతూతో (నాగచైతన్య) ఇలా చెప్పా.. ‘కటౌట్లు పెట్టి అంచనాలు పెంచేస్తున్నారు, ఈ సినిమాకి కలెక్షన్లు రాకపోతే నేను పారిపోతా అని చెప్పాను (నవ్వుతూ)’’ అన్నారు సమంత. నందినీరెడ్డి దర్శకత్వంలో సమంత లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘ఓ బేబీ’. సీనియర్ నటి లక్ష్మీ, రాజేంద్రప్రసాద్, రావు రమేష్ ముఖ్య పాత్రల్లో నటించారు. సురేశ్ బాబు, సునీత తాటి, టి.జి.విశ్వప్రసాద్, హ్యున్ హు, థామస్ కిమ్ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా సమంత పంచుకున్న విశేషాలు. ► నా కెరీర్లో ‘ఓ బేబీ’కి చేసినంత ప్రమోషన్ ఇప్పటి వరకూ ఏ సినిమాకీ చేయలేదు. ఎందుకంటే నాకు ఈ చిత్రం చాలా ప్రత్యేకం. ఎక్కువ మంది చూడాలని ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రమోట్ చేస్తున్నా. నా గత సినిమా ‘మజిలీ’ ప్రమోషన్ కూడా నా బాధ్యతగా అనిపించింది. పెళ్లయ్యాక నేను, చైతన్య కలిసి చేసిన తొలి సినిమా కాబట్టి చేశా. ‘ఓ బేబీ’ పూర్తి బాధ్యత నాపై ఉండటం కొంచెం భయంగా ఉంది. అయితే సినిమాపై నమ్మకం ఉంది. ► సాధారణంగా చైతన్య సినిమాలు విడుదలప్పుడు మాత్రమే నేను తిరుమలకి వెళ్లేదాన్ని. కానీ, తొలిసారి నా సినిమా కోసం యూనిట్‌తో కలిసి తిరుమల వెళ్లొచ్చాను. లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు ఓపెనింగ్ కలెక్షన్లు ఎంతవరకూ ఉంటాయన్నది తెలియదు. మహేశ్‌బాబు, ఎన్టీఆర్, రామ్‌చరణ్, అల్లు అర్జున్ సినిమాలకైతే ప్రేక్షకులే థియేటర్‌కి వచ్చేస్తారు. కానీ, ఎంత స్టార్ హీరోయిన్ అయినా థియేటర్లకు జనాలను రప్పించడం చిన్న విషయం కాదు. థియేటర్‌కు వచ్చిన వారికి మాత్రం ఈ సినిమా నచ్చుతుంది. ► ఎమోషనల్ సీన్స్, రొమాన్స్, డ్రామాలకు ఉన్న రిథమ్ నాకు బాగా తెలుసు. కానీ, కామెడీ రిథమ్ తెలియదు. కామెడీ చూడటం, నవ్వడం తేలికే. కానీ చేయడం చాలా కష్టం. ‘అఆ’ చిత్రంలో కొంచెం ట్రై చేశా. కానీ, ఈ సినిమాలో వినోదం పూర్తి స్థాయిలో ఉంటుంది. ఈ విషయంలో రాజేంద్రప్రసాద్‌గారు నాకు చాలా బాగా నేర్పించారు. నానమ్మ, అమ్మమ్మలతో పెరిగిన జ్ఞాపకాలు నాకు లేవు. ఈ సినిమాలో బామ్మగా కనిపించాల్సిన సన్నివేశాల కోసం వృద్ధాశ్రమాలకు వెళ్లి బామ్మలు ఎలా ఉంటారని పరిశీలించాను. ► నందినీరెడ్డి ఇండస్ట్రీలో ఇన్నాళ్లుగా ఉన్నా ఎంతో స్వచ్ఛమైన హృదయంతో ఉంటారు. సామర ్థ్యం ఉన్న వారికే ఇండస్ట్రీలో అవకాశాలు వస్తాయి. మేల్ డైరెక్టరా? ఫిమేల్ డైరెక్టరా? అన్నది ముఖ్యం కాదు. జండర్ తేడాలు భవిష్యత్తులోనైనా రావనే అనుకుంటున్నా. అమ్మాయిలు చేస్తున్నప్పుడు ఎవరూ వేలెత్తి చూపకూడదని, ఎలాంటి తేడా రాకూడదని ఇంకా జాగ్రత్తలు తీసుకుని సినిమా చేశాం. ► ‘ఓ బేబీ’ క్లైమాక్స్ సీన్‌ని చాలా కష్టపడి చేశా. ఎమోషనల్ సీన్స్ ఈజీగా చేసేదాన్ని. కానీ, రావు రమేశ్‌గారు నా కొడుకు పాత్ర చేస్తున్నప్పుడు ఏడుపు రాలేదు. నా కెరీర్ మొత్తంలో ఒక ఏడుపు సీన్ కోసం రెండు గంటలు బ్రేక్ తీసుకుని, ఏడుపు