అలాంటి గ్లామర్‌ను అంగీకరించను
వారసులకు అవకాశాలు వరించడం అనేది సులభమే.ఏమయినా ప్రతిభ ఒక్కటే చాలదు అదృష్టం తోడవ్వాలి. అలాంటి వాటి కోసం ఎదురు చూస్తున్న వారసులు కార్తీక, తులసి. ఈ ఇద్దరు ఒక నాటి గ్లామర్ క్వీన్ రాధ కూతుళ్లన్న విషయం తెలిసిందే. ఎందుకంటే వీళ్లు ఇప్పటికే హీరోయిన్లుగా తెరంగేట్రం చేశారు. నటి కార్తీక నాలుగైదు చిత్రాలు చేసినా, కో చిత్రంతో విజయం ఖాతాను ఓపెన్ చేసుకున్నా, మలి విజయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఆమె చెల్లెలు తులసి సక్సెస్ బోణీ కోసం ఆరాటపడుతున్నారు. ప్రస్తుతం జీవాతో జతకట్టిన యాన్ చిత్రం విడుదల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అమ్మ పేరుకు భగం రాకూడదని భావిస్తున్న తులసితో చిన్న ఇంటర్వ్యూ.
యాన్ చిత్ర అవకాశం ఎలా వచ్చింది?
యాన్ చిత్రంలో హీరోయిన్ పాత్రకు నేను పర్ఫెక్ట్‌గా ఉంటానని దర్శకుడు రవి.కె.చంద్రన్ భావించినట్లు తెలిపారు. అమ్మ మొదట కథ విన్నారు. చాలా బాగుందనిపించింది.అందుకే పదవ తరగతి పరీక్షలు కూడా రాయకుండా యాన్ చిత్రంలో నటించాను.
చిత్రంలో మీ పాత్ర గురించి?
ఇందులో నేను నాజర్ కూతురిగా నటించాను. నా పాత్ర హీరోకు దీటుగా ఉంటుంది. ఈ చిత్ర పాటల్లో సరికొత్త కాస్ట్యూమ్స్ ధరించి నటించాను. విదేశాలలో చిత్రీకరించిన ఈ పాటల్లో సరికొత్త తులసిని చూస్తారు.
హీరో జీవా గురించి?
ఆయన ఇంతకు ముందే అక్క కార్తీకతో కో చిత్రంలో నటించారు. ఆయన షూటింగ్ స్పాట్‌లో చాలా టిప్స్ చెప్పేవారు. మొదట్లో జీవాతో కలిసి నటించడానికి కాస్త తడబడ్డాను. ఎందుకంటే ఆయన అనుభవమున్నహీరో. నాకిది రెండో చిత్రమే కదా.
తొలి చిత్రం కడల్ అపజయం నిరాశపరచిందా?
అలాగని చెప్పలేను. నిజం చెప్పాలంటే తొలి చిత్రమే నాకు పెద్ద చిరునామా నిచ్చింది. నటి రాధ కూతురన్న ప్లస్ పాయింట్ ఒక పక్క ఉన్నా మణిరత్నం పరిచయం చేసిన హీరోయిన్ అన్న ఘనత నాకు దక్కింది. ఆయన ఊహించి నంతగా నేనూ నటించాను. మణిరత్నం, గౌతమ్ కార్తిక్, ఎ.ఆర్.రెహ్మాన్ కాంబినేషన్ నన్ను బాహ్య ప్రపంచానికి పరిచయం చేసింది.
కథలు ఓకే చేయడం మీ అమ్మనే నటగా?
అదేమీకాదు. కథలు అమ్మ, నేను ఇద్దరం వింటాం. అయితే తుది నిర్ణయం నువ్వే తీసుకో అని అమ్మ చెబుతుంది. ఇప్పుడు అక్క కార్తీక సహకారం తోడయ్యింది. మేకప్, మేనరిజం, కాస్ట్యూమ్స్, నటన ఇలా చాలా విషయాల్లో అక్క టిప్స్ చెబుతుంటుంది.
గ్లామర్‌లో మీ అమ్మ ఆంక్షలుంటాయట?
అలాంటిదేమీ లేదు. కథను బట్టి గ్లామర్ పరంగా ఎంత దూరం వెళ్లవచ్చు అని కూడా ఆలోచిస్తాను. కడల్ చిత్రంలో ముద్దు సన్నివేశంలో కూడా హద్దులు మీరలేదు. అనవసర గ్లామర్ ప్రదర్శనను అంగీకరించను. నాకు కొన్ని బాధ్యతలున్నాయి. సినిమాలో నటించడం అనేది ఒక ఫ్యాషన్. దాన్ని అందంగా అభిమానిస్తూ చేసుకుపోవాలని ఆశిస్తున్నాను. ష్కూటింగ్ స్పాట్‌లో కూడా అమ్మ, నాన్న ఎవరూ నా నటన విషయంలో తలదూర్చరు.