
అందుకే పోటీ చేస్తున్నా : జయసుధ
నన్ను పోటీ నుంచి తప్పుకోమని రాజకీయ నాయకుల నుంచి చాలా ఫోన్‌కాల్స్ వచ్చాయి. అసలు ఓ మహిళ ఎందుకు పోటీ చేయకూడదనే
‘‘నన్ను పోటీ నుంచి తప్పుకోమని రాజకీయ నాయకుల నుంచి చాలా ఫోన్‌కాల్స్ వచ్చాయి. అసలు ఓ మహిళ ఎందుకు పోటీ చేయకూడదనే ఆలోచనతోనే బరిలోకి దిగాను ’’ అని సీనియర్ నటి జయసుధ అన్నారు. ఈ నెల 29న జరగనున్న ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) అధ్యక్ష ఎన్నికల్లో జయసుధ పోటీ చేయనున్నారు. జయసుధకు మద్దతునిస్తూ మురళీమోహన్ హైదరాబాద్‌లో ఓ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ -‘‘జయసుధగారు అందరికన్నా సీనియర్.
ఆమె చాలా సేవా దృక్పథం కలిగిన వ్యక్తి. ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. ఓ మహిళా అధ్యక్షురాలిగా ఉన్న ఈ ప్యానెల్ కమిటీలో ఈ సారి ఏడుగురు మహిళలను తీసుకున్నారు. అసోసియేషన్ ఉపాధ్యక్షులుగా మంచు లక్ష్మీ, శివకృష్ణ ఎలాంటి పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు’’ అని తెలిపారు. కృష్ణంరాజు కూడా తన మద్దతు జయసుధకే అని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నరేశ్, మంచు లక్ష్మీ, హేమ, శివపార్వతి, రఘుబాబు, ‘మహర్షి’ రాఘవ, కృష్ణుడు తదితరులు పాల్గొన్నారు.