తెచ్చుకుని చేసిన సినిమా ఇది. ► ప్రెగ్నెన్సీ విషయం గురించి అడగడంలో తప్పు లేదు? నేను కూడా నా ఫ్రెండ్స్‌ని పిల్లల గురించి ఎప్పుడు ప్లాన్ చేసుకున్నారని అడుగుతా. భగవంతుడి దయవల్ల, నా కుటుంబ సభ్యుల సపోర్ట్‌తో నేను స్వతంత్రంగా ఉండగలుగుతున్నా. నాకు ఇప్పుడప్పుడే పిల్లలు వద్దని చెప్పగలుగుతున్నా. ఈ పరిస్థితి మన అమ్మకో, అమ్మమ్మకో ఉండేది కాదేమో? ఇలాంటి ఎన్నో విషయాలను ఆలోచింపజేసే సినిమా ఇది. ► శేఖర్ కమ్ములగారు హీరోయిన్లను చూపించే తీరు బావుంటుంది. ఆయన దర్శకత్వంలో చేయాలని ఉంది. మణిరత్నం సార్ దర్శకత్వంలో చేయాలన్నది నా కల. నాకు దర్శకత్వం ఆలోచనలు మాత్రం లేవుగానీ, మహిళాప్రాధాన్యం ఉన్న కథలతో సినిమాలు నిర్మిస్తా. ప్రస్తుతం ‘96’ సినిమా సెట్స్ మీద ఉంది. ‘మన్మథుడు 2’ లో చిన్న పాత్ర చేశాను. -
మా ఇద్దరి ఒప్పందం అదే
‘‘సాధారణంగా అందరం మన అమ్మలను టేకిట్ ఫర్ గ్రాంటెడ్‌గా తీసుకుంటాం. కసురుతాం.. విసుక్కుంటాం. అయినా అమ్మ మనకు చాలా ప్రేమను పంచుతారు. మనమందరం తల్లులకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం లేదేమో? ‘ఓ బేబీ’ సినిమాలో ఈ పాయింట్‌ని చూపించాం. ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారనే నమ్మకం ఉంది’’ అని దర్శకురాలు నందినీ రెడ్డి అన్నారు. సమంత లీడ్ రోల్లో నాగశౌర్య, లక్ష్మీ, రాజేంద్రప్రసాద్, రావు రమేశ్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓ బేబీ’. సునీత తాటి, వివేక్ కూచిభొట్ల నిర్మించారు. సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ఈ సినిమా ఈ నెల 5న విడుదలకానుంది. నందినీ రెడ్డి పలు విశేషాలు పంచుకున్నారు. ► కొరియన్ చిత్రం ‘మిస్. గ్రానీ’ చూస్తున్నంత సేపు నేను చాలా కనెక్ట్ అయ్యాను. మదర్ సెంటిమెంట్ ఉంటుంది. అందరూ కనెక్ట్ అయ్యే కథ ఇది. కథలో క్వాలిటీ ఉంది. బెస్ట్ యాక్టర్స్ ఈ సినిమాలో పని చేశారు. లక్ష్మిగారు, రాజేంద్రప్రసాద్, రావు రమేశ్‌గారు, సమంత అందరూ తమ బెస్ట్ ఇచ్చారు. డైరెక్షన్లో నేను చే సిన చిన్నచిన్న తప్పులు కూడా వాళ్ల అద్భుతమైన యాక్టింగ్‌తో కవర్ చేసేశారు. ► ఆర్టిస్ట్‌కి కథ ప్లస్ అయ్యే సినిమాలు కొన్ని.. కథకు ఆర్టిస్ట్ ప్లస్ అయ్యే సినిమాలు మరికొన్ని. ‘ఓ బేబీ’ రెండు విభాగాల్లోకి వస్తుంది. ఈ సినిమాలో ఉన్న యాక్టర్స్ అందరూ విందు భోజనంలా ఉంటారు. సినిమాలో బేబక్క పాత్ర చాలా కీలకం. లక్ష్మీగారు అద్భుతంగా చేశారు. ఆమె ఒప్పుకోకపోయి ఉంటే ఈ సినిమాను చేసేవాళ్లం కాదేమో? ఈ పాత్రకు ఆప్యాయత, వెటకారం అన్నీ ఉండాలి. లక్ష్మీగారే కరెక్ట్ అని భావించాం. ► రీమేక్‌తో వచ్చిన చిక్కేంటంటే సినిమా సరిగ్గా రాకపోతే పాడు చేశారు అంటారు. హిట్ అయితే అలానే తీశారు.. హిట్ అయిపోయింది అంటారు. రీమేక్స్‌తో ఎక్కువ పేరు సంపాదించడం కొంచెం కష్టం. నా సినిమాలన్నీ 50 రోజుల్లోనే పూర్తి చేస్తాను. కానీ సినిమా సినిమాకు మధ్య గ్యాప్ ఎందుకొస్తుంది? అని అడుగుతుంటారు. ఒక్కోసారి ఐడియా స్టేజిలో బావుంటుంది. కథ రాశాక నచ్చకపోవచ్చు. అలా లేట్ అవుతూ సినిమా సినిమాకు గ్యాప్ వస్తుంది. ఈసారి నుంచి అలా జరగుకుండా చూసుకుంటాను. ► ఈ సినిమాకు సమంత కేవలం యాక్టర్‌గానే కాకుండా అన్ని బాధ్యతలూ చూసుకున్నారు. ‘నువ్వేదైనా తప్పు చేస్తుంటే నేను చెబుతా.. నేనేదైనా తప్పు చేస్తే నువ్వు చెప్పు.. మన మధ్య ఈగో అనేది అడ్డురాకూడదు అని సినిమా స్టార్ట్ అవ్వక ముందే సమంత–నేను ఒప్పందం చేసుకున్నాం(నవ్వుతూ). ► దర్శకురాలిగా అన్ని రకాల సినిమాలు చేయాలనుంది. యాక్షన్ కామెడీ, స్పోర్ట్స్ సినిమాలు చేస్తాను. ప్రస్తుతం వైజయంతీ బ్యానర్లో ఓ సినిమా చేయాలి. రెండు కథలున్నాయి. అందులో మల్టీస్టారర్ సినిమా ఒకటి. వెబ్ సిరీస్‌ల ట్రెండ్ కూడా బాగా పెరుగుతోంది. ఇంకా స్టార్టింగ్ స్టేజిలోనే ఉంది. వెబ్ థియేటర్‌కి హాని చేస్తుందా? అంటే చెప్పలేం. ► ‘ఓ బేబీ’ సినిమా పూర్తయ్యాక అమ్మ మీద కసురుకోవడం కొంచెం తగ్గింది. ఒకవేళ బేబీలా నేను మళ్లీ వయసులో వెనక్కి వెళితే సినిమాలు కాకుండా వేరే ప్రొఫెషన్ని కూడా ట్రై చేస్తానేమో? ఇండస్ట్రీలో మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉంది. కానీ మెల్లిగా ఆ సంఖ్య పెరగాలి. ఇంతకుముందుతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు మారాయి. ‘ఓ బేబీ’ సినిమా సెట్లో మహిళా సాంకేతిక నిపుణుల సంఖ్య కొంచెం పెరిగింది. మహిళలు ఉండాలనే ఉద్దేశం కంటే కూడా వాళ్ల ప్రతిభని గుర్తించే తీసుకున్నాం. -
బాలీవుడ్‌కి బేబీ
బేబీ బాలీవుడ్‌కి వెళ్లనుంది. ఇక్కడ సమంత ఫొటో ఉంది కాబట్టి ఆమె హిందీ తెరకు పరిచయం కాబోతున్నారని అనుకుంటున్నారా? అదేం కాదు.. సమంత నటించిన తాజా చిత్రం ‘ఓ బేబీ’ హిందీలో రీమేక్ కానుంది. కొరియన్ మూవీ ‘మిస్ గ్రానీ’ ఆధారంగా బి. నందినీరెడ్డి దర్శకత్వం ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, గురు ఫిల్మ్స్, క్రాస్ పిక్చర్స్ సంస్థలు నిర్మించాయి, సమంత, నాగశౌర్య, లక్ష్మీ, రావు రమేశ్, రాజేంద్ర ప్రసాద్ కీలకపాత్రలు చేసిన ఈ చిత్రం ఈ 5న విడుదల కానుంది. ‘ఓ బేబీ’ని హిందీలో నిర్మించాలనుకుంటున్నట్లు సోమవారం ప్రకటించారు. అక్కడి ఓ ప్రముఖ హీరోయిన్‌తో ఈ చిత్రాన్ని నిర్మించడానికి నిర్మాత డి. సురేష్‌బాబు బాలీవుడ్‌కి చెందిన ఓ నిర్మాణ సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నారు. -
ఫన్ రైడ్
వెండితెరపై సమంత ఉన్నప్పుడు థియేటర్స్‌లోని ఆడియన్స్‌కు ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు. ఆ ఎంజాయ్మెంట్ను మరోసారి ఆడియన్స్‌కు అందించడానికి సమంత రెడీ అయ్యారు. బీవీ నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ఓ బేబి’. సౌత్ కొరియన్ మూవీ ‘మిస్ గ్రానీ’ చిత్రానికి ఇది తెలుగు రీమేక్. డి. సురేశ్‌బాబు, సునీత తాటి, టీజీ విశ్వప్రసాద్, హ్యున్ హు, థామస్ కిమ్ నిర్మించారు. వివేక్ కూచిభొట్ల, యువరాజ్ కార్తికేయన్, వంశీ బండారు సహ నిర్మాతలు. ‘ఓ బేబి’ సినిమాను జూలై 5న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ‘‘ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్, టీజర్లకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఔట్ అండ్ ఔట్ ఫన్ రైడర్‌గా ఈ సినిమాను తెరకెక్కించాం. బంధాలు, బంధుత్వాలతో జీవితాన్ని ఎలా గడపాలనే విషయాలను ఆలోచింపజేసే కోణంలో ఈ సినిమాను నందినీ రెడ్డి రూపొందించారు’’ అని యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. సీనియర్ నటి లక్ష్మి, రాజేంద్రప్రసాద్, నాగశౌర్య, రావు రమేశ్, తేజ సజ్జ, ప్రగతి తదితరులు నటించిన ఈ సినిమాకు మిక్కీ జె. మేయర్ సంగీతం అందించారు. విజయ్ డొంకాడ, దివ్యా విజయ్ ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు. -
బీబర్ ..నిన్ను నువ్వే సరిదిద్దుకో:ఉషర్
లాస్ ఏంజిల్స్: టీనేజి పాప్ సంచలనం జస్టిస్ బీబర్ చేసిన స్వీయ తప్పిదాలనుంచి ఇకనైనా గుణపాఠం నేర్చుకోవాలని అమెరికన్ సింగర్ ఉషర్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం పలు వివాదాల్లో చిక్కుకున్న బీబర్ జరిగిన పరిణామాలపై అవగాహన పెంచుకుని, వాటిని చక్కదిద్దుకునేందుకు యత్నించాలని సూచించాడు. పదమూడేళ్లకే పాప్ సింగర్ గా కెరీర్ ను ఆరంభించిన బీబర్ సమస్యలకు అతనే కారణమన్నాడు. కనీసం వాటినుంచి బయటకు రావడానికి బీబర్ యత్నించడం లేదన్నాడు. ఇకనైనా వాటిని అధిగమించాలని ఉషర్ హితవు చేశాడు. 'బీబర్ చేసిన స్వీయ తప్పల నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. అతను ఇంకా చిన్నవాడే. నా నుంచి బీబర్ ఏమైనా సలహాలు అడిగితే తప్పక సహాయం అందిస్తానని' 35 ఏళ్ల ఉషర్ తెలిపాడు. -
కెండల్ జెన్నర్‌తో జస్టిన్ బీబర్ డేటింగ్?
ఓ బేబీ.. బేబీ అంటూ చిన్న వయసులోనే తారాపథానికి ఎదిగిన పాప్ సింగర్ జస్టిన్ బీబర్ ఇప్పుడు కెండల్ జెన్నర్ అనే అమ్మడితో డేటింగ్ చేస్తున్నాడట. వీళ్లిద్దరూ కలిసి ఓ డిన్నర్‌కు వెళ్లి హాయిగా ఆస్వాదిస్తూ తింటూ అందరికీ కనిపించడంతో ఈ కథనాలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. ఏప్రిల్ 28వ తేదీన మన్హట్టన్లో కెండల్ స్నేహితుడు హైలీ బాల్డ్విన్తో పాటు వీళ్లిద్దరూ కలిసి డిన్నర్ చేశారు. దాదాపు రెండు గంటల పాటు వీరి డిన్నర్ పార్టీ సాగిందని యూఎస్మాగజైన్.కామ్ తెలిపింది. భోజనం ముగిసిన తర్వాత ముందుగా బీబర్ అక్కడినుంచి వెళ్లిపోతే.. కాసేపటి తర్వాత మిగిలిన ఇద్దరూ వెళ్లారట. బీబర్ అప్పుడప్పుడు తిరిగే సెలెనా గోమెజ్‌తో అతడికి ఇప్పుడు చెడిపోయిందని చెబుతున్నారు. జెన్నర్, ఆమె చెల్లెలు కైలీ జెన్నర్ ఇద్దరూ కలిసి జస్టిన్ బీబర్, అతడి బృందంతో రాసుకుపూసుకు తిరుగుతున్నారని, తెగ వాగుతున్నారని ఇటీవల సెలెనా చెప్పింది. దీన్ని బట్టి కూడా జస్టిన్ బీబర్ ఇప్పుడు కొత్త స్నేహితురాలిని వెతుక్కుని ఆమెతో డేటింగ్‌కు వెళ్తున్నాడని అంటున్నారు.