
తప్పు.. తప్పు.. మార్పుల్లేవ్
తప్పు.. తప్పు.. ‘జై లవకుశ’ విడుదల ఆలస్యమవుతోందని వచ్చిన వార్తలన్నీ తప్పే అంటోంది నందమూరి తారక రామారావు ఆర్ట్స్ సంస్థ. ముందుగా ప్రకటించిన ప్లానులో మార్పుల్లేవ్ అని ప్రకటించింది. ఎన్టీఆర్ హీరోగా కె.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మిస్తున్న సినిమా ‘జై లవకుశ’. ప్రస్తుతం పూణెలో చిత్రీకరణ జరుగుతోందట. అయితే... చిత్రీకరణ నెమ్మదిగా జరుగుతున్న కారణంగా సినిమా విడుదలను వాయిదా వేయాలనుకుంటున్నారని కొన్ని వార్తలొచ్చాయి.
వీటిని నిర్మాణ సంస్థ ఖండించింది. ముందుగా ప్రకటించినట్టుగా సెప్టెంబర్ 21నే సినిమాను విడుదల చేస్తామని ప్రకటించింది. ఇందులో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. మూడు పాత్రల్లో ఒకటైన ‘జై’ లుక్, టీజర్ కొన్నాళ్ల క్రితమే విడుదల చేశారు. రీసెంట్‌గా రెండో క్యారెక్టర్ లవకుమార్ లుక్ విడుదల చేశారు. త్వరలో లవకుమార్ టీజర్ విడుదల చేయాలనుకుంటున్నారు. రాశీ ఖన్నా, నివేథా థామస్, నందిత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.