ఒకరికి మిస్సు...మరొకరికి ప్లస్సు..! | Due to the busy schedule ,hero and heroine missed the opportunities movies | Sakshi
Sakshi News home page

ఒకరికి మిస్సు...మరొకరికి ప్లస్సు..!

Published Sat, Mar 29 2014 12:13 AM | Last Updated on Sat, Sep 2 2017 5:18 AM

ఒకరికి మిస్సు...మరొకరికి ప్లస్సు..!

ఒకరికి మిస్సు...మరొకరికి ప్లస్సు..!

మనం తినే ప్రతి బియ్యపు గింజ మీద మన పేరు రాసి ఉండాలంటారు. అలాగే, ఏ పాత్ర ఎవరికి దక్కాలో కూడా ముందే రాసి ఉంటుందేమో. ఒక హీరో... ఫ్లాప్ అవుతుందని వదులుకున్న సినిమాలో మరో హీరో నటించి, హిట్ కొట్టిన సందర్భాలు చాలా ఉంటాయి. ‘డర్’... షారుక్ ఖాన్‌లోని మరో కోణం చూపించిన చిత్రం.
 
 ‘3 ఇడియట్స్’... ఆమిర్‌ఖాన్ కెరీర్‌లో మైలురాయిలాంటి సినిమా. కుడి ఎడమైతే అన్నట్లు.. వాస్తవానికి ‘డర్’లో ఆమిర్ నటించాల్సింది. కానీ, వర్కవుట్ కాదమోనని వదులుకున్నారు. ‘3 ఇడియట్స్’ మీద అదే ఫీలింగ్‌తో షారుక్ తిరస్కరించారు. ఇలాంటి సువర్ణావకాశాలను వదులుకున్న బాలీవుడ్ తారలు చాలామందే ఉన్నారు. వాళ్లల్లో ప్రధానంగా కొంతమంది గురించి చెప్పుకోవాలి. ఆ తారలు తిరస్కరించిన చిత్రాలేంటి? వాళ్లు వదులుకున్న కారణంగా లాభపడిన ఇతర తారలెవరు?... ఆ విషయాల్లోకి ఓ లుక్కేద్దాం...
 
 ఆమిర్‌కి భయం వేసింది!
 ‘డర్’ అంటే భయం అని అర్థం. బాలీవుడ్ అగ్రదర్శకుడు యశ్ చోప్రా సొంత సినిమా ఇది. ఇందులో నెగటివ్ షేడ్ ఉన్న లీడ్ రోల్‌కి ముందుగా ఆమిర్ ఖాన్‌నే తీసుకోవాలనుకున్నారు యశ్ చోప్రా. కానీ, ఈ పాత్ర తనకు సూట్ కాదనో లేక కథ మీద నమ్మకం కుదరకో ఆమిర్ తిరస్కరించారు. ఆయన అనుమానం, భయం షారుక్‌కి వరం అయ్యాయి. ఆమిర్ కాదనడంతో అప్పటికే ‘బాజీగర్’లో నెగటివ్ టచ్ ఉన్న కేరక్టర్ చేసిన షారుక్‌ని తీసుకున్నారు యశ్. ఈ సినిమా షారుక్ కెరీర్‌ని టర్న్ చేసింది. సో.. ఈ సినిమా విషయంలో తన జడ్జిమెంట్ తప్పినందుకు ఆమిర్ తనని తాను నిందించుకునే ఉంటారు.

 షారుక్‌కి మూడు షాక్‌లు!
 ఆమిర్ వదులుకున్న ‘డర్’ని వదులుకుని, జడ్జిమెంట్ విషయంలో ఫుల్ మార్కులు కొట్టేసిన షారుక్ ఖాన్, మూడు సినిమాలను అంచనా వేయడంలో విఫలమవ్వడం విశేషం. భారతదేశం గర్వించదగ్గ చిత్రాల్లో ‘లగాన్’ ఒకటనడం అతిశయోక్తి కాదు. ఇందులో హీరోగా నటించే అవకాశం ముందు షారుక్‌నే వరించింది.
 
 చిత్రదర్శకుడు అశుతోష్ గోవార్కర్ కథ రాసుకున్నప్పుడే షారుక్‌ని అనుకున్నారట. కానీ, ఈ బాలీవుడ్ బాద్‌షాకి ‘లగాన్’ కథ మీద నమ్మకం కుదరక సినిమా చేయడం కుదరదన్నారు. దాంతో ఆమిర్‌ఖాన్‌ని కలిశారు. ఈ సినిమా తర్వాత మరో గోల్డెన్ చాన్స్‌ని కూడా వదులుకున్నారు షారుక్. అదే ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’. సంజయ్ దత్ నటించిన ఈ చిత్రం నవ్వుల పువ్వులు పూయించడంతో పాటు పెద్ద హిట్టయ్యింది. ఈ చిత్ర దర్శక, నిర్మాతలు రాజ్‌కుమార్ హిరానీ, విదు వినోద్ చోప్రాలు ‘మున్నాభాయ్’గా షారుక్ బాగుంటారనుకున్నారు.
 
