నిర్మాతను మాత్రమే : దియా మీర్జా
నిర్మాతను మాత్రమే : దియా మీర్జా
Published Fri, Oct 11 2013 2:00 AM | Last Updated on Fri, Sep 1 2017 11:31 PM
ముంబై: హైదరాబాదీ అందగత్తె దియా మీర్జా కెమెరా నుంచి కాస్త పక్కకు జరిగి నిర్మాత అవతారం ఎత్తింది. బాబీ జాసూస్ అనే సినిమాను స్వయంగా నిర్మిస్తున్నా అందులో మాత్రం నటించనందుకు బాధేమీ లేదని చెప్పింది. విద్యాబాలన్ ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తోంది. దియా తన ప్రియుడు సాహిల్ సంఘాతో కలిసి బార్న్ ఫ్రీ ఎంటర్‌టైన్‌మెంట్ అనే నిర్మాణసంస్థను నిర్వహిస్తోంది. ఇది తొలిసారిగా 2011లో ‘లవ్ బ్రేకప్స్ జిందగీ’ సినిమాను నిర్మిం చింది. బాబీ జాసూస్‌లో ఎందుకు నటించడం లేదన్న ప్రశ్నపై స్పందిస్తూ ‘నేను స్వార్థపరురాలిని కాదు. ఎందుకు నటించడం లేదో నాకే తెలియదు.
నాకు తెలిసిందల్లా నేను ఈ సినిమాను నిర్మిస్తున్నానని మాత్రమే. ఇది నా సొంత సినిమా కాబట్టి ఇందులో నన్ను కూడా చూసుకోవాలనే కోరికేదీ లేదు. పాత్రల కోసం బార్న్‌ఫ్రీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను స్థాపించలేదు. నిర్మాతను అయిన తరువాత సంకుచిత దృక్పథాన్ని వదిలేయాలి. నా ఆకాంక్షలను మరోమెట్టుకు ఎక్కించాలన్నదే నా ఆశ’ అని దియా వివరించింది. నటి అయితే కాసేపు కెమెరా ముందు కనిపించి వెళ్లిపోవాల్సి ఉంటుందని, నిర్మాత అయితే ఎన్నో పనులు చేయవచ్చని ఈ బ్యూటీ వివరించింది.
సినిమా అంటే తనకు వ్యామోహం ఉంది కాబట్టి దానిని నటిగా, నిర్మాతగా ఉపయోగించుకుంటున్నానని చెప్పింది. అంతేకాదు మెగాఫోన్ పట్టుకోవడానికి కూడా ఈ అమ్మడు తయారవుతోంది. ‘తప్పకుండా దర్శకురాలిగా మారుతాను. అది ఎప్పుడు అనేది చెప్పలేను గానీ.. మంచి కథ దొరకాలి’ అని చెప్పిన దియా బాబీ జసూస్ పాత్రకు విద్యను మినహా వేరేవరూ సరిపోరని స్పష్టం చేసింది. ఈ సినిమాను ఆమె అంగీకరించడానికి చాలా సమయం తీసుకుంటుందని దియా అనుకున్నా.. కేవలం నెలలోపే విద్య ఓకే చెప్పింది.
Advertisement
Advertisement