కటౌట్‌ పెట్టి అంచనాలు పెంచేశారు | Samantha gets huge cut-out erected for Oh Baby | Sakshi
Sakshi News home page

కటౌట్‌ పెట్టి అంచనాలు పెంచేశారు

Published Fri, Jul 5 2019 12:22 AM | Last Updated on Fri, Jul 5 2019 10:37 AM

Samantha gets huge cut-out erected for Oh Baby - Sakshi

‘‘ఓ బేబీ’ చిత్రం కోసం హైదరాబాద్‌లో నా కటౌట్‌ పెట్టడం సంతోషంగా ఉన్నా టెన్షన్‌గానూ ఉంది. నేను నటించిన ‘యు టర్న్‌’ సినిమా చాలా బావుందని చెప్పారు. కానీ, కలెక్షన్లు అనుకున్నంత రాలేదు. ఏ సినిమాకు అయినా కలెక్షన్లు ముఖ్యం. ఇందాక ఇంటి నుంచి వస్తున్నప్పుడు చైతూతో (నాగచైతన్య) ఇలా చెప్పా.. ‘కటౌట్లు పెట్టి అంచనాలు పెంచేస్తున్నారు, ఈ సినిమాకి కలెక్షన్లు రాకపోతే నేను పారిపోతా అని చెప్పాను (నవ్వుతూ)’’ అన్నారు సమంత. నందినీరెడ్డి దర్శకత్వంలో సమంత లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘ఓ బేబీ’. సీనియర్‌ నటి లక్ష్మీ, రాజేంద్రప్రసాద్, రావు రమేష్‌ ముఖ్య పాత్రల్లో నటించారు. సురేశ్‌ బాబు, సునీత తాటి, టి.జి.విశ్వప్రసాద్, హ్యున్‌ హు, థామస్‌ కిమ్‌ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా సమంత పంచుకున్న విశేషాలు.

► నా కెరీర్‌లో ‘ఓ బేబీ’కి చేసినంత ప్రమోషన్‌ ఇప్పటి వరకూ ఏ సినిమాకీ చేయలేదు. ఎందుకంటే నాకు ఈ చిత్రం చాలా ప్రత్యేకం. ఎక్కువ మంది చూడాలని ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రమోట్‌ చేస్తున్నా. నా గత సినిమా ‘మజిలీ’ ప్రమోషన్‌ కూడా నా బాధ్యతగా అనిపించింది. పెళ్లయ్యాక నేను, చైతన్య కలిసి చేసిన తొలి సినిమా కాబట్టి చేశా. ‘ఓ బేబీ’ పూర్తి బాధ్యత నాపై ఉండటం కొంచెం భయంగా ఉంది. అయితే సినిమాపై నమ్మకం ఉంది.

► సాధారణంగా చైతన్య సినిమాలు విడుదలప్పుడు మాత్రమే నేను తిరుమలకి వెళ్లేదాన్ని. కానీ, తొలిసారి  నా సినిమా కోసం యూనిట్‌తో కలిసి తిరుమల వెళ్లొచ్చాను. లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలకు ఓపెనింగ్‌ కలెక్షన్లు ఎంతవరకూ ఉంటాయన్నది తెలియదు. మహేశ్‌బాబు, ఎన్టీఆర్, రామ్‌చరణ్, అల్లు అర్జున్‌ సినిమాలకైతే ప్రేక్షకులే థియేటర్‌కి వచ్చేస్తారు. కానీ, ఎంత స్టార్‌ హీరోయిన్‌ అయినా థియేటర్లకు జనాలను రప్పించడం చిన్న విషయం కాదు. థియేటర్‌కు వచ్చిన వారికి మాత్రం ఈ సినిమా నచ్చుతుంది.

► ఎమోషనల్‌ సీన్స్, రొమాన్స్, డ్రామాలకు ఉన్న రిథమ్‌ నాకు బాగా తెలుసు. కానీ, కామెడీ రిథమ్‌ తెలియదు. కామెడీ చూడటం, నవ్వడం తేలికే. కానీ చేయడం చాలా కష్టం. ‘అఆ’ చిత్రంలో కొంచెం ట్రై చేశా. కానీ, ఈ సినిమాలో వినోదం పూర్తి స్థాయిలో ఉంటుంది. ఈ విషయంలో రాజేంద్రప్రసాద్‌గారు నాకు చాలా బాగా నేర్పించారు. నానమ్మ, అమ్మమ్మలతో పెరిగిన జ్ఞాపకాలు నాకు లేవు. ఈ సినిమాలో బామ్మగా కనిపించాల్సిన సన్నివేశాల కోసం వృద్ధాశ్రమాలకు వెళ్లి బామ్మలు ఎలా ఉంటారని పరిశీలించాను.

► నందినీరెడ్డి ఇండస్ట్రీలో ఇన్నాళ్లుగా ఉన్నా ఎంతో స్వచ్ఛమైన హృదయంతో ఉంటారు. సామర ్థ్యం ఉన్న వారికే ఇండస్ట్రీలో అవకాశాలు వస్తాయి. మేల్‌ డైరెక్టరా? ఫిమేల్‌ డైరెక్టరా? అన్నది ముఖ్యం కాదు. జండర్‌ తేడాలు భవిష్యత్తులోనైనా రావనే అనుకుంటున్నా. అమ్మాయిలు చేస్తున్నప్పుడు ఎవరూ వేలెత్తి చూపకూడదని, ఎలాంటి తేడా రాకూడదని ఇంకా జాగ్రత్తలు తీసుకుని సినిమా చేశాం.

► ‘ఓ బేబీ’ క్లైమాక్స్‌ సీన్‌ని చాలా కష్టపడి చేశా. ఎమోషనల్‌ సీన్స్‌ ఈజీగా చేసేదాన్ని. కానీ, రావు రమేశ్‌గారు నా కొడుకు పాత్ర చేస్తున్నప్పుడు ఏడుపు రాలేదు. నా కెరీర్‌ మొత్తంలో ఒక ఏడుపు సీన్‌ కోసం రెండు గంటలు బ్రేక్‌ తీసుకుని,  ఏడుపు తెచ్చుకుని చేసిన సినిమా ఇది.

► ప్రెగ్నెన్సీ విషయం గురించి అడగడంలో తప్పు లేదు? నేను కూడా నా ఫ్రెండ్స్‌ని పిల్లల గురించి ఎప్పుడు ప్లాన్‌ చేసుకున్నారని అడుగుతా. భగవంతుడి దయవల్ల, నా కుటుంబ సభ్యుల సపోర్ట్‌తో నేను స్వతంత్రంగా ఉండగలుగుతున్నా. నాకు ఇప్పుడప్పుడే పిల్లలు వద్దని చెప్పగలుగుతున్నా. ఈ పరిస్థితి మన అమ్మకో, అమ్మమ్మకో ఉండేది కాదేమో? ఇలాంటి ఎన్నో విషయాలను ఆలోచింపజేసే సినిమా ఇది.

► శేఖర్‌ కమ్ములగారు హీరోయిన్లను చూపించే తీరు బావుంటుంది. ఆయన దర్శకత్వంలో చేయాలని ఉంది. మణిరత్నం సార్‌ దర్శకత్వంలో చేయాలన్నది నా కల. నాకు దర్శకత్వం ఆలోచనలు మాత్రం లేవుగానీ, మహిళాప్రాధాన్యం ఉన్న కథలతో సినిమాలు నిర్మిస్తా. ప్రస్తుతం ‘96’ సినిమా సెట్స్‌ మీద ఉంది. ‘మన్మథుడు 2’ లో చిన్న పాత్ర చేశాను.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement