
మగపిల్లల్ని పెంచడం కూడా భయమే
చెన్నై: ఈ దుర్మార్గమైన దేశంలో మగపిల్లల్ని పెంచడం కూడా తనకు భయమే అని ప్రముఖ నటుడు, దర్శకుడు కమల్హాసన్ అన్నారు. తన తాజా చిత్రం 'పాపనాశం' ఈ శుక్రవారం విడుదలవుతున్న సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పాపనాశం చిత్రం విశేషాలను తెలుపుతూ తనకు కూడా తన ఇద్దరు ఆడపిల్లలు రక్షణ గురించి ఇప్పటికీ భయంగానే ఉంటుందన్నారు. శృతి, అక్షర స్థానంలో మగపిల్లలు ఉన్నా కూడా తాను ఇలాగా భయపడే వాడినన్నారు.
పాపనాశం ప్రోమోలో విభూతి పెట్టుకుని ఉన్నతనను చూసి చాలామంది మీరు నాస్తికులు కదా అని అడుగుతున్నారని తెలిపారు. కానీ సినిమా వేరు, జీవితం వేరన్నారు. సాధారణంగా తన వ్యక్తిగత భావాలను సినిమాల కోసం వదులుకోనన్నారు. మరీ తప్పదనుకుంటే తప్ప తన నమ్మకాలకు, విశ్వాసాలకు వ్యతిరేకంగా నటించనన్నారు. అలాగే ఒక కులాన్ని కీర్తించే సినిమాలు తాను ఎప్పుడూ చేయలేదని చెప్పుకొచ్చారు.
కేబల్ ఆపరేటర్గా పనిచేసే వ్యక్తి తన కుటుంబాన్ని, ముఖ్యంగా తన ఆడబిడ్డలను దుండగుల వేధింపుల నుంచి రక్షించుకునే కథాంశంతో తెరకెక్కుతున్నమూవీ పాపనాశం. మలయాళంలోనూ, తెలుగులోనూ ఘన విజయం సాధించిన 'దృశ్యం' సినిమాను కమల్ తమిళంలో రీమేక్ చేస్తున్నారు. జీతూ జోసేఫ్ దర్శకత్వంలో కమల్ హాసన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో గౌతమి మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.