  కానీ, షారుక్ కాదనడంతో సంజయ్ దత్‌ని తీసుకున్నారు. ఆ సినిమా సాధించిన విజయానికి ఇతర భాషలవారి దృష్టి పడటం, తెలుగు, తమిళ్.. ఇలా పలు భాషల్లో రీమేక్ కావడం తెలిసిందే. లడ్డూలాంటి రెండు అవకాశాలను వదులుకున్న షారుక్ మిస్సయిన మూడో మంచి చాన్స్ ‘3 ఇడియట్స్’. ‘మున్నాభాయ్’ని కాదన్నప్పటికీ ఈసారి షారుక్ అంగీకరిస్తాడనే బలమైన నమ్మకంతో ‘3 ఇడియట్స్’ కథతో ఆయన్ని కలిశారు రాజ్‌కుమార్ హిరానీ. టైటిలే తేడాగా ఉంది... ఇదేం సినిమానో అనుకున్నారో ఏమో ఈ చిత్రాన్ని కూడా తిరస్కరించేశారు షారుక్. కట్ చేస్తే.. ఆమిర్ ఆ సినిమా చేయడం, 200 కోట్లు వసూలు చేసిన తొలి హిందీ సినిమాగా రికార్డ్ సృష్టించడం జరిగింది. ఇక, షారుక్ బాధ ఎలా ఉంటుందో ఊహించవచ్చు.
 
 షాహిద్ వల్ల ధనుష్‌కి లాభం
 చాక్లెట్ బోయ్ ఇమేజ్ ఉన్న షాహిద్ కపూర్ కారణంగా తమిళ హీరో దనుష్ చాలా లాభపడ్డారు. ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వం వహించిన ‘రాన్‌జనా’ చిత్రంలో షాహిదే నటించాల్సి ఉంది. షాహిద్‌కి ఆ చిత్రకథ, హీరో పాత్ర నచ్చాయి. కానీ, డేట్స్ లేకపోవడంతో ఆ సినిమా వదులుకున్నారు.
 
  సినిమాలో హీరో తమిళ కుర్రాడు కాబట్టి, తమిళ హీరోనే తీసుకుంటే బాగుంటుంది కదా అనుకున్నారు ఆనంద్. మంచి మాస్ హీరోగా, నటుడిగా ధనుష్‌కి కోలీవుడ్‌లో మంచి పేరు ఉంది. అందుకని తనని తీసుకున్నారు. మొత్తం బాలీవుడ్ అంతా విస్తుపోయేలా ధనుష్ ఈ చిత్రంలో అద్భుతంగా నటించారు. ఒకవేళ షాహిద్ అయినా ఆ పాత్ర బాగానే చేసి ఉంటారు. ప్చ్.. డేట్స్ లేక వదులుకున్నారు. ఇక, షాహిద్ వదులుకున్న మరో మంచి అవకాశం ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’. పరిణీతి చోప్రా, వాణీకపూర్ నాయికలుగా నటించారు. కొత్త నాయికల సరసన నటించడానికి ఇష్టపడక షాహిద్ ఈ చిత్రాన్ని వదులుకున్నారనే టాక్ ఉంది. ఆయన అయిష్టమే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కి హెల్ప్ అయ్యింది. ‘కై పో చే’ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన సుశాంత్ సింగ్‌కి మంచి పేరొచ్చింది. ఆ తర్వాత చేసిన ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’ కమర్షియల్ హీరోగా నిలదొక్కుకోగలుగుతాడనే ఇమేజ్ తెచ్చింది.
 
 కరీనా వదులుకున్న ఆ నాలుగు సినిమాలు
 కల్ హో నా హో, హమ్ దిల్ దే చుకే సనమ్, క్వీన్, గోలియోన్ కీ రాసలీలా రామ్-లీలా... ఇలా కరీనా కపూర్ వదులుకున్న సూపర్ హిట్ చిత్రాల జాబితా చాలానే ఉంది. ఈ నాలుగు సినిమాలూ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. మరి.. సూపర్ హిట్ మూవీస్‌ని వదులుకున్నందుకు కరీనా ఫీలవుతారా అంటే లేదనే చెప్పాలి. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో.. ‘‘నేను ఓ సినిమా వదులుకున్నాననుకోండి.. వేరే హీరోయిన్‌కి అవకాశం ఇచ్చినట్లేగా. నా కారణంగా ఇతర నాయికలు లాభపడటం నాకు ఆనందమే’’ అని కరీనా చెప్పడం విశేషం.
 
 కంగనా జాతీయ అవార్డు మిస్సయిందా?
 రజ్జో, క్వీన్.. ఇలా ఇటీవల కంగనా రనౌత్ చేసిన సినిమాలు ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా తనలో మంచి నటి ఉందని నిరూపించాయి. ఒకవేళ ‘డర్టీ పిక్చర్’ చేసి ఉంటే, ఆమెలో మంచి నటి ఉందని కొంచెం ముందే ప్రేక్షకులకు తెలిసి ఉండేది. కానీ, ‘డర్టీ పిక్చర్’కి నిర్మాత ఏక్తా కపూర్ అడిగినప్పుడు, సంశయించారట కంగనా. కొన్ని రోజులు ఆలోచించుకుని, చివరికి ‘నో’ అనేశారట. ఆ తర్వాత హోమ్లీ ఇమేజ్ ఉన్న విద్యాబాలన్ ఈ చిత్రాన్ని అంగీకరించడం, నటనాపరంగా విజృంభించడం తెలిసిందే. ఈ సినిమా ఆమెకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు కూడా తెచ్చిపెట్టింది. ఒకవేళ కంగనా చేసి ఉంటే.. తనను ఆ అవార్డు వరించి ఉండేదేమో.
 
 ఇలా చెప్పుకుంటూ పోతే... మంచి సినిమాలను ‘మిస్’కొట్టిన తారల జాబితా చాలానే ఉంటుంది. ఎంతో నమ్మకంతో ఒప్పుకున్న సినిమాలు అపజయం పాలవ్వడం, ఏ అంచనాలూ లేకుండా చేసిన సిని మాలు ఘనవిజయం సాధించడం జరుగుతుంది. అందుకే అంటారు.. సినిమా అనేది ‘లాటరీ’లాంటిదని.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement